భారతీయ మార్స్ మిషన్ కి న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ
పైన ఉన్న వ్యంగ్య చిత్రాన్ని చూసేరుగా. Elite Space Club కి చెందిన ఇద్దరు సభ్యులు భారతదేశ మార్స్ ప్రయోగం గురించిన వార్త చదువుతున్నారు. ఇంతలో భారతదేశపు రైతు ఒక ఆవును వెంటబెట్టుకు వచ్చి Elite Space Club తలుపు తడుతూంటే వారి ముఖ కవళికలు అసహనంగా మారిపోయాయి.
ఈ వ్యంగ్య చిత్రం అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
భారత అంతరిక్ష పరిశోధక సంస్థ ఇస్రో Mars Orbiter Mission (MOM) పేరుతో అంగారక గ్రహంపైకి గత ఏడాది ప్రయోగించిన Orbiter పేరు గల ఉపగ్రహం 300 రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత విజయవంతంగా అంగారక గ్రహ కక్ష్యలోకి సెప్టెంబరు 24, 2014 న ప్రవేశించిన విషయం అందరికీ తెలిసిందే. ఇది అంగారక గ్రహం చుట్టూ నిర్దేశిత దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆ గ్రహానికి చెందినా సమాచారాన్ని అందిస్తుంది. ఇది ఇతర గ్రహాలపై భారత్ చేపట్టిన మొట్టమొదటి ప్రయోగం.
ఇటీవలే అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా "MAVEN మార్స్ మిషన్" పేరుతో ఒక ఉపగ్రహాన్ని ప్రయోగించింది. అందుకు వారి అయిన ఖర్చు 671 మిలియన్ డాలర్లు అంటే 4,080 కోట్ల రూపాయలకు పైమాటే. మరి మన ఇస్రో వారి MOM ప్రయోగానికి అయిన ఖర్చెంతో తెలుసా? 74 మిలియన్ డాలర్లు అంటే 450 కోట్ల రూపాయలే. అంటే నాసా వాళ్ళకి అయిన ఖర్చులో కేవలం తొమ్మిదో వంతో ఖర్చుతో మనవాళ్ళు అద్భుత విజయం సాధించేరన్నమాట.
అంగారక గ్రహంపై భారత్ తలపెట్టిన మొట్టమొదటి ప్రయోగమే అత్యద్భుత విజయం సాధించడంతో మన శాస్త్రవేత్తలపై ప్రపంచం నలుమూలల నుండి ప్రసంసల వర్షం కురిసింది. అలాంటిది మన శాస్త్రవేత్తలనే అవహేళన చేస్తూ న్యూయార్క్ టైమ్స్ వ్యంగ్య చిత్రాన్ని ప్రచురించడం ఏమాత్రం సహించరానిది.
ఒక ప్రక్క భారతీయ శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత విజయం పట్ల పెద్ద ఎత్తున ప్రసంసలు కురిసినట్లే మరో ప్రక్క న్యూయార్క్ టైమ్స్ వ్యంగ్య చిత్రాన్ని ప్రచురించడం పట్ల ఆ పాతిక పాఠకుల నుండి పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఒక భారతీయ రైతు Elite Space Club తలుపు తడుతూన్నట్లు చిత్రం వేయడం వారి జాత్యాహంకారాన్ని సూచిస్తోందంటూ పెద్ద సంఖ్యలో పాఠకులు తమ నిరసన ఆ పత్రికా సంపాదకునికి ఉత్తరాలు వ్రాసేరు.
పాఠకుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో న్యూయార్క్ టైమ్స్ పత్రికా యాజమాన్యం దిగివచ్చింది. జరిగిన తప్పిదానికి పాఠక లోకానికి క్షమాపణ చెప్పాలని నిర్ణయించింది.
న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ పేజి సంపాదకుడైన Andrew Rosenthal జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ తన Facebook పోస్టులో ఇలా వ్రాసేడు: "భారత అంతరిక్ష పరిశోధనలపై మా పత్రిక సంపాదకీయం పేజిలో ప్రచురితమైన కార్టూన్ పట్ల పాఠకుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమయ్యింది. నిజానికి అంతరిక్ష పరిశోధనలు పాశ్చాత్య సంపన్న దేశాలకు మాత్రమే పరిమితం కాలేదన్నది ఆ కార్టూన్ వేసిన Heng Kim Song ఉద్దేశ్యం. ఇతడు సింగపూర్ కి చెందిన కార్టూనిస్టు. అంతర్జాతీయ వ్యవహారాలపై అతడు ఎన్నో కార్టూన్లు వేసేడు కూడా. భారతదేశాన్ని అవహేళన చేయడం ఆ కార్టూనిస్టు ఉద్దేశ్యం కాదు. అయితే ఇది ఎంతో మంది పాఠకులకు తీవ్ర మనస్తాపాన్ని కలిగించింది కాబట్టి వారందరికీ నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. పాఠకుల నుండి వచ్చిన ప్రతిస్పందనను మేం స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం కూడా".
భారతీయ మార్స్ మిషన్ కి న్యూయార్క్ టైమ్స్ క్షమాపణ
Reviewed by rajakishor
on
12:31 PM
Rating:
No comments: