ఆలయాలు ధర్మప్రచార కేంద్రాలు కావాలి - ఈమని సువర్ణం
‘‘హిందువులు తమ విభేదాలను మరచి, ఏకంగా ఉండి, తమ ధర్మాన్ని రక్షించుకోవాలి. ఇట్లు ఉంటేనే, హిందూ మతం సజీవంగా ఉంటుంది’’. అని వివేకానందుడు అన్నాడు. ప్రస్తుతం ఇది ఎంతో అవసరం. ఇందుకు ఆలయాల, మఠాల పాత్ర ఎంతగానో ఉన్నది. వీట్లపై ప్రభుత్వ పెత్తనం, రాజకీయవేత్తల అజమాయిషీ తగదని ప్రజాభిప్రాయం.
కోట్లకొలదీ భక్తులను ఆకర్షిస్తున్న తిరుపతి క్షేత్రం, ప్రభుత్వ సహకారం లేకుండా నిర్వహణ జరగదు. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్. అధికారుల ఆసరా అవసరమే, ఇట్లే ఎండోమెంటులోనూ కొద్దోగొప్పో అవసరమే. ఆస్తిపాస్తుల రక్షణ అవసరమైనచోట్ల భక్తులరద్దీ తట్టుకొనడం, ఆదాయ ఖర్చుల వ్యవహారాలు, అర్చకుల వల్లకావు. కేవలం ప్రవేటు వ్యక్తుల వల్ల కావు. కమిటీలు అవసరం. ధార్మిక మండళ్ళు అవసరం. అన్నిచోట్లా సరైన వ్యక్తులు దొరకక పోవచ్చు. ముందుకు రాకపోవచ్చు. ఇతర మతస్తులు తమ ధర్మసంస్థలను ఎంతో ఉత్సాహంతో నిర్వహించుకుంటున్నారు. తమ మతాలను అభివృద్ధిచేసుకుంటున్నారు. మనలోనూ ఇట్లే ఉంటే మంచిది. ఇందులకు భిన్నంగా ఆలయాలు విమర్శల పాలవ్వడం, ఆస్తుల అన్యాక్రాంతాలు, అమ్మబడడం సొమ్ము ఇతరత్రా మళ్ళించడం, కోర్టు కేసులు, నిర్ణయాలు మాటిమాటికీ మారడం జరుగుతున్నాయి. ఇవి హిందూ సమాజానికే అగౌరవం.
ఆలయాలు పారిశ్రామిక కేంద్రాలు కావు. ఇవి ఆధ్యాత్మిక సంస్థలు. ఇందులకు ఎవరైనా భిన్నంగా ఉంటే, పాలల్లో ఉప్పు కలిపినట్లే నాస్తికులకు, అన్యమతస్తులకు ఆలయాలలో, మఠములలో ఎట్టి స్థానం ఉండరాదు.
ఎందరో మంత్రివర్యులు, పై అధికారులే ఎంతగానో ఆలయ ఆస్తులను అన్యాక్రాంతాలపాలుచేశారని, ఆశ్రీత పక్షపాతం చూపారన్న మాట వచ్చింది. ఇందుకు సింహాచలం, అంతర్వేది, కొన్ని ఇతర ప్రాంతాలు ఉదాహరణలు. ఆగమశాస్త్ర నిబంధనలను పాటించాలి. గురుముఖతః వస్తున్న వేదాలను పెంపొందించాలి. ఆలయాల నిర్వహణ అగ్నిహోత్రంలాగున ఉండాలి. పాపభీతి, దైవప్రీతి అవసరం. ధర్మాన్ని రక్షించలేని పాలకులు, ఆలయాల సొమ్ముని ఇతరత్రా ఎందుకు వాడాలి? ఎండోమెంటు శాఖ పాలకుల స్వార్థానికి ఆసరాగా ఉన్నది. ఆశ్రీతులకు ఉద్యోగాలను ఇవ్వడం, సొమ్ముని ఇష్టం వచ్చినట్లు వాడడం పరిపాటైనది. హిందూ మతం దూషణల పాలైతే, అవమానింపబడితే, పాలకులు పట్టించుకొనుట లేదు. ఆలయం పక్కనే చర్చీలు లేస్తే ఏమీ అనరు. మాటవరసకైనా, మత మార్పిడులు చేయవద్దని అనరు. అటువంటప్పుడు ఆలయాలపై రాజకీయవేత్తల పెత్తనం ఎందుకు? పాశ్చాత్యులే మన సంస్కృతిని మెచ్చుకుంటున్నారు. మన దేశీయులే ఎందరో విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మన కుటిల రాజకీయాలు, కొన్ని శాసనాలు ఇంద్రజాలంగా మారినవి. కొన్ని దుష్టశక్తులు తాండవాడుతున్నాయి.
మరోవైపు కొన్ని పాశ్చాత్య దేశాలు మత మార్పిడులను ప్రోత్సహిస్తుంటే, మనం ప్రాంతీయపరంగా, ఎక్కడికి అక్కడే సంకుచిత భావంతో ఉండడం ఎంతమాత్రం తగదు. ఆత్మరక్షణకు, ఆలయాల మిగులు నిధులను ఏకం చేసి, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ట్రస్టులను ఏర్పాటుచెయ్యాలి. హిందూ కోడ్‌ని పెట్టిన పాలకులు, హిందూ ధర్మరక్షణకు పరోక్షంగా బాధ్యులే. ఇతర మతస్తులకు, పాలకులకు అవి బాధ్యత ఉండదు. ఎందుకంటే వారి మతాల జోలికి పాలకులు పోలేదు. వారు వారి ఆస్తులను రక్షించుకుంటున్నారు. అదేవిధంగా మన ఆలయాల, మఠాల ఆస్తులను రక్షించుకోవాలి. ఆస్తులనుండి పూర్తి ఆదాయాన్ని రాబట్టాలి. అందుకోసం ఈ కింది చర్యలు చేపట్టవచ్చు.
1) రాష్ట్రంలో గవర్నర్లు, కేంద్రంలో రాష్టప్రతి వ్యక్తిగతంగా, ఎట్టి రాజకీయ ప్రమేయం లేకుండా, హిందూ ప్రముఖుల సలహాలపై, ధార్మిక మండలులను నియమించాలి. ఇందులో ప్రఖ్యాత పండితులు, న్యాయశాఖ వారు పరిపాలనాదక్షులు, అనుభవజ్ఞులు, ఆర్థికవేత్తలు, హిందూధర్మసంస్థల ప్రతినిధులు, దాతలు, చార్టర్ ఎక్కౌంటెంట్లు ఉండాలి. ఐ.ఎ.ఎస్.లేక ఐ.పి.ఎస్ అధికారులను ధార్మిక చింతన ఉన్నవారిని డిప్యుటేషన్‌పై, కమిషనర్ కార్యదర్శులుగా తీసుకోవాలి.
2) నిత్య కార్యక్రమాలకు తగు మాత్రంగా ఎండోమెంటు సిబ్బంది చాలు.
3) సమస్యల పరిష్కారానికి ధార్మిక ట్రిబ్యునల్ ఏర్పాటుచేయాలి. వారి నిర్ణయాలే తుది నిర్ణయాలు కావాలి.
4) ఇంటింటా సనాతన ధర్మప్రచారం అవసరం. ధార్మిక విలువలను వ్యాప్తం చేస్తే, ప్రజలు సహజంగా న్యాయమార్గంలో ఉంటారు. పాశ్చాత్య ప్రభావం తగ్గుతుంది. మన సమాజంలోని లోటుపాట్ల నిర్మూలన కూడా ఒక ముఖ్య ఆశయం అవ్వాలి.
ఈ సందర్భంలో లౌకిక పరంగా పాలనకు యు.పి.ఎన్.సి ద్వారా నియామకాలు ఔతున్నాయి. ఇందులో ఒక భాగంగా దేశంలోని అన్ని ఆలయాల మఠాల నిర్వహణకు, మన పురాణాల, ఇతిహాసాల,శాస్త్రాల్లో, సంస్కృతిలో ప్రవీణులైన వారిని, వారి ఇతర అర్హతలతో పాటు తీసుకుంటే మున్ముందు హిందూ ధర్మసంస్థలు ఎంతగానో రాణిస్తాయి. ఎట్టి విమర్శలూ ఉండవు. మున్ముందు, వారు ఇతర దేశాలలో భారతీయ సంస్కృతికి ప్రతినిధులుగా ఉంటారు. హిందూ కోడ్‌ని పెట్టిన పాలకులు హిందూ ధర్మరక్షణకు బాధ్యులే. శాసనాలు, పరిపాలనా విధానాలు సమయానుకూలంగా మనకోసం ఉండాలి. వాటికోసం మనం కాదు. ప్రియాశీలురుగా ఆలోచించాలి.
మూలం : ఆంధ్రభూమి దిన పత్రిక
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
ఆలయాలు ధర్మప్రచార కేంద్రాలు కావాలి - ఈమని సువర్ణం
Reviewed by JAGARANA
on
9:13 AM
Rating:
No comments: