ఇల్లు - వసుధైక కుటుంబకం
డాక్టర్ జాకిర్ హుస్సేన్ భారత మూడవ రాష్ట్రపతి. ఆయన ప్రముఖ విద్యావేత్త, మేధావి.
ఒకసారి పాటియాలాలో (పంజాబ్) గురుగోవింద్ సింగ్ భవనానికి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలా అన్నారు.
"ఇల్లు అనే పదానికి అర్థం ఏమిటి ?
"చిన్న బాలుడికి ఇల్లు అంటే ప్రేమమయమైన తల్లి ఒడి. అయితే పిల్లవాడు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రులు నివసించే స్థలం (అది గుడిసె కాని భవనం కాని) ఇల్లు అనుకుంటాడు.
"నిదానంగా అతనిలో అవగాహన శక్తి పెరుగుతుంది. అప్పుడు అతడు నివసిస్తున్న సందు, వాడ లేక పట్టణం తన నివాసంగా భావిస్తాడు.
"అవగాహన శక్తి అలా పెరుగుతున్న కొద్దీ తన పరిసరాలు, పక్షి జంతుజాలం సర్వం తన నివాసానికి పుష్టిని చేకూరుస్తాయి. సాహిత్యం, కళలు ఇతరములైన అనేక విషయములు ఈ అవగాహనలో చోటుచేసుకుంటాయి.
"ఈ అవగాహనలో దేశం యావత్తు ఇమిడిపోతుంది. దేశంలో నివసించే ప్రజలంతా తన ఇంటికి చెందినవారే అన్న విస్తృత అర్థం గోచరిస్తుంది. సత్యం, న్యాయం, అమూల్యమైన సంస్కృతీ సంపద, చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన వివరాలు - ఇవి అన్నీ తన నివాసంలో భాగాలైపోతాయి.
"ప్రారంభంలో కేవలం అమ్మ ఒడికే పరిమితమైన 'ఇల్లు' ఆ నాలుగు గోడలను దాటి, పరిపూర్ణమైన జాతి జీవనానికి ప్రతిబింబంగా తయారైపోతుంది. అప్పుడు మనుష్యుని ఇల్లు ఎంతో విశాలమైపోతుంది."
జాకీర్ హుస్సేన్ చెప్పిన ఈ భావనకు విశ్వజనీనతను జోడిస్తే అది అనాదిగా భారతీయ సంస్కృతీ చెప్తూన్న 'వసుధైక కుటుంబకం'గా వికసిస్తుంది.
ఇల్లు - వసుధైక కుటుంబకం
Reviewed by rajakishor
on
6:31 PM
Rating:
No comments: