Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భారతదేశ చరిత్ర రచనకు ఏది ప్రామాణికత?


వ్యాపారం పేరుతో మన దేశానికీ వచ్చి, మనల్ని ఆక్రమించుకుని నూటయాభై సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు ఇక్కడున్న వ్యవస్థలన్నింటినీ నాశనం చేసేరు. వారు అక్కడితో ఆగలేదు. తమ సంస్కృతీ ధర్మాలపై భారతీయులలో గల ఆంతరిక నిష్ఠను దెబ్బతీసేందుకు మనపై మెకాలే విద్యా విధానాన్ని రుద్దేరు. అందులో భాగంగా వక్రీకరించబడిన మనదేశ చరిత్రను పాఠ్యాంలుగా ప్రవేశపెట్టారు. 

మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్ళు దాటినా ఇంకా అదే చరిత్రను మన పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాలలోనూ బోధిస్తున్నాం. 

కాలమనే కొలమానంతో లెక్కగట్ట గలిగితేనే చరిత్రగా పరిగణించడం పాశ్చాత్యుల పధ్ధతి. ఆ మేరకు వారు రాజులు, రాజవంశాలు, రాజ్యపాలన, రాజ్య విస్తరణ కొరకు ఇతర రాజ్యాలను ఆక్రమించడం, దాని కోసం యుద్ధాలు చెయ్యడం వీటి గురించిన చర్చ చేయడమే వారి దృష్టిలో చరిత్ర అంటే.

అయితే ఒకరిపై అధికారం చెలాయించడానికో, ఆ అధికారాన్ని నిలుపుకోడానికి లేదా విస్తరింపజేసుకోవడానికై కోసం యుద్ధాలు చేయడానికి మాత్రమే మానవ జీవితం పరిమితం కాలేదు. చరిత్ర అంటే రాజులూ, రాజ్యాలు, యుద్ధాలు, రాజ వంశాలు మాత్రమే కాదు. మానవ జీవితంతో ముడిపడిన ప్రతిదానికీ చరిత్ర ఉంటుంది. మానవ జీవితంలో ధర్మం ఉంది. ప్రేమ, దయ, సహనం, స్నేహం, సేవ, త్యాగం, ఔదార్యం ఇలా ఎన్నో సద్గుణాలు మనిషి ఆదర్శ జీవితం గడపడానికి దోహదం చేస్తాయి. మనిషికి స్ఫూర్తినిచ్చే ఈ సద్గుణాలకు సంబంధించిన ఉదంతాలు కూడా చరిత్రే.

భారతదేశ చరిత్రను అధ్యయనం చేసేవారు, పరిశోధన జరిపేవారు కొన్ని మౌలిక విషయాల గురించి ఆలోచించాలి. అసలు చరిత్ర ఎందుకు? మనం ఎవరి చరిత్రను, ఎందుకు చదవాలి? మనపై దండయాత్రలు జరిపి, మనలను గెలుచుకున్న వారి గాధాలకే మన చరిత్రను పరిమితం చెయ్యాలా? లేదా కొన్ని వంశక్రమాలు, భౌతిక విషయాలకే చరిత్ర పరిమితమా?

చరిత్ర అధ్యనం వల్ల ఏమి ప్రయోజనం? 1. పూర్వ అనుభవం ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి ఉపకరిస్తుంది. 2. సద్వర్తన వాళ్ళ సత్ఫలితాలు పొంది సత్పురుషుల జీవితాలు అధ్యయనం వల్ల మన జీవితాలకు మార్గదర్శనం లభిస్తుంది. 3. దుర్గుణాల వల్ల మనిషికి, సమాజానికి జరిగిన చేటు మనకి హెచ్చరికగా నిలుస్తుంది.

అందుకే భారతీయ చరిత్రకారులు రాచరిక వ్యవస్థలకో, కాలగణనకో మాత్రమే చరిత్ర రచనను పరిమితం చేయలేదు. ఈ ప్రాతిపదికన పురాణాలు, ఇతిహాసాలు మన చరిత్రయే. 

చరిత్ర బోధన పరమోద్దేశ్యం ఉత్తమ జీవన విలువలతో కూడిన వ్యక్తి నిర్మాణం. ప్రస్తుతం బోధింప బడుతున్న చరిత్ర పాఠ్యాంశాలు ఈ ప్రయోజనాన్ని నేరవేర్చవు.

ఎందుకంటే పాశ్చాత్య చరిత్రకారులు రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేరు. కాని పురాణాలలో ధర్మానికి ప్రముఖ స్థానము. దాని చుట్టూ ఎన్నో సంఘటనలు, రాజుల చరిత్రలు, ఋషుల చరిత్రలు, సామాన్యుల చరిత్రలు చేర్చారు. దానివల్ల రాజ్యపాలనే గాక ప్రజల సంస్కృతీ, నాగరికతల గురించి కూడా తెలుస్తుంది. ఇవేవీ ఆధునిక చరిత్రకారులకు పట్టవు.

చరిత్ర యొక్క పాత్ర గతకాలపు సంఘటనలను తెలుసుకోవడానికి మాత్రమే పరిమితం కాదు. మానవ జీవితంలో చరిత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక జాతి పునర్నిర్మాణంలో అది ఎంతో ప్రేరణదాయకంగా నిలుస్తుంది. జాతి అంటే మన ఉద్దేశ్యంలో పాశ్చాత్యులు చెప్పిన అర్థం లేని నిర్వచనం మాత్రమే కాదు. మన దృష్టిలో జాతీయత లేదా రాష్ట్రీయత అనేది యుగయుగాలుగా మనల్ని నడిపిస్తూన్న సాంస్కృతిక విలువలు కూడా. మన పూర్వీకుల గూర్చి, మన సంస్కృతీ ధర్మాల సంరక్షణకై వారు చేసిన పోరాటాలు, బలిదానాలను గూర్చి తెలుసుకున్నప్పుడే మనందరిలో దేశం పట్ల భక్తి, మనమందరం ఒకటే అన్న భావన పెంపొందుతాయి.

మనదేశ చరిత్ర లిఖితపూర్వకంగా లేదంటారు. కాని పురాణాలు చరిత్రే. ఆధునిక చరిత్రకారులుగా చెలామణీ అవుతున్నవారు క్రీస్తు పూర్వానికి చెందిన దేనినీ చరిత్రగా అంగీకరించరు.

నిజానికి భారతదేశంలో చరిత్ర అధ్యయనము, పరిశోధనలపై పాశ్చాత్య, వామపక్ష భావాల ఆధిపత్యం రాజ్యమేలుతోంది. పాశ్చాత్య దృక్పథంతోనే మనదేశాన్ని అధ్యయనం చేయడాన్ని మన చరిత్ర పాఠాలు బోధిస్తున్నాయి. ఇది బ్రిటిష్ వారు మనపై బలవంతంగా రుద్దిన ఆలోచనా ధోరణి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా చరిత్రాధ్యయనంలో ఈ ధోరణే కొనసాగుతోంది. ఇది చాలా దురదృష్టకరమైనది. ప్రతి జాతికీ తనదైన దృక్పథంతో చరిత్ర అధ్యయనము, రచన చేసే హక్కు ఉంది. చరిత్రాధ్యయనంలో, రచనలో మనకి మనదైన జాతీయ దృక్పథం ఉండాలి. ఇదే భారతీయకరణం అంటే. అటువంటి చరిత్రే విద్యార్థులకు దేశభక్తి ప్రేరణనిస్తుంది.

భారతదేశ చరిత్ర రచనకు ఏది ప్రామాణికత? Reviewed by rajakishor on 5:49 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.