నవరాత్రి ఉత్సవాలలో రతన్‌గఢ్ ఆలయం వద్ద తొక్కిసలాట 90 మంది దుర్మరణం
దాతియా, అక్టోబర్ 13: నవరాత్రి వేడుకలు మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లాలో పెను విషాదాన్ని మిగిల్చాయి. జిల్లాలోని సుప్రసిద్ధ రతన్‌గఢ్ ఆలయం వద్ద ఆదివారం నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 90మంది భక్తులు చనిపోగా, వందమందికి పైగా గాయపడ్డారు. నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి రతన్‌గఢ్ ఆలయానికి ఏటా లక్షలాది భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది కూడా ఆదివారం సుమారు 5 లక్షలమంది భక్తులు ఆలయానికి వచ్చారు. ఆలయానికి వెళ్లే దారిలో సింధ్ నదిపై నిర్మించిన వంతెన కూలిపోతోందంటూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించిన వదంతుల కారణంగా, వంతెనపై తొక్కిసలాట చోటుచేసుకుంది. ఫలితంగా 90మంది మృత్యువాతపడ్డారని, వందమందికి పైగా గాయపడ్డారని చంబల్ రేంజ్ పోలీసు డిఐజి డికె ఆర్య వెల్లడించారు. చనిపోయిన వారిలో పలువురు మహిళలు, పిల్లలు ఉన్నారు.
జిల్లా కేంద్రానికి దాదాపు అరవై కిలోమీటర్ల దూరంలో సింధ్ నది ఒడ్డున ఉన్న రతన్‌గఢ్ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దాతియా జిల్లా నలుమూలల నుంచి, పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి లక్షలాది భక్తులు చేరుకున్నారు. అయితే కొంతమంది భక్తుల వరుసను తప్పించుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించగా, వారిని అదుపుచేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో తొక్కిసలాట మొదలైందని ధ్రువీకరణ కాని కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. ఈ దుర్ఘటనలో వందమందికి పైగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆస్పత్రులకు తరలించినట్టు ఆయన చెప్పారు. వంతెనపై పెద్ద సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదరుగా పడి ఉండగా, తమ ఆప్తుల కోసం బంధువులు ఆత్రంగా వెతుకుతున్న హృదయవిదారక దృశ్యాలు ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు, స్థానిక వలంటీర్లు నానా అవస్థ పడాల్సి వచ్చింది. సంఘటనతో ఆగ్రహించిన జనం పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టడానికి పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారు. రాళ్లు రువ్విన ఘటనలో ఒక సబ్‌డివిజనల్ పోలీసు అధికారికి తీవ్ర గాయాలయ్యాయని, మరి కొందరు పోలీసులు కూడా గాయాలయ్యాయని ఆర్య చెప్పారు. అతి కష్టంమీద పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్టు ఆయన చెప్పారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికల కమిషన్ అనుమతితో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 1.5లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. సంఘటనలో తీవ్ర గాయాలైన వారికి 50 వేలు, స్వల్ప గాయాలైన వారికి 25వేల చొప్పున సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా, మధ్యప్రదేశ్‌లోని దాతియా జిల్లా రతన్‌గఢ్ ఆలయం వద్ద తొక్కిసలాటలో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించడంపై రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
నదిలో మునిగి ఐదుగురు మృతి?
ఇలాఉండగా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం దాతియా జిల్లాలోని రుహేరా గ్రామంలో సింధ్ నదిలో విగ్రహాలను నిమ్మజ్జనం చేయడానికి వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, మరో ఇద్దరి జాడ తెలియడం లేదు. నదిలో గౌరీ పార్వతి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి గ్రామానికి చెందిన ఏడుగురు చిన్నారులు వెళ్లారని, విగ్రహాలను నిమజ్జనం చేసేటప్పుడు ప్రమాద వశాత్తూ వాళ్లంతా నదిలో కొట్టుకుపోగా, ఇద్దరిని మాత్రం కాపాడగలిగారని పోలీసులు తెలిపారు. 10నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురు బాలికల మృతదేహాలను నదిలోనుంచి బైటికి తీశారని, జాడ తెలియని మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారని వారు చెప్పారు.
source: http://andhrabhoomi.net/content/dead
source: http://andhrabhoomi.net/content/dead
నవరాత్రి ఉత్సవాలలో రతన్‌గఢ్ ఆలయం వద్ద తొక్కిసలాట 90 మంది దుర్మరణం
Reviewed by JAGARANA
on
8:37 AM
Rating:
No comments: