నిశ్శబ్ద బ్యాలెట్ విప్లవం వెనుక ఆర్.ఎస్.ఎస్ - సంపాదకీయం
ఇది హిందూదేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాయదగ్గ రోజు ఈ విప్లవం వెనుక విస్పష్ట సైద్ధాంతిక దృక్పథం ఉంది. కాకలు తీరిన నాయక శ్రేణి ఉంది. సుశిక్షితమైన క్యాడర్ ఉంది. అన్నిటికీ మించి ఆర్.ఎస్.ఎస్. అనే జాతీయ మహాశక్తి ఉంది. ఇప్పుడు సాధించిన ఎన్నికల దిగ్విజయం వెనుక లక్షలాది ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు గ్రామ గ్రామాన గడపగడపనా నెలల తరబడి సాగించిన నిర్విరామ ప్రచారం ఉంది - రాష్ట్ర చేతన
తరాల తరబడి పరిపరి విధాల సాగిన మోసాలకు, ద్రోహాలకు, ప్రజావ్యతిరేక కుత్సితాలకు, కూహకాలకు ఆటకట్టి... నిజమైన జాతీయ భావం పురివిప్పి, సిసలైన జాతీయ ప్రభుత్వం సుస్థిరంగా నెలకొనబోతున్నదన్న పరమానందం తాండవించిన రోజు.
భరతమాత రెండు ముక్కలై, రక్తపుటేర్లు పారి, లక్షల ప్రాణాలు రాలుతున్న భయానక కాలాన అర్ధరాత్రి అడుగు పెట్టిన స్వాతంత్య్రం నాటి దేశవాసులకు ఎంతటి సంతోషాన్ని, ఎటువంటి సంతృప్తిని కలిగించిందో తెలియదు. దశాబ్దాల పర్యంతం జాతినెత్తిన నాట్యమాడిన వికృత రాజకీయ వాదాలు... విజాతీయ, విశృంఖల, అధార్మిక భావజాలాలు... విచ్ఛిన్నకర, విద్వేషపూరిత కమ్యూనల్, సూడో సెక్యులర్ కపటత్వాలు చివికి, చితికి... అచ్చమైన స్వాతంత్య్రం, మత సామరస్యం, సంఘీభావం ‘నిశ్శబ్ద బ్యాలెట్ విప్లవం’గా పరిమళించిన ఈనాడు నిస్సందేహంగా యావద్భారతానికీ పులకలెత్తించిన పండుగరోజు! ఛత్రపతి శివాజీ పట్ట్భాషేకం తరవాత భరత జాతి పౌరుషానికి ప్రతీకగా కలకాలం సగర్వంగా గుర్తు పెట్టుకోదగ్గ చల్లని రోజు.
కాంగ్రెస్‌ను భూ స్థాపితం చెయ్యటానికి జాతీయ స్థాయిలో ఇప్పటికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అడపాదడపా అనేక కూటములు ఎన్నికల ఉట్టికొట్టి అధికారాన్ని అందుకోగలిగాయి కూడా. ఏ ఒక్క పార్టీనీ ప్రజలు పూర్తిగా విశ్వసించలేక, విశ్వసించిన కూటమికూడా అధికారాన్ని అట్టేకాలం నిలుపుకోలేక, స్వయంకృతాపరాధాలతో అల్లరిపాలై, కిరీటాన్ని పళ్లెంలో పెట్టి మళ్లీ కాంగ్రెసు చేతికి అప్పగించిన విషాద దృశ్యాలనే ఇంతవరకూ చూశాం. కాంగ్రెసు తానులో నుంచి చీలివచ్చి కాంగ్రెసు సంస్కృతిని పుణికి పుచ్చుకున్న పార్టీల కలయిక కాకుండా... కాంగ్రెసుకు పూర్తిగా భిన్నమైన జాతీయ పార్టీ ఎన్నికల్లో సొంతంగా పెద్ద మెజారిటీ సాధించటం మొదటిసారిగా ఇప్పుడే చూస్తున్నాం.
ఎమర్జన్సీ దురాగతాలకు ఇందిరాగాంధిని శిక్షించిన 1977 ఎన్నికల్లోగాని, వాజపేయి నాయకత్వాన్ని మనసారా ఆకాంక్షించిన 1999 ఎన్నికల్లో కూడా చేయనంతగా కాంగ్రెసు పార్టీని 50 కంటే తక్కువ సీట్లకు దిగజార్చి ఈ ఎన్నికల్లో విజ్ఞులైన ఓటర్లు నూరేళ్లు నిండిన పార్టీకి డెత్ వారంట్ రాశారు.
1977లో కంటే తీవ్రస్థాయిలో ఈసారి కాంగ్రెసును ప్రజలు కాళ్లతో తొక్కెయ్యటానికి కారణాలను వెదుక్కోవలసిన పనిలేదు. దేశాధినేత అయిన ప్రధానమంత్రి పదవిని బంట్రోతు స్థాయికి దిగజార్చి, స్కాముల పుట్టలతో, అక్రమాల కట్టలతో, జాతి పరువుతీసి, అంతులేని అసమర్థతతో దేశాన్ని అధోగతి పాలు చేయటం నిష్కృతిలేని నేరం. ఇంతగా సర్వభ్రష్టమైన ప్రభుత్వం స్వతంత్ర భారత చరిత్రలో ఇంకొకటి కానరాదు.
కాంగ్రెసు మీద, దాని జాతి వ్యతిరేక పోకడ మీద జనానికి ఆగ్రహం ఎప్పటినుంచో ఉంది. కాని దానిని కూలదోస్తే ప్రత్యామ్నాయంగా ఎంచుకోవడానికి సమర్థమైన నాయకత్వమంటూ కనపడక ఇంతకాలమూ ప్రజలు దాన్ని పళ్లబిగువున భరించారు. కాంగ్రెసుకు దీటుగా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నమాట నిజం. కాని ముదిమి మీదపడ్డా పవరు మీద యావ చావక, తమలో తమకే తలలు కలవక, ఎన్నికల్లో పరాభవించినా పద్ధతి మార్చుకోని పాతతరం పెద్దల పెత్తనం సాగినంతకాలమూ భాజపా తమ ఆశలకు, ఆకాంక్షలకు ఆకృతినివ్వగలదన్న నమ్మకం దేశవాసులకు కలగలేదు. స్వయం ప్రతిభతో అట్టడుగు స్థాయి నుంచీ ఎదిగి వచ్చి, విశుద్ధ వర్తనతో విలక్షణ వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుని, గుజరాత్ ముఖ్యమంత్రిగా వరసగా మూడు విడతలు గెలిచి అద్భుత అభివృద్ధిని సాధించి చూపిన నరేంద్రమోదీ ఆగమనంతో పరిస్థితి మారింది. ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న నాయకుడు ఎట్టకేలకు కంటపడటంతో జనానికి కరవుతీరింది. కమలం పంట విరగ పండింది.
జనాకర్షణగల నేతకు ప్రజలు అఖండ విజయం కట్టబెట్టటం 1971లో ఇందిరాగాంధి విషయంలోనూ జరిగింది. ఇందిర హత్యపట్ల సానుభూతితో ఆమె కుమారుడికి ఇప్పుడు మోదీకంటే కూడా చాలా ఎక్కువ మెజారిటీని 1984లో ఇదే ప్రజలు సమకూర్చడమూ యదార్థమే. కానీ వాటికీ నేటికీ పోలిక లేదు. అప్పట్లో గెలిచినవి కేవలం ఒక మహానేత జనాకర్షణ శక్తిమీద ఆధారపడిన ఒంటి స్తంభం మేడలు. సర్వాధికారి చెప్పుచేతల్లో అణగిమణగి ఉండటమే తప్ప సొంత కాళ్లమీద నిలవలేని అంగుష్ఠమాత్రుల భజన కూటములు.
ఇప్పటి పరిస్థితి వేరు. భారతీయ జనతాపార్టీ ఏరికోరి నరేంద్రమోదీని ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నా దానికంటూ స్వతంత్ర విధానం ఉంది. విస్పష్ట సైద్ధాంతిక దృక్పథం ఉంది. కాకలు తీరిన నాయక శ్రేణి ఉంది. సుశిక్షితమైన క్యాడర్ ఉంది. అన్నిటికీ మించి దాని వెనుక ఆర్.ఎస్.ఎస్. అనే జాతీయ మహాశక్తి ఉంది. ఇప్పుడు సాధించిన ఎన్నికల దిగ్విజయం వెనుక లక్షలాది ఆర్.ఎస్.ఎస్. కార్యకర్తలు గ్రామ గ్రామాన గడపగడపనా నెలల తరబడి సాగించిన నిర్విరామ ప్రచారం ఉంది.
అంతేకాదు. గర్వించదగ్గ ఈ గెలుపు వెనుక లక్షలాది యువతీ యువకులు దేశమంతటా అనేక నెలలుగా సోషల్ మీడియా ద్వారా చేసిన అకుంఠిత కృషీ సామాన్యమైనది కాదు. టెలివిజన్లో, మొబైల్ ఫోన్‌లో, ట్విట్టర్‌లో, ఫేస్‌బుక్‌లో, వాట్సప్‌లో ఇందుగలడందు లేడనే సందేహం లేకుండా ‘చాయ్‌వాలా’ ఎక్కడపడితే అక్కడ ప్రత్యక్షమై, సమయానికి తగ్గట్టు అనుక్షణం స్పందించి, గ్రామ గ్రామానా, వాడవాడనా అన్ని వర్గాల జనబాహుళ్యాన్నీ కదిలించి, ఆలోచింపజేసి, ఇంతగా ఆకట్టుకోగలిగాడంటే అది సహస్ర శీర్షాలతో, సహస్ర బాహువులతో ఆయన కోసం నిస్వార్థంగా, స్వచ్ఛందంగా కొత్త కొత్త రీతుల్లో పాటుపడి కొత్త ఓటర్లను కోట్ల సంఖ్యలో సమీకరించిన నవ యువత పుణ్యమే. ఈ యువశక్తి వజ్రాయుధంతోనే నరేంద్రమోదీ ఆసేతు శీతనగ పర్యంతం వీరవిహారం చేశాడు. బీహార్, యు.పి. వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో వెనకబాటుతనంతో రాజకీయం చేసే కులశక్తుల కోటలు కూల్చాడు. రాష్ట్రాలకు రాష్ట్రాలనే ఊడ్చేశాడు. క్రేజీవాలాలాంటి శిఖండుల గర్వమణచాడు. వింధ్యకు ఈవలా తన ఉనికిని చాటాడు. మత సామరస్యానికి, మైనారిటీల మనుగడకు తాము మాత్రమే రక్షకులైనట్లు పోజుపెట్టే పోచుకోలు శక్తుల తోకలు కత్తిరించి, మైనారిటీల మద్దతును అవ్యాజంగా చూరగొని, అఖండ ప్రజాదరణను సాధించగలిగాడు. 2002లో జరిగిన దాన్ని గుజరాతీ ముస్లింలు ఏనాడో మరచిపోయినా తాము మాత్రం మరవక, చీటికీ మాటికీ గోధ్రాగోరీని తవ్వి, మోదీని మహా హంతకుడిగా, ముస్లింల మహా శత్రువుగా చూపెట్టటమే పనిగా పెట్టుకున్న సోకాల్డ్ ‘జాతీయ మీడియా’ ఏమన్నా పట్టించుకోక, దాని తిట్లనే దీవెనలుగా మార్చుకుని, నరేంద్రమోదీ తిరుగులేని జాతీయ మహావీరుడుగా ఎదగగలగాడంటే ఆ మీడియాకంటే పదునైన, దానికంటే విశాలమైన సోషల్ మీడియా అతడికి అండగా నిలిచింది కాబట్టే.
అటల్ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ అద్వానీ అంతటి దిగ్గజాల నేతృత్వంలో భారతీయ జనతాపార్టీ ఇంతకు ముందు కూడా కేంద్రాధికారం అందుకోగలిగింది. కాని తనకంటూ మెజారిటీ లేక, ప్రభుత్వ మనుగడ మిత్రపక్షాల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడటంవల్ల, అవి ఆడించినట్టల్లా ఆడి, అధికార రంధిలో తన అసలు తత్వం మరచి ఎందుకూ కొరగాకుండా అభాసుపాలైంది. రేపు మోదీ అనుభవమూ ఆ తీరునే పరిణమించవచ్చునని చాలామంది హితైషులు భయపడ్డారు. సుస్థిరపాలనకు కావలసినంత బలాధిక్యం సొంతంగానే సమకూడి, అన్ని ప్రాంతాలకూ, అన్ని రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం వహించే జాతీయ రాజకీయ శక్తిగా భాజపా ఎదగగలిగినందువల్ల అటువంటి బెంగలకు ఇక ఆస్కారం లేదు. జాతీయ దృష్టితో ఆలోచించి, సాహసోపేత నిర్ణయాలు చేసి, సవాళ్లను లెక్కచెయ్యక దృఢంగా వ్యవహరించి, సత్ఫలితాలను సాధించగలిగిన నాయకుడిగా మోదీ ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నాడు. బాధ్యతలేని తల్లీకొడుకుల ఇష్టా రాజ్యంలో నోరూవారుూలేని ప్రధాని అసమర్థ నిర్వాకంలో పదేళ్లుగా కూరుకుపోయిన అవినీతి రొంపినుంచి దేశాన్ని పైకి లాగి, అన్ని రంగాల్లో అభివృద్ధిని పరుగులెత్తించగల సత్తా నరేంద్రమోదీకి ఉంది. ఆ బృహత్తర బాధ్యతలో ఎంతవరకు కృతకృత్యుడు కాగలడు, దృఢంగా వ్యవహరిస్తూనే అన్ని వర్గాలనూ, మిగతా నాయకులనూ వీలైన మేరకు కలుపుకొని వెళ్లి జాతీయ నాయకుడుగా ఎంత పరిణతి చెందగలడన్నది మోదీకి పరీక్ష. ఇందులో ఆయన డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడై భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను దిగంతాలకు వ్యాప్తి చేయాలనే జాతి జనులందరి ఆకాంక్ష.
మూలం : ఆంధ్రభూమి దిన పత్రిక
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
నిశ్శబ్ద బ్యాలెట్ విప్లవం వెనుక ఆర్.ఎస్.ఎస్ - సంపాదకీయం
Reviewed by JAGARANA
on
3:24 PM
Rating:
Reviewed by JAGARANA
on
3:24 PM
Rating:

No comments: