Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మన సెక్యులరిస్టులు మారరు!

ఎస్.ఆర్ . రామానుజన్ 
ఆంద్రభూమి దినపత్రిక , 14-01-2015


ఫ్రాన్స్‌లో ఇటీవలి ఉగ్రవాద దాడులు ప్రపంచాన్ని ఒక్క కుదుపునకు లోను చేశాయన్న మాట వాస్తవం. కానీ దీని ప్రభావం తాత్కాలికమైనప్పటికీ ఈ సంఘటన ఐరోపా సమాజ దేశాలు ఇప్పటివరకు తాము అనుసరిస్తూ వస్తున్న వలస విధానాన్ని పునఃసమీక్షించుకోవడానికి దారితీయవచ్చు. తమలోని ముఖ్య నమ్మకాలు దెబ్బతినకుండా ఎంత స్థాయి వరకు ఉదార విలువలను పాటించవచ్చనేదానిపై ఒక నిశ్చయానికి రావడానికి కూడా ఈ దాడులు దోహదం చేశాయి. శ్యామ్యూల్ హన్‌టింగ్టన్ అంచనా వేసినవిధంగా పరిస్థితి క్రమంగా జాతుల మధ్య పోరాటం దిశగా పయనిస్తున్నది. ప్యారిస్‌లో గత ఆదివారం జరిగిన ర్యాలీలో వివిధ ప్రపంచ దేశాధినేతలతో సహా పదిలక్షలమంది పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్దస్థాయి ర్యాలీ జరగడం ఇది రెండోసారి. రెండు సంస్కృతుల మధ్య సంభావ్య ధృవాత్మకతకు పురోభావి సూచకం. అంతేకాదు ఇస్లామోఫోబియా, రాడికల్ ఇస్లాంల మధ్య జరుగబోయే పెనుగులాటకు కూడా ఇది సూచన. మరో ముఖ్య విషయమేమంటే మనదేశంలో సెక్యులర్ పండితులమని చెప్పుకునే వారి నయవంచనను ఇది బట్టబయలు చేసింది. ఫ్రాన్స్ సంఘటనను మనం ద్వేషించవచ్చు కాని ఎటువంటి సహాయం చేయలేం, కొన్ని సమయాల్లో విషాద సంఘటనగా మిగిలిపోయినా మనం అందులోని కొంత సానుకూలతను తప్పనిసరిగా వీక్షించాలి.


భావ ప్రకటనా స్వాతంత్య్రంపై మన ‘సెక్యులర్’ వాదుల లక్ష్యాన్ని ఫ్రాన్స్ విషాదం మార్చివేసింది. ఇక్కడ ‘సానుకూలత’ అనే పదాన్ని ఎందుకు వాడానంటే అది వారిలోని బుకాయింపుతనాన్ని బయటపెడుతోంది కనుక. ఇకముందు వారి మాటల్లో కనిపించే స్పష్టమైన తేడా, వారి నిజ నైజాన్ని వెల్లడి చేయకమానదు. ఇక్కడ నేను మియాశంకర్ అయ్యర్ గురించి మాట్లాడటం లేదు. కాకపోతే ఆయనకు రాజకీయాల్లో కొనసాగడానికి ఉన్న ఒకే ఒక అర్హత, తన నాలుకపై తనకు నియంత్రణ లేకపోవడం. భారత్‌లోని అతి పురాతన పార్టీకి చెందిన చపలచిత్త నేత దిగ్విజయ్ సింగ్‌పై కూడ నాకు ఏవిధమైన విశ్వసనీయత లేదు. కేవలం ఈ అర్హతలే వివిధ టివి చర్చల్లో వారిని పాల్గొనేలా చేస్తున్నాయి. ఆయా ఛానళ్ల యాంకర్ల తెలివితక్కువతనాన్ని ఎగతాళి చేయడమే వీరి పని. అయినప్పటికీ నరేంద్ర మోదీని విమర్శించేందుకోసమే సదరు యాంకర్లు వీరిని చర్చలకు ఆహ్వానించడానికి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. వీరెంతటి మూఢులైనా, మానసిక అస్తవ్యస్తతకు లోనైన వ్యక్తులతో ఎవరూ పోరాడరు కాబట్టి, ఈ వాచాలురను ఆవిధంగా క్షమించవచ్చు. ఇక మిగిలిన ‘సెక్యులర్ జనం’ కేవలం సెనే్సషనల్ మీడియా అందించే ‘ఆక్సిజన్’తో బతుకీడుస్తున్నారు. ఎందుకంటే ఎంఎఫ్ హుస్సేన్ హక్కులకోసం పోరాటం చేయడానికి ఈ మీడియా కట్టుబడి ఉన్నది మరి. అటువంటి సెక్యులర్ జనం ఇప్పుడు తమ ‘అర్థంకాని మాండలిక భాషను’ మార్చుకోక తప్పదు. వీరి దృష్టిలో ‘పికె’కు పూర్తిగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నది. అంతేకాని బాలీవుడ్ నటి ఫోటోను మార్ఫింగ్ చేసిన విహెచ్‌పి మ్యాగజీన్‌కు ఆ స్వేచ్ఛ లేదు! విశ్వరూపం చిత్రంపై కమలాహసన్ క్షమాపణలు చెప్పాలి కానీ ‘పికె’పై అమీర్ ఖాన్ కాదు! ఆవిధంగా మనం మన ‘సెక్యులరిజం’ను నిర్వచిస్తున్నాం!
మరి ఇదే ఛార్లీ హెబ్డో కార్టూనిస్టుల విషయానికి వచ్చినప్పుడు...్భవ వ్యక్తీకరణ స్వేచ్ఛ మన సెక్యులర్‌ల దృష్టిలో ‘సంపూర్ణం’ కాదు. ఇక్కడ వారు ప్రయోగించే భాష, అప్పటి వరకు మాట్లాడిన దానికి పూర్తి భిన్నంగా మారిపోతుంది. ‘‘స్వేచ్ఛ బాధ్యతాయుతంగా ఉండాలి’’, ‘‘ఏ స్వేచ్ఛ కూడ పరిపూర్ణం కాదు’’, ‘‘మీకు స్వేచ్ఛ ఇచ్చింది ఇతరులు, ఇతర కులాలు లేదా మతాల వారిపై దాడి చేయడానికి కాదు’’, ‘‘దేవుణ్ణి ఎగతాళి చేసే హక్కు ప్రెస్‌కు ఉన్నదా?’’ ఈ విధంగా ఉంటాయి మన సెక్యులరిస్టుల మాటలు! మరి ఇటువంటివారంతా మన మన టెలివిజన్లలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే ఒకే రకమైన మనుషులు! మాడీసన్ స్క్వెర్ వద్ద నిర్వహించిన ర్యాలీ సందర్భంగా మోదీ పట్ల తన ఏహ్యభావాన్ని వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకాడని ఒక యాంకర్ భట్రాజుకు మల్లే మాట్లాడటాన్ని ఇక్కడ గమనించాలి. ‘‘ప్రవక్త పట్ల ఎగతాళిగా మాట్లాడే విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అదీ ఆయన చెప్పింది. మరి ఈ ‘ఎగతాళి ఆంక్ష’ కేవలం ప్రవక్త వరకే పరిమితమా? మరి ఎంఎఫ్ హుస్సేన్ మాదిరిగా హిందూ దేవీ దేవతలను అపహాస్యం చేయవచ్చా? మనదేశంలోని ముస్లింల పత్రిక మిల్లి గెజిట్ మరో అడుగు ముందుకేసింది. ‘‘ఫ్రెంచ్ గవర్నర్ ఆ కార్టూన్లు ప్రచురించినందుకు ఏవిధమైన క్షమాపణ చెప్పలేదు’’ అని వాపోయింది. మరి హుస్సేన్ తాను దైవ దూషణా పూరితమైన చిత్రాలు వేసినందుకు క్షమాపణ కోరాడా? మరి దీనికి విరుద్ధంగా మన ‘సెక్యులరిస్టులు’ అతగాడిని వెనకేసుకొని రావడానికి పోటీపడ్డారు. ‘ఆయనకు సంపూర్ణ భావ ప్రకటనా స్వేచ్ఛ’ ఉన్నదంటూ గగ్గోలు పెట్టారు. మరి ఇదే మాదిరిగా ఫ్రెంచ్ కార్టూనిస్టుల విషయంలో వీరెందుకు వ్యవహరించలేదు? మత సూత్రాలను సమర్ధించాల్సి ఉంది కాబట్టి ఎవరైనా మిల్లిగెజిట్‌ను అర్థం చేసుకోవచ్చు. మరి మన ‘సెక్యులర్ యోధు ల’కు అటువంటి కట్టుబాట్లు ఏమీ లేవుకదా? దివంగత హుస్సేన్ విషయానికి వచ్చేసరికి వారు ద్వంద్వ ప్రమాణాలు పాటించనవసరం లేదు. తన మతాన్ని వదిలేసి ఒక ప్రత్యేక మతం వారి మనోభావాలపైన కావాలని దాడి చేసే సంపూర్ణ హక్కు హుస్సేన్‌కు ఉన్నదా? మరి ఫ్రెంచ్ లేదా డానిష్ కార్టూనిస్టులకు ఇదే సంపూర్ణ హక్కు లేదు! మతం పేరు వచ్చే సరికి వారు నియంత్రణను పాటించాలి. మనదేశంలో ఉదారవాదులుగా చెప్పుకుంటున్నవారు ప్రాథమికంగా చేసే వాదన ఇదీ!

మీరు ఒకవేళ భావ ప్రకటనా స్వేచ్ఛను కేవలం మీ సైద్ధాంతిక భావజాలానికి మాత్రమే పరిమితం చేస్తే...మీరు నిజమైన స్వేచ్ఛను గుర్తించనట్టే. తప్పు లేదా అంగీకారయోగ్యం కాదని భావించే అంశం విషయంలోనే సహనానికి నిజమైన పరీక్ష. మరి మన ‘సెక్యులర్ బ్రిగేడ్’ ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందా? ఖచ్చితంగా లేదు! భయంకరమైన విషయమేమంటే ఇస్లాంను కించపరిచాడన్న కారణంగా ఒక సౌదీ బ్లాగర్‌ను బహిరంగంగా వెయ్యి దెబ్బలు కొట్టారు. ఇస్లామిస్టులు ఇతర మతస్థులను ‘కాఫిర్‌లు’గాను వారి దేవతలను ‘తప్పుడు దేవుళ్లు’గాను విమర్శించవచ్చు! మరి దీనిపై మన మీడియాలో కనీసం చిన్న ‘సణుగుడు’ కూడా వినిపించదు.

మరో కిరాతకమైన కథ ఉంది. ఇది ఫ్రాన్స్‌లో జరిగిన దానికంటే మరింత ఘోరమైంది. ‘బొకొహరాం’ ఉగ్రవాదులు నైజీరియాలోని బగా వద్ద రెండువేల మంది ముస్లింలను ఊచకోత కోశారు. బొకొహరాం సాగించిన దారుణ మారణకాండగా దీన్ని పరిగణిస్తున్నారు. మృతుల్లో చాలా మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు మాత్రమే. బగాపై చొరబాటుదార్లు దాడిచేసినప్పుడు ఎవరైతే పారిపోలేకపోయారో వారంతా ఈ ముష్కరుల బారిన పడ్డారు. 2014లో మొత్తం 10 వేలమంది మృతి చెందగా, కొత్త సంవత్సరంలో బొకొహరాం ఉగ్రవాదులు బగా సంఘటన ద్వారా రెండువేల మందితో తమ మారణకాండ ఖాతాను తెరిచారు. నైజీరియాలో జరుగుతున్న ఘోర కృత్యాలపై అలసత్వం వహించడం పశ్చిమ దేశాలు చేస్తున్న ఘోర తప్పిదం. ఇందుకు ఆ దేశాలు క్షమార్హం కాదు. కేవలం నైజీరియన్లు ‘నల్లవారు’ కావడమే ఇందుకు కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. బొకొ హరాంకు చెందిన ఒక స్థానిక నేత మాట్లాడుతూ, ‘‘్భవిష్యత్తులో కూడ ఇటువంటి దాడులే జరుగుతాయి. మతద్రోహుల అరెస్టులు కొనసాగుతాయి. ఇప్పటి నుంచి మేం చొరబాటు జరిపే ప్రతి ప్రదేశంలో హత్యలు, వినాశనం, బాంబుదాడులకు పాల్పడటం మా మత విధి’’ అన్నాడు. ఇది భారతీయులకు కొత్తగా లేదా అటవికంగా కనిపించదు. ఎందుకంటే 12వ శతాబ్దం నుంచి వాయువ్య సరిహద్దులగుండా దేశంలోకి ప్రవేశించిన చొరబాటుదార్లు చేసిన దారుణ కృత్యాలు వీరి మదిలో ఇంకా నిక్షిప్తమయ్యే ఉన్నాయి. ఇస్లాం హింసను అనుమతించదని, పరమ శాంతియుతమైన మతమని మన సెక్యులరిస్టులు నేడు అంటే..మరి చరిత్ర చెప్పే వాస్తవాలు ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి మరి. బొకొ హరాం, అల్ షబాబ్, అల్ ఖైదా, ఐఎస్‌ఐఎస్, తాలిబన్ తదితర నిషిద్ధ సంస్థలు చరిత్రలోకి పునఃప్రవేశిస్తున్నాయి. కొన్ని శతాబ్దాలుగా భారతీయులు ఈ క్రూర కృత్యాల బారిన పడ్డారు. ఇప్పుడు యూరప్ వంతు. మంచిది మన ఎంఐఎం పార్లమెంట్ సభ్యుడి దృష్టిలో ఇస్లాం హింసను ప్రోత్సహించదు మరి!

మొత్తం మీద యూరప్, ప్రత్యేకించి ఫ్రాన్స్ ‘రాడికల్ ఇస్లాం’పై యుద్ధం ప్రకటించాయి. ఛార్లీ హెబ్డో విషాదం తర్వాత ఈ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. నిజానికి గతంలో జార్జ్ బుష్ ప్రకటించిన ఉగ్రవాదంపై పోరుకు ఇది పూర్తి భిన్నం. ఎందుకంటే ఇది ఇస్లామిక్ ఉగ్రవాదం లేదా రాడికల్ ఇస్లాంకు వ్యతిరేకంగా జరిపే పోరాటం కనుక. మన భారతీయ ఉదారవాదులు ఈ అంశంపై తక్షణమే స్పందిస్తూ.. యూరోపియన్ దేశాల పక్షపాత వైఖరి అంటూ మాట్లాడటం మొదలు పెట్టారు. ఉగ్రవాదాన్ని లక్ష్యం చేసుకున్నప్పుడు ఒక ప్రత్యేక మతాన్ని గురించి ప్రస్తావించడం వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఇస్లాంను లక్ష్యం చేయడం ఒక ఫ్యాషన్‌గా మారిందంటారు. ఇక ఇస్లామిక్ టెర్రర్ నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ వారు ‘కాషాయ టెర్రర్’ అనే కొత్త పదాన్ని సృష్టించారు.

ఇక మన ఉదారవాదుల వాదనలోని మరో కోణం ఈవిధంగా ఉంది, ‘‘మారణకాండకు పాల్పడిన ఇద్దరిని వ్యక్తిగతంగా ఎందుకు పరిగణించరు? మతానికి ఎందుకు అంటగడతారు?’’ మరి వారు ఇద్దరే అయితే కలాష్నికోవ్‌లను వాడతారా? యుద్ధోన్మాదంతో ‘ప్రవక్తకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటున్నాం’’ అంటూ నిరాయుధులను చంపుతారా? ఈ మాటలు మాట్లాడేది కేవలం ఉగ్రవాదులు మాత్రమే, సెక్యులర్ భావాల పట్ల నిబద్ధత కలిగిన వారు కాదు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పశ్చిమ దేశాల్లో మార్పు వస్తున్నా, మన సెక్యులరిస్టుల్లో మాత్రం మార్పు రాదు!
మన సెక్యులరిస్టులు మారరు! Reviewed by rajakishor on 11:44 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.