Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

వివేకానందుడు - విద్య



(12-01-2015న స్వామి వివేకానంద జయంతి సందర్భముగా ఈ వ్యాసం పోస్ట్ చేస్తున్నా)




నేడు మనం నేర్చుకుంటున్న విద్య మన దేశాన్ని విదేశీ న్యాయస్థానంలో నిలిపి, విదేశీ న్యాయసూత్రాల ప్రకారం విచారించడం విద్యార్థికి నేర్పుతోంది. మనదైనదేదీ మనకు పరిచయం లేదు. పరిచయం అయినా నిరాదరణ దృష్టితోనే పరిచయం అవుతుంది. 




అడుగడుగునా మన భావాలను విదేశీ కొలబద్దలతో కొలుస్తున్నాం. 




ముఖానికి పసుపు రాసుకోవడం ఆటవికం. టర్నర్ క్రీం పూసుకోవడం నాగరికత. 




ప్రొద్దున్నే గుడికి వెళ్ళడం అనాగరికం. గుడికి వెళ్తే సిగ్గుపడిన పని చేసినవారం. అవహేళన పాత్రులం. కానీ చర్చికో, మసీదుకో వెళ్తే పరమత సహనం పాటించినవారం అవుతాం. 




కారణం మనకు మన సంప్రదాయాలు, విశ్వాసాలు, శాస్త్రాలు పరిచయం లేవు. పరిచయం వున్నా విదేశీయులు ఎలా పరిచయం చేసేరో అలాగే పరిచయం మనకు. 


ఇందుకు పరిష్కారం మనదైన విద్యావిధానం.



మన మాతృభూమి అయిన భారతదేశం మనకు తల్లీ, తండ్రీ మాత్రమే కాదు; గురువు కూడా. "ఈ మన మాతృభూమి మనపట్ల తల్లి, తండ్రి, గురువు బాధ్యతలను ఏకకాలంలో నిర్వర్తించింది" అంటారు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ద్వితీయ సర్ సంఘచాలక్ శ్రీ మాధవ సదాశివ గోళ్వర్కర్ (శ్రీ గురూజీ). 




మన జాతి జీవనానికి ఆధ్యాత్మికత కేంద్రం. ఆధ్యాత్మికత భూమికగా ఈ దేశంలో ఎందరో మహనీయులు వివిధరంగాలలో తమ విశేష ప్రజ్ఞతో గొప్ప ఆవిష్కరణలు చేసేరు. 




ఆధ్యాత్మికత కేంద్రంగా విద్య గురించి స్వామి వివేకానంద ఇలా అంటారు, "నా జీవితం మాతృదేశ సేవకే అంకితమైంది. నాకు వేయి జన్మలున్ననూ అవన్నీ ప్రతిక్షణం నా దేశము, నా దేశ ప్రజల సేవలోనే పవిత్రమౌతాయి. ఎందుకంటే భౌతికంగా కాని, మానసికంగా కాని, ఆధ్యాత్మికంగా కాని నా వద్ద ఏమున్నా అది నాకు ఈ దేశం పెట్టిన భిక్షయే. ఎందులోనైనా నేను విజయం పొంది వుంటే ఆ కీర్తి నా దేశానిదే, నాది కాదు. నా పరాజయాలు, దౌర్బల్యాలు మాత్రం నావే. ఎందుకంటే జన్మతః ఈ దేశం నాకు మహోన్నత పాఠాలను అందజేసింది. వాటివల్ల లాభం పొందలేకపోవటం నా అసమర్థతయే."




నేటి మన విద్య గురించి వివేకానంద ఇలా అంటారు:




"నేడు మీరు పొందుతున్న విద్యలో కొంత మంచి వున్నది. కానీ దాని వల్ల మూడే కీడు క్రింద ఆ మంచి అణగిపోతున్నది. మనదేశంలో మహా పురుషులంటూ జన్మించారనేదే మనకు బోధించరు. సార్థకమైనదేదీ మనకు బోధింపబడదు. మన కాళ్ళూ చేతుల ఉపయోగం కూడా మనకు తెలియదు. ఆంగ్లేయుల పూర్వజుల వివరాలన్నీ మనం కంఠోపాఠం చేస్తాం. కానీ మన పూర్వులను గురించి ఉదాసీనత కనబరుస్తాం. మనం నేర్చుకున్నదల్లా దౌర్బల్యమే."




"బుర్రలలో విషయ బాహుళ్యాన్ని నింపి, గందరగోళం చేసి, జీవితంలో ఎన్నటికీ అర్ధం కాకుండా ఉండేది విద్య కాదు. శీలాన్ని రూపొందించి, వ్యక్తిని నిర్మించి, జీవితాన్ని తీర్చిదిద్దే భావనల అవగాహన మనకు ఉండాలి. ఆ భావనలను అవగతం చేసుకుని, వాటిని నీ శీలంలో, నీ జీవితంలో అంతర్భాగంగా రూపొందించుకొన్నట్లయితే ఒక గ్రంధాలయాన్నంతటినీ కంఠస్థం చేసినవాని కంటే నీవు ఎక్కువ విద్యావంతుడవైనట్లే."




"సామాన్య జన సముదాయాన్ని జీవన సమరానికి సంసిద్ధం చేయని విద్య, సౌశీల్యశక్తిని, ఉదారభావనను, సింహ విక్రమాన్నీ వెలికి తీయని విద్య - విద్య అనిపించుకుంటుందా? వ్యక్తిని తన కాళ్ళ మీద నిలబడేలా చేసేదే నిజమైన విద్య."




"మన దేశపు వ్యావహారిక, ఆధ్యాత్మిక విద్యల  మీద మన అధికారం వుండాలి. మన కలలలో సంభాషణలలో, ఆలోచనలలో దాని గురించే మననం చేసుకోవాలి. దానిని సాధించాలి. అంతవరకూ మన జాతికి విముక్తి లేదు. దీనికో వ్యవస్థ అవసరం. ఎలాంటి వ్యవస్థ? ఉదాహరణకు మనకో మందిరం కావాలి. అది అన్ని వర్గాలకు అతీతంగా వుండాలి. అందులో అన్ని సంప్రదాయాలకూ మహోత్తమ చిహ్నమైన 'ఓం' ఒక్కటే ప్రతిష్టింపబడాలి. తమ మతాన్ని ఏ సంప్రదాయానికి చెందినవారు ఆ సంప్రదాయాన్ననుసరించి నిర్వహించవచ్చు. మందిరం మాత్రం ఒక్కటే ఉండాలి. ఇక్కడ విభిన్న సంప్రదాయాలలోని సమాన ధర్మాలు బోధింపబడాలి. దానితో ఏ సంప్రదాయాన్ని అనుసరించేవాడైనా అక్కడ తన విధానాన్ని బోధించవచ్చు. ఒక్కటే నియమం. పరస్పరం కలహించుకోరాదు."




"ఈ మందిరానికి అనుబంధంగా ధర్మాన్నీ, వ్యావహారిక విద్యనూ - రెండింటినీ మన ప్రజలకు బోధించడానికి అధ్యాపకులకు శిక్షణనిచ్చే ఒక సంస్థ ఉండాలి. ఆ అధ్యాపకులు రెండింటినీ ప్రబోధించాలి. పరస్పర సహకారాన్నీ, పరస్పర సానుభూతినీ హిందువులకు నేర్పే ఒక సంస్థ చాలా అవసరం."




వందేళ్ళ క్రితమే వివేకానందుడు ప్రతిపాదించిన విభిన్న సంస్కృతుల మధ్య భావసారూప్యత గురించి నేడు ప్రపంచంలోని పలు మేనేజిమెంట్ శిక్షణ సంస్థలు ప్రస్తావిస్తున్నాయి . 




ఇటలీకి చెందిన Intercultural Intelligence సంస్థ వ్యవస్థాపకుడు అయిన 'పోలో నాగరి' మానవ వనరుల అభివృద్ధి మరియు శిక్షణ రంగంలో పలు దేశాలలో పనిచేసేడు. వివిధ దేశాలలో పనిచేసేవారు తమకు తారసపడే సాంస్కృతిక వైరుద్ధ్యాలను ఆకళింపుజేసుకుని, వాటిని అధిగమించి ఎలా ముందుకు సాగాలన్నదే అతని శిక్షణ యొక్క ముఖ్యోద్దేశ్యం. 




"In order to establish relevance in a new culture, we must focus on the cultural similarities rather than the differences. People need too see the world from another point of view and focus on similarities instead of dealing with cultural differences - నేటి ప్రపంచంలో జీవిస్తున్న మనం ఒక క్రొత్త దృక్పథాన్ని అలవరచుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల వారితో పనిచేస్తున్నప్పుడు వివిధ సంస్కృతుల మధ్య గల వైరుధ్యాల కన్నా వాటి మధ్య గల సారూప్యాతలపైన మన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇందువల్ల వివిధ సంస్కృతులకు చెందిన వారి మధ్య పరస్పర సహకారసంబంధాలు వృద్ధి చెందుతాయి " అంటారు పోలోనాగరి .
వివేకానందుడు - విద్య Reviewed by rajakishor on 10:03 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.