విశ్లేషనాత్మక వ్యాసం : విదేశీయ సంస్థలకు ' ఆహార భద్రత '. - హెబ్బార్ నాగేశ్వర్ రావు
వ్యవసాయ క్షేత్రాలలోకి చొరబడిన ‘బహుళ జాతీయ వాణిజ్య మారీచ మృగం’ అంకురాలను ఆరగిస్తుండడం లోక్‌సభ సోమవారం రాత్రి ఆమోదించిన ఆహార భద్రతా వ్యవస్థకు నేపథ్యం! దేశంలోని అరవై ఏడు శాతం జనానికి ముప్పూటలా భోజన సమృద్ధిని కలిగించడానికి లోక్‌సభ ఆమోదించిన ‘బిల్లు’వల్ల సాధ్యవౌతుందట! మిగిలిన ముప్పయిమూడు శాతం ప్రజలను స్వేచ్ఛావిపణిలో ఆహారం విక్రయించే వాణిజ్య సంస్థలు ధరలు పెంచి కొల్లగొట్టడానికి ఇలా పరిమితి విధించడం వీలుకల్పిస్తుందన్నది బహిరంగ రహస్యం. అందువల్ల పరిమితి విధించకుండా వంద శాతం ప్రజలకు ఆహార భద్రతను విస్తరింపచేయడం గురించి ప్రభుత్వం ఆలోచించాలి! కానీ ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ఆలోచించనీయవు. వంద శాతం ప్రజలకు ప్రభుత్వాలు చౌకగా ఆహార ధాన్యాలను సరఫరా చేయగలిగినట్టయితే సేకరణ ప్రక్రియలో మాధ్యమంగా మారిన ‘వాణిజ్యం’ అక్రమ లాభాలను ఆర్జించడానికి ఏమాత్రం వీలుండదని ఈ విదేశీయ సంస్థలు భయపడుతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థతో అనుసంధానం చేసే కార్యక్రమం మొదలైపోయింది. మొదలైన తరువాత మూడేళ్లు తిరగకముందే ఉప్పు మొదలుకొని సర్వ సమస్త ఆహార ద్రవ్యాల ధరలు ఆకాశంలోకి చేరాయి. ఉల్లిపాయల ధరలు కిలో ఎనబయి రూపాయల స్థాయికి చేరిపోవడం ‘అనుసంధానం’ ఫలితమే. ఉల్లిని ఇంత ధరపెట్టి కొని వండుకొని తినవలసిన వారికి ఆహార భద్రత ఏమిటి?? యర్రగడ్డ ధరలు కూరగాయల ధరలు తాత్కాలిక వైపరీత్యం అని సరిపెట్టుకొన్నప్పటికీ ఈ తాత్కాలిక వైపరీత్యం ప్రతి ఏటా అనేకసార్లు పునరావృత్తవౌతోంది. అనుసంధాన నుండి దేశం బయటపడితే తప్ప ఈ వైపరీత్యం లొంగదు. కనీసం వంకాయలు, బెండకాయలు, సొరకాయలు, బీరకాయలు వంటివి లేకుండా వట్టి బియ్యం వండి ఉప్పేసుకొని చప్పరించేస్తే మాత్రమే ఆహార భద్రత ఏర్పడుతుంది. ఇప్పటికే అనేక కుటుంబాలవారు అప్పుడప్పుడు ఇలా చప్పరిస్తున్నారు. కిలో చౌక బియ్యం కిలో కూరగాయలు- వెరసి రెండు కిలోల సగటు ధర ఎంత!? ప్రస్తావించిన చౌక రకం కూరగాయల ధరలు కూడ కిలో నలబయి రూపాయల పైమాటే!! పప్పులు నూనెల సంగతి వేరే ఉంది. అందువల్ల ‘గోధుమల భద్రత’, ‘బియ్యం భద్రత’, ‘జొన్నల భద్రత’ మాత్రమే ఆహార భద్రత రావడం లేదు!! ఈ భద్రత కూడ పాక్షికమే! ఎందుకంటె...
నెలకు ప్రతి వ్యక్తికీ అయిదు కిలోల చొప్పున మాత్రమే బియ్యం ఇత్యాదులు ప్రభుత్వపు చౌక దుకాణాలలో విక్రయిస్తారు! కాని ఐదు కిలోలు నెలంతా ఒక వ్యక్తికి మూడుపూటల తిండికి సరిపోతాయా? కాయకష్టం చేసి స్వేదబిందువులను ప్రతిక్షణం చిందించేవారు నాలుగు పూటలైనా తిని జీర్ణించుకోగలరు. కానీ తినడానికి శక్తిలేదు! ‘శక్తి’ ఉన్నవారు- ఆర్థికశక్తిఉన్నవారు- ‘ఆరా రా’ ఆరగించి అరగకపోతే మందులు మింగుతున్నారు. కానీ ఐదు కిలోల బియ్యం ఒకరు రెండు పూటల తినడానికి సైతం నెలంతా సరిపోవు! అందువల్ల ఇది ఆహార పాక్షిక భద్రతా పథకం మాత్రమే అవుతోంది! మిగిలిన అవసరమైన నెలసరి ఆహార ధాన్యాలను ఈ అరవై ఏడు శాతం పేదలు సైతం స్వేచ్ఛావిపణిలో కొనుక్కోవాలి!! ఈ కొనుగోలు క్రియలో ఈ సామాన్య ప్రజలు ‘అంతర్జాతీయ అనుసంధాన వాణిజ్య విషవలయం’లో చిక్కుకోక తప్పదు. ఈ వలయాన్ని నిరంతరం విస్తరింపచేస్తున్నవారు విదేశీయ వాణిజ్య సంస్థల వారు!! ‘వాల్‌మార్ట్’వంటి బృహత్ బీభత్స రాక్షస వాణిజ్య సంస్థలు చిల్లర వ్యాపారంలోకి ప్రవేశించాయి కనుక స్వదేశీయ సంప్రదాయ వాణిజ్యం నిర్వహిస్తున్న చిట్టివ్యాపారులు ఆహార భద్రనే కాదు బతుకు భద్రతనే కోల్పోతున్నారు. ప్రధాని మన్‌మోహన్‌సింగ్ అంతర్జాతీయ అనుసంధాన ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని, ‘‘సమగ్రంగా సమీకృతం’’ కావలసి ఉందని, అందుకు చర్యలు తీసుకుంటామని అభిభాషిస్తున్నారు. ఈ సమగ్ర సమీకృత అంతర్జాతీయ ఆర్థిక అనుసంధానం జరిగితే కందిపప్పు ధర కిలో నూటయాబయికి బియ్యం వంద రూపాయలకు పెరగవచ్చు ఆశ్చర్యం లేదు! ‘ఆహార భద్రత పథకం’ ‘అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం’ పరస్పరం వ్యతిరేకించుకునే ఆర్థిక అంశాలు!! ‘్భద్రత’ను భంగపరిచే వ్యవస్థను మొదట ఏర్పరచిన ప్రభుత్వం ఇప్పుడు పాక్షిక భద్రతను ఏర్పరచినందువల్ల సామాన్యుల బతుకుల ప్రాంగణాలలో వెనె్నల వృక్షాలు పెరగవు! పెట్రోలు, చక్కెర వంటివాటి పంపిణీ అంతర్జాతీయ అనుసంధానమైంది. ఈ అనుసంధానాన్ని రద్దుచేసినప్పుడు మాత్రమే ఆహార భద్రత ఏర్పడుతుంది!!
రూపాయి విలువ పాతాళంలోకి పడిపోవడం రుగ్మత కాదు. దేశాన్ని ఆవహించి ఉన్న రుగ్మతకు సంకేతం! దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గుముఖం పట్టింది. ఎందుకంటె వ్యవసాయ భూమి విస్తీర్ణత తగ్గిపోతోంది. ప్రత్యేక ఆర్థిక మండలుల- ‘సెజ్’లు- స్పెషల్ ఎకనామిక్ జోన్స్- వ్యవసాయ భూమిని దిగమింగేస్తున్నాయి. పప్పు్ధన్యాల ఉత్పత్తి 2006నుంచీ తగ్గుముఖం పట్టిందట! అయినప్పటికీ దేశంలో సగటున సాలీనా ఇరవై నాలుగు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రతి వ్యక్తికీ సాలీనా తలసరి సగటు దాదాపు నూట తొంబయి ఐదు కిలోలు. ఇందులో తొమ్మిదిన్నర కోట్ల టన్నుల బియ్యం, ఎనిమిదిన్నర కోట్ల టన్నుల గోధుమలు, నాలుగు కోట్ల టన్నులకు పైగా జొన్నలు, సజ్జలు, రాగులు వంటి తృణ ధాన్యాలు ఉన్నాయి. రెండు కోట్ల టన్నుల పప్పులను పక్కకుపెట్టినప్పటికీ బియ్యం గోధుమలు ముతక ధాన్యం ఉత్పత్తి ఇరవై రెండు కోట్ల టన్నులు! ప్రతి వ్యక్తికీ సగటున నూట ఎనబయి ఐదు కిలోల చొప్పున ఆహార ధాన్యం ఉత్పత్తి అవుతోంది. కానీ ఆహార భద్రత పథకంలో భాగంగా ప్రతి వ్యక్తికీ సాలీనా అరవై కిలోలు మాత్రమే!! అరవై ఏడు శాతం ప్రజలకు సంబంధించిన పదిన్నర కోట్ల టన్నుల ఆహారం స్వేచ్ఛా విపణిలోనే ఉంది. మిగిలిన ముప్పయిమూడు శాతం ప్రజలకు సంబంధించిన ఎనిమిది కోట్ల టన్నుల ఆహారం కూడ ‘ఆహార భద్రత పథకం’ వెలుపలనే అమ్ముడుపోతుంది. అంటే పద్దెనిమిదిన్నర కోట్ల టన్నుల ఆహారం- గోధుమ బియ్యం ముతక ధాన్యం, పప్పులు- స్వేచ్ఛావిపణిలో అమ్ముడుపోతుండగా ఐదున్నర కోట్ల టన్నుల ఈ ధాన్యం మాత్రమే ‘ఆహార భద్రత’కోసం చౌకగా విక్రయిస్తారు!! అందువల్ల ఈ పద్దెనిమిదిన్నర కోట్ల టన్నుల ఆహారాన్ని ఏ ధరకైనా అమ్మవచ్చు. ముప్పయి మూడు శాతం ‘పేదలు కాని ప్రజలు’ స్వేచ్ఛావిపణిలో అధిక ధరలకు బియ్యం గోధుమలు వంటి వాటిని కొంటారు. అంతేకాదు అరవై ఏడు శాతం ప్ర జలు కూడ తక్కువ పడిన ఆహార ధాన్యాలను స్వేచ్ఛావిపణిలో కొని తీరాలి!! అమ్మే ‘వాల్‌మార్ట్’వంటి సంస్థలు ధరలు పెంచి లాభాలు ఆర్జించి తీరాలి. ఇలా వ్యవస్థీకృతమై ఉంది ఆహార భద్రతా పథకం!!
స్వేచ్ఛావిపణిలో సాలీనా పద్దెనిమిది కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను మామూలుగా పంపిణీ చేసినట్టయితే ఇప్పుడు కూడ కిలో ముప్పయి రూపాయలకంటె తక్కువకే సన్నబియ్యం మేలు బియ్యం కూడ అమ్మి బియ్యం మరలవారు, వ్యాపారులు మంచి లాభాలను గడించవచ్చు! కానీ యాబయ వరకు ధర పెరగడానికి కారణం ఏమిటి?? ఆహార ధాన్యాలను అక్రమంగా దాచేసి కృత్రిమకొరతను సృష్టించడం! కోట్లాది టన్నుల ఆహార ధాన్యాలు నిలువ ఉండగా, లక్షలాది టన్నులు మాత్రమే సన్నబియ్యం ఎగుమతి అయినందువల్ల ధరలు పెరగనక్కరలేదు. కానీ పెంచారు. అంతేకాదు- పదిహేను నెలల క్రితం ‘విపణి’లో మధ్యతరగతి వారికి లభించిన మేలురకం సన్నబియ్యం అప్పటినుంచి చిల్లర దుకాణాలకు చేరడమే లేదు. ఆ బియ్యం అంతా ఎగుమతి అవుతోందా? దాచేసి టోకు దుకాణాలలో మాత్రమే అధిక ధరలకు విక్రయిస్తున్నారా?? కేంద్ర ప్రభుత్వం పసికట్టలేని పసికట్టదలచని ప్రపంచీకరణ మాయాజాలమిది!!
అంతర్జాతీయ ప్రయోజనమంటే అమెరికా, కొరియా, చైనా, ఐరోపా సమాఖ్య వంటి దాదాపు ముప్పయి ఐదు దేశాలలోని ‘బహుళజాతీయ వాణిజ్య సంస్థల’ అక్రమ లాభం మాత్రమే!! ఇందుకు అనుగుణంగానే 1993నుండి మన ఆర్థిక నీతి రూపొందింది, అమలు జరిగింది! జరుగుతోంది! అందువల్లనే అమెరికా డాలరు ప్రాతిపదికగా మన వినిమయ ద్రవ్యం విలువ అరవై ఎనిమిది రూపాయలకు పడిపోయినప్పటికీ మన ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడ లేదు. విదేశాలనుండి దిగుమతి అవుతున్న ఎరువులపై విత్తనాలపై సుంకాలను పెంచినట్టయితే రూపాయి విలువ కూడ పెరుగుతుంది. కానీ మన ప్రభుత్వం పెంచదు. ఎందుకంటె ‘బహుళ జాతీయ సంస్థలు’ ఆగ్రహిస్తాయి. ఇలా సుంకాలు పెంచడంవల్ల మన రైతులకు ఇవ్వవలసిన ‘సబ్సిడీ’ వ్యయం కూడ పెరుగుతుంది. అది కూడ మన ప్రభుత్వానికి ఇష్టంలేదు! అందువల్ల బంగారం దిగుమతులను తగ్గించింది. దీనివల్ల రూపాయి విలువ పెరగలేదు... బంగారం ధరలు మాత్రమే పెరుగుతున్నాయి!! అమెరికాకు చెందిన మెన్‌సాంటో వంటి కంపెనీలు పత్తి విత్తనాలను కిలో రెండువేల రూపాయల చొప్పున ఎందుకు అమ్మాలి?? రెండు వందల రూపాయలకు అమ్మి తీరాలన్న నిబంధనను ఎందుకని ప్రభుత్వం విధించలేదు?? ఎవరికి భద్రత!!
జన్యుపరివర్తన- జెనటిక్ మాడిఫికేషన్- ప్రక్రియవల్ల రూపొందుతున్న విత్తనాలలో ‘బాసిల్లస్ తురింజియెన్సిస్’అన్న విష రసాయనం దాగిఉంది. ఈ ‘బిటి’ రకం పత్తికాని ఇతర మొక్కలు కాని భూమిని క్రమంగా నిస్సారం చేయగలుగుతున్నాయి! ‘బిటి’ ఆహారం తిన్నవారికి చిత్ర విచిత్ర వ్యాధులు సంక్రమిస్తాయన్నది మరో కఠోర వాస్తవం. విత్తనాలు వంగడాలలోనే కాదు విదేశీలనుండి దిగుమతి అయిపోతున్న అనవసరపు మిఠాయిలలో కూడ ‘బిటి’ విష రసాయనం దాగిఉన్నట్టు బయటపడింది. ‘ఎండోసల్ఫాన్’ పురుగుల మందు పురుగులను తిని మనుషులకు రోగాలను పంచుతోంది!! కానీ మన ప్రభుత్వం ‘బిటి’ పంటలను, ‘బిటి’ మిఠాయిల దిగుమతులను, ఎండోసల్ఫాన్ వాడకాన్ని నిషేధించడానికి ఇష్టపడడం లేదు. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవలసి వచ్చింది!! ‘బిటి’ ఎండోసల్ఫాన్ విషపూరిత శీతల పానీయాలు ప్రపంచీకరణలో భాగం. బీహార్‌లో మధ్యాహ్న భోజనం తిని అనేకమంది విద్యార్థులు మరణించడం కూడ ‘ప్రపంచీకరణ’ వైపరీత్యంలో భాగం! ప్రపంచీకరణ బంధంనుండి విముక్తి జరిగేవరకూ ఆహార భద్రత ఎండమావి నీరు...
ఆంధ్రభూమి దిన పత్రిక సౌజన్యంతో
ఆంధ్రభూమి దిన పత్రిక సౌజన్యంతో
విశ్లేషనాత్మక వ్యాసం : విదేశీయ సంస్థలకు ' ఆహార భద్రత '. - హెబ్బార్ నాగేశ్వర్ రావు
Reviewed by JAGARANA
on
8:39 AM
Rating:
No comments: