సింహాచలం గోశాలలో మృత్యుఘోష
విశాఖపట్నం, మే 14: గోవులతో నిత్యం కళకళలాడే సింహాచలం గోశాలలో మృత్యు ఘోష వినిపిస్తోంది. ఒకటీ రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో కోడె దూడలు ఒక్కటొక్కటిగా నేల రాలుతున్నాయి. మండుటెండల్లో కూడా వాటికి సరైన నీడ కల్పించక, తగిన ఆహారాన్ని, నీటిని అందించక దుర్భర స్థితిలో వాటిని అధికారులే మృత్యు కుహరాల్లోకి నెట్టేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గడచిన నెలరోజుల్లో గోశాలలో 150 నుంచి 200 దూడల వరకూ మృత్యువాత పడ్డాయి. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత 20 దూడల వరకూ మరణించాయి. నెల రోజుల నుంచి దూడలు మరణిస్తున్నా, అదే ప్రాంగణంలో ఉన్న సింహాచల దేవస్థానం ఈఓ వాటి సంరక్షణ చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. కనీసం ఒక్క వెటర్నరీ డాక్టర్‌ను కూడా తీసుకొచ్చి దూడలకు వైద్య చికిత్స అందించలేకపోవడం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దూడలను ఉంచిన ప్రాంతమంతా బురదతో నిండిపోయింది. శవాల గుట్టగా మారిన గోశాలలోకి వెళ్లడానికి ఎవ్వరూ సాహసించలేని దుస్థితి. మంగళవారం గోశాల నుంచి కళేబరాలను వ్యాన్లలో తరలిస్తున్న దృశ్యం అందరినీ కలచివేసింది.
పంటలు సక్రమంగా పండినా, కోరిన కోర్కెలు నెరవేరినా, సంతానం కలిగినా సింహాచలేశునికి కోడె దూడలు, ఆవులు మొక్కుబడి తీర్చుకోవడం ఆనవాయితీ. సాధారణంగా చందనోత్సవాన్ని పురస్కరించుకుని చైత్ర, వైశాఖ మాసాల్లో దూడలు, ఆవులను సమర్పిస్తారు. గతంలో గోశాల పాలనే స్వామివారి ప్రసాదాల్లో వినియోగించేవారు. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని పూర్తిగా వదిలిపెట్టారు. మొక్కుబడి కింద సాధారణ దూడలనే సమర్పించాల్సి ఉన్నా, కొంతకాలంగా జర్సీ దూడలను సమర్పిస్తున్నారు. గత రెండు మూడేళ్లుగా మొక్కుబడిగా వచ్చే దూడల సంఖ్య పెరిగింది. జబ్బు పడిన, పోషించడానికి శక్తి లేనివారు తమ దగ్గరున్న దూడలను సింహాచల కొండపై వదిలి వెళ్లిపోతున్నారు. వీటిని దేవస్థానం అధికారులే వ్యాన్లలో గోశాలకు తరలిస్తున్నారు. ఇలా వచ్చిన దూడలను వేలం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తుంటారు. గత ఏడాది దేవస్థానానికి 18 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది కూడా. అప్పట్లో విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వేలాన్ని వ్యతిరేకించారు. వేలంలో కొనుగోలు చేసి దూడలను కబేళాలకు తరలిస్తున్నారని, వేలాన్ని నిలువరించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరికొన్ని ధార్మిక సంస్థలు కోర్టుకెళ్లటంతో వేలం నిలిపివేశారు. కోర్టు ఉత్తర్వులు వచ్చేలోగానే ఈ ఏడాదీ దేవస్థానం దూడలను వేలం వేశారు. తద్వారా 42 లక్షల ఆదాయం వచ్చింది. ఏప్రిల్ 15నాటికి వీటిని పాటదారునికి అప్పగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వేలాన్ని నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు రావడం, దేవాదాయ శాఖ కూడా దూడల తరలింపును నిలిపివేయాలని ఆదేశించడంతో వీటిని గోశాలలోనే ఉంచేశారు. ఇలా సుమారు 883 దూడలు గోశాలలో ఉన్నాయి. ఆవులు 60 నుంచి 80 వరకూ ఉంటాయి. వీటి సంరక్షణకు ఒక్క వెటర్నరీ డాక్టర్ మాత్రమే ఉన్నారు. ఆయన కూడా అనధికారికంగా వారానికోసారి వచ్చి వైద్య పరీక్షలు చేసి వెళ్లిపోతుంటారు. దూడల వేలం ద్వారా లక్షలాది రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకున్న సింహాచల దేవస్థానం, వాటి పరిరక్షణకు ఒక్క వైద్యుడిని కూడా నియమించకపోవడం గమనార్హం.
గత కొద్ది రోజులుగా ఎండలు ఎక్కువగా ఉండటం, దూడలను ఒకేచోట కట్టేయండంతో ఉక్కిరిబిక్కిరైపోయాయి. దీనికితోడు, జబ్బుతో కూడిన దూడలు కూడా వీటితో కలిసి ఉండటం వల్ల మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు. దీనిపై దేవస్థానం అధికారులు చెపుతున్న సమాధానం విడ్డూరంగా ఉంది. గతవారం రోజులుగా చందనోత్సవ హడావుడిలో ఉన్నందువల్ల వీటిని పట్టించుకోలేక పోయినట్టు చెపుతున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ శేషాద్రి, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్, ఆర్డీఓను హుటాహుటిన గోశాలకు పంపించారు. ఇద్దరు వైద్యులతో శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దూడలు మళ్లీ కోలుకునే వరకూ శిబిరం కొనసాగించాలని ఆదేశించారు. ఇదిలావుంటే, గోశాలలో గోవులు, దూడల సంరక్షణకు తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావు దేవస్థానం అధికారులను ఆదేశించారు.
అధికారుల నిర్లక్ష్యమే: స్వరూపానందేంద్ర
గోశాల ఘటనపై విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ హిందువులు అతి పవిత్రంగా పూజించే గోవులు, వాటి సంతతిని ఇలా చంపేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే గోవులు కబేళాలకు తరలిపోతున్నాయని, హిందుత్వాన్ని మంటకలిపే దుష్ట సంస్కృతి నివారణకు తాము ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో దైవ సన్నిధిలో సేవలందించే దేవస్థానం సిబ్బంది, ఇలా దూడలు మృత్యువాత పడుతున్నా పట్టించుకోపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. వీటికి వైద్య సాయం అందించలేని దుస్థితిలో దేవస్థానం ఉందా? అని ప్రశ్నించారు. గోశాలకు పూర్వవైభవం రావాలంటే, గోవులు, వాటి సంతతిని పరిరక్షించాల్సిన బాధ్యత దేవస్థానం అధికారులపై ఉందన్నారు
సింహాచలం గోశాలలో మృత్యుఘోష
Reviewed by JAGARANA
on
10:30 AM
Rating:
No comments: