Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పాక్‌ను కట్టడి చేస్తున్న మోదీ

కె.కోటేశ్వరరావు ఆంధ్ర ప్రదేశ్ భాజపా కార్యదర్శి
ఆంధ్రభూమి దినపత్రిక , 14-01-2015


పాకిస్తాన్ 1971నాటి యుద్ధంలో ఘోర పరాజయం పొందడమే కాకుండా అసహజమైన మత ప్రాతిపదికపై ఏర్పాటుచేసుకున్న దేశమే రెండు ముక్కలు అయి బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. అప్పటినుండి సరిహద్దులల్లో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం, మన దేశంలోకి శిక్షణ ఇచ్చిన ఉగ్రవాదులను పంపి,విద్రోహ కార్యకలాపాలు జరిపించడం, దేశంలోకి నకిలీ కరెన్సీనోట్లు పంపడం వంటి కార్యక్రమాల ద్వారా మన రాజకీయ, భద్రత, రక్షణ, ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేసే ప్రయత్నాలు చేస్తోంది.

పాకిస్తాన్ కుట్రలు, పన్నాగాల గురించి మన దేశాధినేతలకు స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ గతంలో వాటిని వ్యూహాత్మకంగా, దృఢవైఖరితో ఎదుర్కొనే ప్రయత్నం చేయలేక పోయారు. విదేశీ వత్తిడులు ఎక్కువగా పనిచేస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. తొలిసారిగా నరేంద్రమోదీ ప్రభుత్వం అటువంటి దృఢ నాయకత్వాన్ని దేశానికి అందిస్తున్నదనడం అతిశయోక్తి కాదు. గత పలు దశాబ్దాల కాలంలో తొలిసారిగా కీలకమైన ప్రధానమంత్రి, రక్షణమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, హోంమంత్రి పాకిస్తాన్ విషయంలో ఒకేమాట మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ కవ్వింపుచర్యలపట్ల ఒకే విధంగా స్పందిస్తున్నారు. ఈ విషయమై ఈ నలుగురు ఒకే అభిప్రాయంతో అడుగులు వేస్తున్నారు. గత పదేళ్ళ యుపిఏ పాలనలో ఇటువంటి పరిస్థితిలేదు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా వ్యవహరిస్తుంటే, ప్రధానమంత్రి వౌనం వహిస్తూ ఉండేవారు. ఈ విషయమై అమెరికావంటి దేశాల స్పందనబట్టి భారత ప్రభుత్వం వ్యవహరించడం కూడా జరుగుతూ ఉండేది. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగంగా అమెరికా పాకిస్తాన్‌ను కీలక భాగస్వామిగా చేసుకున్నది. ఈ విషయంలో భారతదేశం పట్లకన్నా పాకిస్తాన్ పట్ల ఎక్కువ ఆసక్తిచూపుతూ ఉండేది. పాకిస్తాన్ ఒక వంక అమెరికాతో ఉగ్రవాదంపై పోరులో కీలక భాగస్వామిగా ఉంటూనే మరోవంక చైనాతో సన్నిహితంగా మెలగుతోంది. అం దుకనే పాకిస్తాన్ అనుసరిస్తున్న భారత్ వ్యతిరేక పోకడలపట్ల చైనా సైతం వౌనంగానే ఉండేది
నరేంద్రమోదీ ప్రధానమంత్రి కాగానే మొదటగా చైనాకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. పాకిస్తాన్ అనుసరిస్తున్న భారత్ వ్యతిరేక ధోరణులకు చైనానుండి ఎటువంటి మద్దతు లభించకూడదని స్పష్టంచేసారు. మరోవంక అమెరికాకు సైత ఈ దేశం అందించే సహాయం భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే విధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తే అందుకు అమెరికానే బాధ్యత వహించవలసి ఉంటుందని పేర్కొన్నారు. తొలిసారిగా దక్షిణాసియా పర్యటనకు భారత్ రిపబ్లిక్ దినోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొనడానికి వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళకుండా తిరిగి వెడుతున్నారు. గతంలో అమెరికా అధ్యక్షులు భారత్‌కు వచ్చి పాకిస్తాన్ వెళ్ళకుండా వెనుతిరగడం చాలా అరుదు. ఈ పర్యా యం సైతం ఆయనను తమ దేశానికి రప్పించుకోవాలని పాకిస్తాన్ ఎంతగా ప్రయత్నంచేసినా ఫలితం లేకపోయినది. ఇది ఒక విధంగా నరేంద్రమోదీ దౌత్య విజయంగా పేర్కొనవచ్చు. కాగా పాకిస్తాన్ చర్యల పట్ల నరేంద్రమోదీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు పాకిస్తాన్‌కు గతంలో ఎరుగని ఇబ్బందులను కలిగిస్తున్నది.
కీలకమైన మూడు మంత్రిత్వశాఖలను సీనియర్ బిజెపి నాయకులు- సుష్మస్వరాజ్, రాజ్‌నాథ్‌సింగ్, మనోహర్ ఫరేకర్‌లకు అప్పగించారు. పాకిస్తాన్ పట్ల దృక్పధంలో సైద్ధాంతికంగా గాని, ఆచరణలోగాని ఈ ముగ్గురూ ఒకే అభిప్రాయం కలిగి ఉన్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన కీలక అంశాల్లో వీరిమధ్య ఏకాభిప్రాయం ఉండటం వల్లనే నేడు నరేంద్రమోదీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు ప్రభుత్వంలో దేశ భద్రత భద్రంగా ఉండగలదనే విశ్వాసం దేశ ప్రజలకు కలిగించగలుగుతున్నది. పైగా ఈ ముగ్గురికి ప్రధానమంత్రి, దేశ జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌దోవల్ పూర్తిమద్దతు అందచేస్తున్నారు. దానితో తటపటాయింపులు లేకుండా నిర్భయంగా, దృఢంగా అడుగులు వేయగలుగుతున్నారు. అదీగాక ఈ ముగ్గురూ స్వతంత్రంగా దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే వ్యవహరించ గలుగుతున్నారు. వారిపై పాశ్చాత్యదేశాల ప్రభావం ఏమాత్రంలేదు. అమెరికావంటి దేశాలు వారిని ప్రభావితం చేయగల స్థితిలో లేనేలేవు. గతంలో ఏనాడూ ఇటువంటి పరిస్థితులు దేశంలో లేవని చెప్పవచ్చు. రక్షణమంత్రి ఫరేకర్ విషయంలో అయితే ఆయనతో అమెరికా వంటి దేశాల అధినేతలకు ఎటువంటి సంబంధాలు లేనేలేవు. ఒక చిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి జాతీయస్థాయిలో ఇటువంటి కీలక పదవిలోకి రాగలరని వారెవ్వరూ ఊహించకపోవడమే అందుకు కారణం.
గతంలో ఇటువంటి కీలక మంత్రిత్వశాఖలను నిర్వహిస్తూ ఉండేవారు, వారికి సలహాదారులుగా ఉండేవారు ఎక్కువగా విదేశాలల్లో తమ ఇమేజ్ ఏ విధంగా మలచుకోవాలో, అగ్రరాజ్యాల నేతలతో తమ పలుకుబడి ఏ విధంగా కాపాడుకోవాలో లౌకికవాదిగా తమ ఇమేజ్ దేశంలో ఎలా పెంచుకోవాలో అని ఆలోచించుకొనేవారు తప్ప దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని పటిష్టంగా, బలంగా అడుగులు ఎలావేయాలో అని ఆలోచించేవారు కాదు. తమ గురించి వాషింగ్టన్, లండన్, న్యూయార్క్, ముంబై, ఢిల్లీలలో ఏమనుకొంటారో అని తటపటాయించేవారు. గతంలో రక్షణమంత్రిగా పనిచేసిన ఏ.కె.ఆంటోనీగాని, విదేశాంగ మంత్రులుగా పనిచేసిన నట్వర్‌సింగ్, యస్.యం. కృష్ణలు గాని, హోంమంత్రులుగా పనిచేసిన శివరాజ్‌పటేల్, పి.చిదంబరం, సుశీల్‌కుమార్ షిండే లు గాని పాకిస్తాన్ దుశ్చర్యల పట్ల దృఢంగా స్పం దించడానికి వెనుకాడేవారు. దానితో దేశ రక్షణ పట్ల దృఢంగా వ్యవహరించడంలో యుపిఏ ప్రభుత్వం ఘోరంగా విఫలంఅయినది.

నరేంద్రమోదీ పదవీ ప్రమాణస్వీకార సమయంలోని సార్క్ దేశాల అధినేతలు అందరినీ ఆహ్వానించి, తదుపరి పొరుగుదేశాలతో తానుగాని, విదేశాంగ శాఖామంత్రి గాని పర్యటనలు జరిపే విధంగాచేసి దక్షిణ ఆసియాలో పాకిస్తాన్‌ను ఒంటరి చేయడంలో విజయం సాధించారు. అమెరికా, చైనా వంటి దేశాలు సహితం భారత్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు వ్యూహాత్మక సహకారం అందించడాన్ని సహితం కొంత కట్టడి చేయగలిగారు. ఈవిధంగా అన్నివైపులనుండి పాకిస్తాన్‌పై వత్తిడి తీసుకురావడంలో 1971 తరువాత ప్రథమంగా భారత్ విజయవంతంగా వ్యవహరించ గలుగుతోంది.

ఇటీవల జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏర్పాటువాదుల ప్రాబల్యంగల ప్రాంతాల్లో సైతం పెద్దఎత్తున ప్రజలు వచ్చి వోటింగ్‌లో పాల్గొనడం, ఎన్నికలను బహిష్కరించమని వారిచ్చిన పిలుపును ప్రజలు లెక్కచేయకపోవడం, అన్ని రాజకీయ పార్టీలు ఎంతోకొంత బలాన్ని అసెంబ్లీలో సంపాదించడం ఈ సందర్భంగా జరిగిన గొప్ప పరిణామం. నేడు పాకిస్తాన్‌లోని పలువురు విశే్లషకులు సహితం జమ్మూకాశ్మీర్‌పై ఇక పాకిస్తాన్ ఆశలు వదులుకోవలసిందే అని బహిరంగంగా వ్యాఖ్యానించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జమ్మూకాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అని పాకిస్తాన్‌లో సైతం గుర్తింపు లభిస్తున్నది. అంతర్జాతీయ సమాజం సైతం నోరుమెదపలేని పరిస్థితులు నెలకొన్నాయి. భారతదేశంలోనే తమ భవిష్యత్ మెరుగుపడగలదనే ఆశలు కాశ్మీర్ లోయ ప్రజల్లో చిగురిస్తున్నాయి. ఈ మార్పు దేశ రక్షణ దృష్ట్యా అత్యంత కీలకమైనదని చెప్పవచ్చు.

పాక్‌ను కట్టడి చేస్తున్న మోదీ Reviewed by rajakishor on 11:26 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.