‘అగ్ని’పథంలో మరో మైలురాయి - అగ్ని - 5 పరీక్ష విజయవంతం
అగ్ని-5 క్షిపణికి 5 వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించే సామర్థ్యం ఉంది
బాలసోర్, సెప్టెంబర్ 15: పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఖండాంతర క్షిపణి అగ్ని-5 క్షిపణిని ఆదివారం మన దేశం మరోసారి విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. 5 వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను ఛేదించగలగడమే కాక అణ్వస్త్రాలను సైతం మోసుకెళ్లగలిగిన ఈ క్షిపణిని ఒడిశా తీరానికి దగ్గర్లోని వీలర్స్ దీవిలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌కు చెందిన లాంచ్ కాంప్లెక్స్‌నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు ఈ క్షిపణిని అభివృద్ధి చేసిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ)కు చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఈ ప్రయోగం పూర్తిగా విజయవంతమైనట్లు ఆ అధికారి తెలిపారు. భూతలంనుంచి భూతల లక్ష్యాన్ని ఛేదించగలిగిన ఈ క్షిపణిని తొలిసారిగా గత ఏడాది పరీక్షించిన విషయం తెలిసిందే. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఐటిఆర్‌నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ క్షిపణి ముందు నిర్ణయించిన మార్గంలో పయనించి నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుందని ఆయన చెప్పారు.
టన్నుకు పైగా అణ్వస్త్రాలను తీసుకెళ్లగలిగిన అగ్ని-5 క్షిపణికి 5 వేల కిలోమీటర్లకు పైగా దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదించే సామర్థ్యం ఉంది. 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉండే ఈ క్షిపణి ప్రయోగ సమయంలో 50 టన్నుల బరువు ఉంటుంది. మూడు దశల ఘన రాకెట్ మోటార్ల శక్తితో పయనించిన ఈ క్షిపణి మార్గ మధ్యంలో నిర్ణయించిన చోట్ల మూడు మోటార్లను సముద్రంలోకి జారవిడిచి నిర్ణీత లక్ష్యాన్ని తాకిందని డిఆర్‌డిఓ ప్రకటనలో తెలిపింది. మార్గమధ్యంలోను, టార్గెట్ వద్ద సిద్ధంగా ఉంచిన నౌకలు క్షిపణి ప్రయాణాన్ని, లక్ష్య ఛేదనను రికార్డు చేసినట్లు కూడా ఆ ప్రకటన తెలిపింది. కాగా, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ డిఆర్‌డిఓ శాస్తజ్ఞ్రులను అభినందిస్తూ వారు దేశం గర్వపడేలా చేసారని అన్నారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ సైతం శాస్తజ్ఞ్రులను అభినందిస్తూ, ఈ రోజు ప్రయోగం భారత దేశ లాంగ్ రేంజ్ క్షిపణుల చరిత్రలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు.
ఆంధ్రభూమి దిన పత్రిక సౌజన్యంతో
‘అగ్ని’పథంలో మరో మైలురాయి - అగ్ని - 5 పరీక్ష విజయవంతం
Reviewed by JAGARANA
on
7:16 AM
Rating:
No comments: