ఒమన్ సుల్తాన్ ఆరోగ్యం కోసం వేదపండితులచే హోమం
ఖాబూస్ బిన్ సయీద్ అల్ సయీద్ గల్ఫ్ దేశాలలో ఒకటైన ఒమాన్ దేశానికి సుల్తాను. 72 ఏళ్ళ వయసున్న ఈయన కొంత కాలంగా కాలాన్ (పెద్దప్రేగు) కేన్సర్ తో బాధపడుతున్నారు. సుల్తాను ఆరోగ్యం కుదుటపడాలని ఒమన్ లో నివసిస్తున్న భారతీయులు నవంబర్ 9, 2014 (ఆదివారం) నుండి ఐదు రోజుల పాటు మస్కట్ లో ఈ హోమాన్ని నిర్వహించేరు. ఈ హోమం చేయించడానికి బెంగళూరుకి చెందిన జ్యోతిష్కుడు చంద్రశేఖర్ స్వామితో పాటు కర్నాటక రాష్ట్రానికి చెందిన 22 మంది వేద పండితుల బృందం మస్కట్ కి వెళ్ళింది. సుల్తాను అతిథులుగా వీరికి అక్కడ గౌరవమర్యాదలు జరిగేయి.
ఈ హోమాన్ని నిర్వహించడానికి గుజరాత్ నుంచి వచ్చిన ఒకరు ఒమాన్ సుల్తానుకి సలహాదారుగా వ్యవహరించేరు.
మస్కట్ విమానాశ్రయానికి 41 కి.మీ.ల దూరంలో గల బర్ఖా పట్టణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంగణంలో తాము ఐదు రోజుల పాటు 22 మంది వేద పండితులతో హోమాన్ని నిర్వహించేమనీ, కేన్సర్ తో బాధ పడుతున్న సుల్తాను ఈ హోమం వల్ల తనకు నయమౌతుందని విశ్వసించేరనీ, ఒమన్ కి చెందిన కొందరు రాజ కుటుంబీకులు కూడా ఈ హోమంలో పాల్గొన్నారనీ చంద్రశేఖర స్వామి అన్నారు.
ఐదు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో ధన్వంతరి యాగం, పూర్ణ నవగ్రహ శాంతి హోమం, మహా మృత్యుంజయ యాగం, మహా విష్ణు యాగాలను చేసేరు. హోమం చేయించడానికి వెళ్ళిన వేద పండితులలో కొందరు మంగుళూరులోని పూర్ణ ప్రజ్ఞా విద్యా పీఠానికి చెందినవారు, మరికొందరు కేరళ నుండి వచ్చినవారు.
హోమం చేయించినదుకు గాను చంద్రశేఖర స్వామికి, వేద పండితులకు ఒమన్ ప్రభుత్వం 30 లక్షల రూపాయలు గౌరవ పారితోషికంగా ఇచ్చింది. వారంతా ఒమన్ వెళ్ళి వచ్చేందుకు, అక్కడ ఉండడానికి, ఇతర ఏర్పాట్లకు అయ్యే ఖర్చులన్నింటినీ అక్కడి రాజ కుటుంబీకులు భరించేరు.
సుల్తాన్ ఖాబూస్ 9 జూలై, 2014 న చికిత్స కోసం జర్మనీ వెళ్ళేరు. వైద్య చికిత్సల వల్ల సుల్తాను ఆరోగ్యం బాగానే ఉందనీ, భగవంతుని దయవల్ల ఆయనకు పూర్తిగా నయమవుతుందని భావిస్తున్నామనీ ఒమన్ అధికార ప్రకటన పేర్కొంది.
జూలై 2014లో కర్ణాటకలో మంగుళూరుకి 40 కి. మీ. దూరంలో హొసనాడు వద్ద గల శ్రీ దేవీ అన్నపూర్ణేశ్వరీ క్షేత్రంలో సుల్తాను ఆరోగ్యం కోసం యాగం చేసేరు, ప్రత్యేక ప్రార్థనలు చేసేరు. జూలై 13న ఉదయం 8 గంటలనుండి మధ్యాహ్నం 12. 30 గంటల వరకు చండికా యాగాన్ని నిర్వహించేరని, తరువాత అన్నదాన కార్యక్రమ జరిగిందనీ ఆలయ అధికారులు చెప్పేరు. ఈ ఆలయ వ్యవస్థాపకుడైన కోడ్యాడ్క జయరాం హెగ్డేకి ఒమన్ సుల్తానుతో మంచి సంబంధాలు ఉన్నాయి.
ఒమన్ సుల్తాన్ ఆరోగ్యం కోసం వేదపండితులచే హోమం
Reviewed by rajakishor
on
5:56 PM
Rating:
Reviewed by rajakishor
on
5:56 PM
Rating:

nice site....good
ReplyDelete