వాజపేయి, మాలవ్యకు భారత రత్న
న్యూఢిల్లీ, డిసెంబర్ 24: భారత రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన పాలనాదక్షుడు, సయోధ్య రాజకీయ ప్రవక్త, భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి దేశ అత్యున్నత పురస్కారమైన భారత రత్నకు ఎంపికయ్యారు. అలాగే హిందూ మహాసభ నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు మదన్ మోహన్ మాలవ్యకు ఈ విశిష్ట పురస్కారాన్ని కేంద్రం ప్రభుత్వం అందించింది. వాజపేయికి భారత రత్న అవార్డును ప్రదానం చేయడం పట్ల సర్వత్రా హర్షామోదాలు వ్యక్తమైనాయి. మరో 24 గంటల్లో వాజపేయి 90వ జన్మదినోత్సవాన్ని, లాగే మాలవ్య 153వ జయంతిని జరుపుకోనున్న సందర్భంగా ఈ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. ఇందుకు సంబంధించి బుధవారం రాష్టప్రతి భవన్‌నుంచి ఓ ప్రకటన కూడా వెలువడింది. ఈ తాజా అవార్డుతో దేశంలో ఇప్పటివరకు 45 మందికి భారత రత్న పురస్కారం లభించినట్లయింది. గత ఏడాది క్రికెటర్ సచిన్ తెండూల్కర్, శాస్తవ్రేత్త సిఎన్‌ఆర్ రావులు ఈ ఘనతను దక్కించుకున్నారు.
1998-2004 మధ్య కాలంలో భారత ప్రధానిగా సేవలందించిన వాజపేయి వృద్ధాప్య అస్వస్థత కారణంగా కొనే్నళ్ల క్రితమే క్రియాశీల రాజకీయాలనుంచి తప్పుకొన్నారు. భారతీయ జనతా పార్టీలో రాజనీతిజ్ఞుడిగా, ఉదార స్వభావిగా పేరొందిన వాజపేయి అజాతశత్రువు. ఎలాంటి వారినైనా తనదైన వ్యక్తిత్వంతో ఆకట్టుకోగలిగే అద్భుతమైన లక్షణం వాజపేయికి ఉంది. దేశ ప్రధానిగా స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు సహా అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టిన వాజపేయి పొరుగున ఉన్న పాకిస్తాన్‌తో సాహసోపేత రీతిలో శాంతిప్రక్రియను చేపట్టారు.
కాంగ్రెసేతర పార్టీలకు చెందిన వ్యక్తిగా అత్యధిక కాలం పాటు దేశ ప్రధానిగా పని చేసారు. వాజపేయిని ప్రత్యర్థులు ‘ఆర్‌ఎస్‌ఎస్ ముసుగు’గా పేర్కొన్నప్పటికీ ఆయన గురించి విద్వేషపూరితంగా ఎప్పుడూ మాట్లాడలేదు.
వాజపేయి, మాలవ్యలకు భారత రత్న అవార్డు ఇవ్వడాన్ని జాతికి ఈ మహానాయకులందించిన విశిష్ట సేవలకు సముచితమైన గుర్తింపుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అత్యద్భుతమైన వాక్చాతుర్యం, అవగాహనా పటిమ కలిగిన అరుదైన భారత నేతల్లో వాజపేయి ఒకరని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అరుణ్ జైట్లీ జాతీయ స్థాయిలోనే కాకుండా ఆగ్నేయాసియాలో కూడా శాంతిసంస్థాపనకు వాజపేయి చేసిన కృషిని ప్రశంసించారు.
భారత రత్న పురస్కారాన్ని పొందిన మదన్‌మోహన్ మాలవ్య బహుముఖీయ వ్యక్తిత్వం కలిగిన నిరుపమాన స్వాతంత్య్ర సమరయోధుడు. విద్యావేత్తగా రాణించిన ఆయన బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించారు. అలాగే స్వాతంథ్య్ర సమరకాలంలో అతివాద, మితవాదుల మధ్య సంధానకర్తగా వ్యవహరించారు. హిందూజాతీయ వాదాన్ని గట్టిగా వినిపించిన మాలవ్య హిందూమహాసభ సభ్యుడిగా కొనసాగారు. అలాగే సంఘసంస్కర్తగా, పార్లమెంటేరియన్‌గా కూడా తనదైన ముద్ర వేసారు. 1861 డిసెంబర్ 25న మాలవ్య 1986లో కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ రెండో మహాసభలో అద్భుతమైన వాగ్ధాటిని ప్రదర్శించారు. దాంతో ఒక్కసారిగా రాజకీయ రంగంలోకి దూసుకొచ్చారు. 1909,1918 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసారు. కాగా, ఆవజపేయి, మాలవ్యలకు భారత రత్న పురస్కారాన్ని అందించడం ఎంతయినా సముచితమని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి సిఫార్సు చేసారు. ఈ అవార్డు ప్రధానానికి సంబందించిన లాంఛనంగా ఇక ఎలాంటి తతంగమూ అక్కర్లేదు. గత ఏడాది తెండూల్కర్‌కు అప్పటి యుపిఏ ప్రభుత్వం భారత రత్నను ప్రదానం చేసినప్పుడు వాజపేయి సేవలను విస్మరించారంటూ బిజెపి విరుచుకుపడింది. ఇప్పటివరకు భారత రత్నను అందుకున్న జాతీయ దిగ్గజాలలో సి. రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మదర్ థెరెసాలాంటివారున్నారు.
వాజపేయి, మాలవ్యకు భారత రత్న
Reviewed by JAGARANA
on
7:56 AM
Rating:
No comments: