'పెంగ్విన్' కుక్క కాటుకు చెప్పుదెబ్బ
Wendy Doniger అమెరికాకు చెందిన ఇండాలజిస్టు (భారతీయ సాహిత్యం, చరిత్ర, తత్త్వములను అధ్యయనం చేసినవారు). హిందుత్వం గురించి బాగా అధ్యయనం చేసిన మేధావిగా ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఆమె వ్రాసిన "The Hindus: An Alternative History" అన్న 800 పేజీల పుస్తకాన్ని పెంగ్విన్ బుక్స్ ఆఫ్ ఇండియా 2009లో ప్రచురించింది.
ఈ పుస్తకం గురించి ప్రశంసిస్తున్న వారు ప్రపంచంలోని ప్రాచీన మతాల గురించిన చరిత్ర, కల్పనల మధ్య సారూప్యతని వివరించడం ద్వారా రచయిత్రి ఒక క్రొత్త ఆలోచనా సరళికి నాంది పలికేరని పేర్కొంటున్నారు.
రచయిత్ర Wendy Doniger తన పుస్తకంలో హిందూధర్మంలోని ఆరాధ్య దేవతల గురించి, అవతారాల గురించి వ్యంగ్యంగా, అవహేళన చేస్తూ వ్రాసింది. సెక్స్ లేదా కామోద్రేకాల కోణంలోంచే హిందూ దేవీదేవతలను గురించి తన పుస్తకంలో వ్రాస్తున్నానని పేర్కొంది. పుస్తకం అట్టపై కృష్ణుడు నగ్నంగా ఉన్న స్త్రీలతో వినోదిస్తున్నట్లుగా చిత్రాన్ని ముద్రించడం Doniger అసహ్యకరమైన మనస్తత్వానికి అద్దం పడుతోంది.
అయితే "ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు అసంగతమైనవి, పక్షపాత బుద్ధితో, దురుద్దేశ్యంతో వ్రాయబడినవి" అంటూ ఆ పుస్తకాన్ని ప్రచురించిన పెంగ్విన్ బుక్స్ ఇండియాకి వ్యతిరేకంగా శిక్షా బచావో ఆందోలన్ సమితి 2011లో పౌర వ్యాజ్యాన్ని కోర్టులో వేసింది. దీనితో పాటు ఈ పుస్తకంపై మరో రెండు నేరారోపణలు కూడా నమోదు అయ్యాయి. హిందూ సంస్కృతి పట్ల అశ్లీల భావనలు కలిగించే ధోరణిలో ఈ పుస్తక రచన సాగిందని వారి ఆరోపణ.
కోర్టు తీర్పు వెలువడక ముందే ఈ పుస్తకం యొక్క అమ్మకాలను స్వచ్ఛందంగా విరమించుకోవాలని పెంగ్విన్ సంస్థ నిర్ణయించుకుంది. కోర్టు వెలుపల చేసుకున్న ఒప్పందం ప్రకారం అన్ని దుకాణాల నుండి ఈ పుస్తక ప్రతులను 6 నెలల్లోపు వెనక్కి తెప్పించడానికి, భారతదేశంలో ఈ పుస్తకాన్ని ఎక్కడా అమ్మకుండా ఉండడానికి, ఈ పుస్తకాన్ని తదుపరి ముద్రణలు చేయకుండా ఉండడానికి పెంగ్విన్ సంస్థ నిర్ణయించుకుంది. ఇందుకయ్యే ఖర్చంతా తామే భరిస్తామని కూడా పేర్కొంది. ఈ మేరకు 4 ఫిబ్రవరి 2014న ఇరుపక్షాల వారు ఒక ఒప్పందంపై సంతకాలు చేసేరు.
స్పందనలు:
ఈ సంఘటన పట్ల కేంద్ర మంత్రి జయరాం రమేష్ స్పందిస్తూ, "పెంగ్విన్ సంస్థపై వ్యాజ్యం వెయ్యడం దుర్మార్గపు చర్య, ఎంతో అమర్యాదకరమైనది. శిక్షా బచావో ఆందోలన్ సమితి తాలిబాన్ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తోంది. వారి చర్య వివిధ సంస్కృతుల భావప్రకటన స్వేచ్ఛను భంగపరచేదిగా ఉంది" అని అన్నారు.
ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ "Wendy Doniger వ్రాసిన పుస్తక విక్రయాలను పెంగ్విన్ సంస్థ విరమించుకోవడం చాలా నిరాశపరిచేదిగా ఉందని, ఈ విషయంలో వారు పై కోర్టుని ఆశ్రయిస్తే బావుంటుంది" అని తన ట్విట్టర్ లో పేర్కొనారు.
దేవదత్ పట్నాయిక్ ప్రముఖ Leadership and Management కన్సల్టెంట్. వృత్తి రీత్యా వైద్యులు. హిందూ పురాణాల గురించి ఎన్నో పుస్తకాలు వ్రాసేరు.Wendy Doniger పుస్తకం గురించి వారు ఇలా అంటారు:
"నేను అమెరికాలో తరచుగా పర్యటిస్తూండటం వల్ల అక్కడి భారతీయ కుటుంబాలతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు హిందూ దేవతలపై Doniger చేసిన వ్యాఖ్యానాలపై వారిలో గల వ్యతిరేకతను గమనించాను. ఇవేవీ ఆ రచయిత్రి పట్ల నాలో గల అభిమానాన్ని తగ్గించలేదు. ఆమె పట్ల అక్కడి హిందువులలో గల వ్యతిరేకతతో నేను ఏకీభవించలేను."
"Doniger వ్రాసిన 'The hindus: An Alternative History' పుస్తకంపై కొన్ని హిందూ సంస్థల నుండి వ్యక్తమైన వ్యతిరేకతను పురస్కరించుకొని ఆ పుస్తక విక్రయాలను పెంగ్విన్ సంస్థ నిలిపివేసింది. ఇటువంటి వ్యతిరేకతలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో మరిన్ని పుస్తకాల ప్రచురణలు, విక్రయాలు ఆగిపోయే పరిస్థితి ఉత్పన్నం కావచ్చు."
"శివుణ్ణి శృంగారం పట్ల ఆసక్తి లేనివాడిగా, రాముణ్ణి శృంగారపరమైన అసూయాపరునిగా Doniger తన పుస్తకంలో పేర్కొంది. హిందూ దేవీదేవతలను ఈ విధమైన సైకోసెక్సువల్ ధోరణితోనే ఆమె విశ్లేశించింది. ఇది ఖచ్చితంగా హిందువులకు మనస్తాపం కలిగించేదే. అయితే ఇది అవివేకతతో కూడిన వ్యతిరేకాందోళనలకు దారితీసింది. ఒకరి ఆలోచనలు, ఉద్దేశ్యాలు తెలుసుకోకుండానే వారిపై ఆందోళనలు, పోరాటాలు చెయ్యాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి చర్యలు ఆరోగ్యకరం కావు. ఇవి ఏ విధమైన విజ్ఞతను సూచించవు."
దీనానాథ్ బత్రా:
దీనానాథ్ బత్రా శిక్షా బచావో ఆందోలన్ సమితి నాయకులు. Wendy Doniger వ్రాసిన పుస్తకంపై కేసు పెట్టిన వారిలో ముఖ్యులు. వారు ఇలా అంటారు:
"భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర్యం గురించి అన్ని చోట్ల చర్చ జరుగుతోంది. కానీ దీనికి కొన్ని పరిమితులుంటాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ అంటే ఏది పడితే అది వ్రాయడం, తోచింది మాట్లాడటం కాదు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో ఒకరి మనోభావాలను, విశ్వాసాలను అగౌరవపరిచే హక్కు ఎవరికీ లేదు. వాక్ స్వాతంత్ర్యం పేరుతో వాస్తవాలను వక్రీకరించడం ఎవరికీ ఆమోదయోగ్యం కాదు."
"ఏదైనా ఒక సమాజాన్ని గురించి, వారు గౌరవించే గ్రంధాల గురించి వ్యాఖ్యానించేటప్పుడు ఆ గ్రంధకర్తల ఉద్దేశ్యాలను, భావాలను లోతుగా అర్థం చేసుకోవాలని భారత సర్వోన్నత న్యాయాస్థానం సూచించింది. అయితే Wendy Doniger పుస్తకంలో తప్పుడు ఉద్దేశ్యాలు కనిపిస్తున్నాయి. ఆమె వాడిన భాష కూడా సముచితంగా లేదు."
"అయినా భావ ప్రకటన, వాక్ స్వాతంత్ర్యాల పేరుతో హిందువుల మనోభావాలను గాయపరచడం, వారి అస్థిత్వాన్ని కాలరాయాలనుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు."
"హిందూత్వంలో సెక్స్, కామోద్రేకాల గురించి వ్రాయడమే తన ముఖ్యోద్దేశ్యమని రచయిత్రి పేర్కొంది. తన పుస్తకంలో ఆమె ప్రస్తావించిన విషయాలు, వాడిన భాష అతి హేయమైనవి, జాతి విద్రోహకరమైనవి."
"హిందువుల మనోభావాలను Wendy Doniger కించపరచిన ధోరణి ఏమాత్రం సహించరానిది. అందుకే మేము న్యాయాస్థానంలో ఫిర్యాదు చేసేము. మేం చేసింది ఏరకంగాను తప్పు కాదు. హిందూ సమాజమును అగౌరవపరుస్తూ గతంలో వచ్చిన రచనలను మేం వ్యతిరేకించేము. ఇక ముందు కూడా ఇటువంటి వాటిని మేం హర్షించం."
"మా చర్యలు ఆధునికీకరణను వ్యతిరేకించేవిగా కొందరు పేర్కొంటున్నారు. మేం పాశ్చాత్యీకరణకు వ్యతిరేకులం. ఆధునికీకరణకు కాదు. నా దృష్టిలో పాశ్చాత్యీకరణ అంటే విదేశీ భావజాలానికి మన సమాజాన్ని బానిసలుగా చేయడమే. ఇది జరగకుండా నిరోధించడమే మన బాధ్యత."
రాజీవ్ శ్రీనివాసన్:
ఈయన కేరళకు చెందిన వారు. మద్రాస్ IITలో ఇంజనీరింగ్, Syracuse University లో ఎం.ఎస్., Stanford Business School లో ఎం.బి.ఎ. చేసేరు. ప్రస్తుతం IT కన్సల్టెంట్ గా ఉంటున్నారు. వీరికి చెన్నై, San Fransisco లలో ఆఫీసు బ్రాంచిలున్నాయి. Doniger వ్రాసిన పుస్తకం గురించి రాజీవ్ ఇలా అంటారు:
"పెంగ్విన్ సంస్థ Doniger పుస్తకాల విక్రయాలను భారతదేశంలో నిలిపివేసినంత మాత్రాన ఆ రచయిత్రి భావ ప్రకటనా స్వేచ్చకు భంగం కలిగిందని అనుకోనక్కర్లేదు. ఆ పుస్తకాలు పై దేశాలలో లభ్యం అవుతున్నాయి కూడా."
"భారతదేశంలో పుస్తక విక్రయాలు నిలిపివేయాలని పెంగ్విన్ సంస్థ నిర్ణయం తీసుకోగానే రచయిత్రి భావ ప్రకటనా స్వేచ్చకు భంగం వాటిల్లుతోందని మేధావి వర్గాల వారు గగ్గోలు పెడుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి అసలు ఏం జరిగిందన్న వాస్తవాన్ని అందరూ పక్కన పెట్టేస్తున్నారు. భారతదేశంలో ఈ పుస్తకాన్ని ఎవరూ నిషేధించలేదే? పుస్తక ప్రతుల్ని ఎవరూ ఎక్కడా తగలబెట్టలేదే? ఈ పుస్తకం గురించి ఎవరూ ఎవరిపైనా ఎదురుదాడులు చేయలేదే? ఈ పుస్తక రచయిత్రికి మరణదండన విధిస్తూ ఎవరూ ఆజ్ఞలు జారీ చెయ్యలేదే?"
"ఇందుకు భిన్నంగా ఈ పుస్తకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నవారు చాలా గౌరవప్రదంగా, హుందాగా వ్యవహరించేరు. ఈ విషయంలో వారు న్యాయాస్థానాన్ని ఆశ్రయించేరు. నిజమైన ప్రజాస్వామ్య పద్ధతిలో వారు ఈ పుస్తకంపై కోర్టులో కేసు నమోదు చేయడం ద్వారా తమ మతపరమైన విశ్వాసాలకు దెబ్బతగిలిందన్న బాధను, మనస్తాపాన్ని వ్యక్తం చేసేరు. న్యాయాస్థానం వారి ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుంది. ఇది ఏరకంగానూ అగౌరవప్రదము, అనాగారికము అయిన వ్యవహారం కాదని నేను చెప్పదలచుకున్నాను."
"కాబట్టి ఇక్కడ ఎవరి హక్కులకు భంగం కలిగింది? ఫిర్యాదు చేసినవారు న్యాయాస్థానంలో తమ వాదనలు వినిపించవచ్చు. కావాలంటే పుస్తక రచయిత్రి గానీ, పెంగ్విన్ సంస్థ గానీ తమ తరఫున న్యాయాస్థానంలో వాదించడానికి మంచి లాయరును పెట్టుకోవచ్చు. లేదా తీర్పు వెలువడే వరకు వేచి ఉండవచ్చు. అయుతే న్యాయాస్థానం నుండి తీర్పు వెలువడక ముందే ఉభయ వర్గాలవారూ సామరస్య పూర్వక వాతావరణంలో చర్చించుకుని పుస్తకం విషయంలో కోర్టు వెలుపలే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. న్యాయాస్థానంలో తాము గెలవలేక పోవచ్చని పెంగ్విన్ సంస్థ భావించి ఉండవచ్చు. లేదా ముందుగానే వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటే తమ పుస్తకానికి వ్యాపారపరంగా మంచి ప్రచారం లభిస్తుందని ఆలోచించి ఉండవచ్చు."
"అందువల్ల ఈ వ్యవహారంలో ఎవరి మీదా ఎవరి నిర్బంధమో ఉందని భావించడంలో అర్ధం లేదు. ఇది స్వేఛ్చా వాణిజ్యాన్ని, ప్రజాస్వామిక వాతావరణాన్ని ప్రతిబింబించడంలేదా?"
"గతంలో భారతదేశంలో కొన్ని పుస్తకాల విషయంలో భౌతిక దాడులు, ఆందోళనలు, పుస్తక రచయిత(త్రు)లను చంపేస్తామని బెదిరించడం లాంటివి జరిగేయి. కానీ Doniger పుస్తకం విషయంలో పై సంఘటనల వంటివి ఏవీ జరగలేదే? కాబట్టి ఇది గుర్తించదగ్గ విజయమే కదా?"
చివరిగా ఒక్కమాట:
హిందుత్వంపై, హిందూ సమాజంపై పాశ్చాత్య దేశాలవారు సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ ఒక సారి స్వామి వివేకానంద ఏమన్నారో తెలుసా? "మీరు హిందూధర్మంపై సాగిస్తున్న దుశ్చర్యలకు అట్లాంటిక్ మహా సముద్రంలో గల మురికినంతా తెచ్చి మీ మొహాలపై పోసినా బదులు తీరదు" అని.
'పెంగ్విన్' కుక్క కాటుకు చెప్పుదెబ్బ
Reviewed by rajakishor
on
6:35 PM
Rating:
No comments: