నాగపూర్: ఓటుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం - విజయదశమి ఉత్సవం లో మాన్య శ్రీ మోహన్ భగవత్
రేషంబాగ్, నాగపూర్, అక్టోబర్ 13: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆశించిన మార్పును తీసుకు రావాలంటే ప్రజలు, ముఖ్యంగా యువకులు, కొత్తగా ఓటు హక్కు పొందిన వారు తమ గురుతర బాధ్యత అయిన వోటుహక్కును సంపూర్ణంగా వినియోగించుకోవాలని, అప్పుడే దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారమవుతాయని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 88వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం నాగపూర్‌లోని సువిశాలమైన రేషిమ్ బాగ్ మైదానంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన విజయదశమి సందేశమిస్తూ అంశాలు, పార్టీల విధానాలు, పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యక్తిత్వం ఆధారంగా నూటికి నూరుశాతం వోటింగ్ జరిగేలా చూడాలని పిలుపునిచ్చారు. ‘వందశాతం ఓటింగ్ మన ప్రజాస్వామ్యాన్ని మరింత ఆరోగ్యకరమైనదిగా చేస్తుంది’ అని ఆయన అన్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, డాక్టర్ లోకేశ్ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయగా, ఆర్‌ఎస్‌ఎస్ సర్‌కార్యవాహక్ సురేశ్ అలియాస్ భయ్యా జోషీ, విదర్భ ప్రాంత సహ సంఘ్‌చాలక్ రామ్ హర్కరే, నాగపూర్ మహానగర సంఘ్‌చాలక్ డాక్టర్ దిలీప్ గుప్తా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ భద్రతను, ప్రగతిని కాపాడాల్సిన వారికి ఆ లక్ష్య సాధనకు అవసరమైన శక్తిసామర్థ్యాలు కొరవడినప్పుడు, వారి ఉద్దేశాలు సైతం ప్రశ్నార్థకమైనప్పుడు, ఈ దేశాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి అంకిత భావం, దృఢదీక్షతో సమాజమే ముందుకు రావాలని దాదాపు గంట సేపు చేసిన ప్రసంగంలో భగవత్ పిలుపుచ్చారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు మొత్తం దేశ జనాభాపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఆయన అన్నారు. సామాన్య ప్రజలు తమ నేతలు, పాలకులను ఎన్నుకుంటారని, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లు ఎవరికి ఓటు వేయాలో చర్చించుకోవడం సహజమని, అయితే దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక పరిష్కారం కనుగొనడం కోసం వారు చర్చించుకోవాలని ఆయన అన్నారు. అందువల్ల 2014లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గుణగణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఓటర్లు ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు పిలుపునిచ్చారు. అన్నిటికన్నా ముందు ఓటర్ల జాబితాలో తమ పేరు ఉండేలా చూసుకోవాలని, ఆ తర్వాత బరిలో ఉన్న రాజకీయ పార్టీల విధానాలు, అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకుని తమ ఓటుహక్కును వినయోగించుకోవాలని భగవత్ అన్నారు. ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థులను తిరస్కరించేందుకు సుప్రీంకోర్టు అవకాశం కల్పించినందున ఓటర్లు జాగ్రత్తగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎందుకంటే ఈ అవకాశం అయిదేళ్లకోసారి మాత్రమే వస్తుందని ఆయన అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయాలకు పాల్పడదని, నిజానికి ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలకు రాజకీయాలు ఓ అడ్డంకి అని భగవత్ అన్నారు. మన బాధ్యత కేవలం మంచి అభ్యర్థులను ఎన్నుకోవడంతో ముగియదని, ఎన్నికయిన తర్వాత అయిదేళ్లు వాళ్లు ఎలా పని చేస్తారో గమనించాల్సిన అవసరం కూడా ఉందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల ప్రలోభాలకు, తప్పుడు ప్రచారాలకు లొంగవద్దని కూడా ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు విధానాలే కారణమని భగవత్ విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితి సామాన్య ప్రజల దైనందిన జీవితాలపై నేరుగా ప్రభావం చూపిస్తోందని, ఇప్పుడు పెరిగి పోతున్న ధరల భారంతో సామాన్యుడు కుంగి పోతున్నాడని ఆయన అన్నారు. అవినీతిని అదుపు చేయడానికి కఠినమైన చట్టాలను తీసుకు రావడానికి బదులు ప్రభుత్వం లోపభూయిష్టమైన చట్టాలను తీసుకు వస్తోందని ఆయన విమర్శించారు.
యుపిఏ ప్రభుత్వ బలహీన విధానాల కారణంగానే చైనా, పాకిస్తాన్‌లు పదే పదే సరిహద్దుల్లో మన భూభాగంలోకి చొరబడుతున్నాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ దుయ్యబట్టారు. చైనా ఉత్పత్తులు మన దేశంలోకి పెద్ద ఎత్తున చొరబడుతున్నాయి. ఇదే కాక అది మన భూభాగంలోకి తరచూ చొరబడుతూ ఉండడంతో దేశ భద్రతపై కారుమేఘాలు కమ్ముకుంటున్నాయన్నారు. మైనారిటీలను బుజ్జగించే విధంగా కేంద్ర హోం మంత్రి షిండే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయడంపైన, తమిళనాడులో మతతత్వ శక్తులచేతిలో హిందూ నేతలు హతమారడాన్ని ఆయన పట్టించుకోకపోవడం పట్ల భగవత్ మండిపడ్డారు.
నాగపూర్: ఓటుతోనే ప్రజాస్వామ్యం బలోపేతం - విజయదశమి ఉత్సవం లో మాన్య శ్రీ మోహన్ భగవత్
Reviewed by JAGARANA
on
8:47 AM
Rating:
No comments: