‘సరిహద్దు’లేని చైనా చెలిమి..
హెబ్బార్ నాగేశ్వరరావు, ఆంధ్రభూమి దినపత్రిక, 02/04/2015
చైనాతో మనకు కొనసాగుతున్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనడానికై ఉభయ
దేశాల మధ్య జరిగిపోతున్న ‘ప్రత్యేక’ చర్చలకు మార్చి 23వ, 24వ తేదీలలో
మరోసారి వార్షికోత్సవం జరిగింది! సరిహద్దు వివాద పరిష్కారానికి చర్చలు
జరుపడంకోసం ఈ శతాబ్ది ఆరంభంలోనే ప్రత్యేక ప్రతినిధులు ఏర్పడిన తరువాత
పద్దెనిమిదవ విడత సమావేశం ఇప్పుడు జరిగింది! ఆరంభంలో ఏడాదికి రెండుసార్లు
జరిగిన ఈ చర్చలు ఇటీవలి కాలంలో ఏడాదికోసం జరుగుతున్నాయి. సరిహద్దు
వివాదాన్ని పరిష్కరించుకొనడానికి ‘‘ఏమంత’’ తొందరపడవలసిన పనిలేదన్నది చైనా
ప్రభుత్వం వారి విధానం. చైనాకుహితమైన విధానాన్ని అనుసరించడం మేలన్నది
క్రీస్తుశకం 1989లో మొదలైన మన విధానం! ఈ విధానాలు మార్చి నెలలో మన ప్రత్యేక
ప్రతినిధి, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు అజిత్‌కూ, చైనా ప్రత్యేక
ప్రతినిధి యాంగ్ జియేఛీకీ మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల సందర్భంగా మరోసారి
ధ్రువపడినాయి! సరిహద్దు వివాదం పరిష్కారానికి తొందరపడవలసిన పని లేదన్నది
యథావిధిగా చర్చల సారాంశం! ఈ చర్చలు ఒక ఏడాది మన రాజధానిలోను మరో ఏడు చైనా
రాజధాని బీజింగ్‌లోను మార్చి మార్చి జరుగుతున్నాయి. 2009 నుంచి కూడ ఈ
‘చర్చలు’ నిర్ధారిత సమయంలో జరగకుండా వాయిదా పడుతుండడం ‘‘నిదానమే
ప్రధానము’’అన్న నానుడికి మరో వాస్తవీకరణం! ఈ సంవత్సరం కూడ ఫిబ్రవరిలో
జరుగవలసి ఉండిన ఈ ప్రత్యేక ప్రతినిధుల సమావేశం మార్చి చివరికి కాని వాస్తవ
రూపం ధరించలేదు!! ఏదో ఒక కుంటి సాకుతో చర్చల ‘నిర్ణీత సమయాన్ని’ మార్చడం
చైనా విధానమైంది! 2011 డిసెంబర్ ఆరంభంలో జరుగవలసి ఉండిన ‘సరిహద్దు వివాద
పరిష్కార ప్రత్యేక చర్చలు’ అలా 2012 జనవరి మూడవ వారానికి వాయిదా పడ్డాయి.
2011 డిసెంబర్‌లో టిబెట్ ధార్మిక నేత దలైలామా, ఢిల్లీని సందర్శించాడు!
ప్రపంచ బౌద్ధమత వ్యవహారాల సదస్సులో పాల్గొన్నాడు! దలైలామా ఢిల్లీకి వచ్చాడు
కాబట్టి చర్చలను వాయిదా వేయాలన్నది చైనా ప్రభుత్వం అప్పుడు చెప్పిన
సాకు.....
దలైలామా 2011 డిసెంబర్‌లో భారత చైనా చర్చలు జరుగవలసి ఉండిన రోజున ఢిల్లీకి
రాలేదు! బౌద్ధ సదస్సునకూ ‘చర్చల’ సమయానికి మధ్య మూడు రోజుల అంతరం ఉంది!
కానీ ఒకే వారంలో ఈ రెండూ జరగడానికి వీలు లైదని చైనా నిర్ధారించింది!
దలైలామా 1959 వరకు టిబెట్ పరిపాలకుడు, దేశాధినేత! 1959లో చైనా టిబెట్
స్వతంత్ర దేశాన్ని దురాక్రమించింది. ఎదురు తిరిగిన త్రివిష్టపీయులను ఊచకోత
కోసింది. హత్యకు గురికాకుండా తప్పించుకొని, వేలాది అనుచరులతో దలైలామా మన
దేశానికి వచ్చారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘్ధర్మశాల’లో ప్రవాస ప్రభుత్వాన్ని
ఏర్పాటుచేసుకున్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు మన దేశంలోను, అనేక దేశాలలోను
ప్రవాస టిబెట్ ప్రజలు తమ దేశాన్ని చైనా దురాక్రమణ నుండి విముక్తం
చేయడానికై అహింసాయుత ఉద్యమం జరుపుతున్నారు. ఈ ఉద్యమానికి 2009లో యాబయి
ఏళ్లు నిండాయి. ఈ స్వర్ణోత్సవానికి పూర్వరంగంగా మన దేశంలోను అనేక ఇతర
దేశాలలోను టిబెట్ ప్రవాస ప్రజలు ప్రదర్శనలు సభలు జరిపారు. 2008 నాటి
‘బీజింగ్’ అంతర్జాతీయ క్రీడల పోటీ సందర్భంగా ఒలింపిక్ జ్యోతి అనేక దేశాల్లో
తిరగింది. ఈ ఊరేగింపుల సందర్భంగా ప్రవాస టిబెటన్లు అనేక దేశాలలో చైనా
దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. మన దేశంలోను ఆస్ట్రియా
రాజధాని ‘వియన్నా’లోను చైనా దౌత్య కార్యాలయాల ప్రాంగణాలలోని టిబెటన్లు
చొరబడినారు. అయితే ఇదంతా ప్రశాంతంగా జరిగిన ఉద్యమం. అంతేకాదు, 2009 నాటికి
దలైలామా మాత్రమే దేశ స్వాతంత్య్ర ఉద్యమానికి దూరమయ్యారు. టిబెట్‌కు
స్వాతంత్య్రం అక్కరలేదని చైనాలో భాగంగానే టిబెట్ ఉండాలని ‘టిబెటన్ల’
సాంస్కృతిక సంప్రదాయాలకు రక్షణ కల్పిస్తే చాలని అంతకుముందే దలైలామా
ప్రకటించి ఉన్నారు.
దలైలామా ఇలా మాట మార్చడం టిబెట్ ప్రజలకు ఆగ్రహం కల్గించింది. దలైలామా
త్రివిష్టప ప్రజల ధార్మిక గురువుకూడ! అందువల్ల ‘స్వాతంత్య్ర సన్యాసం’
స్వీకరించిన దలైలామాను స్వాతంత్య్ర ఉద్యమ నాయకులు బహిరంగంగా విమర్శించడం
లేదు. కానీ దలైలామాతో నిమిత్తం లేకుండా ఉద్యమకారులు తమ దేశ
స్వాతంత్య్రంకోసం అహింసాయుతమైన పోరాటాన్ని సాగిస్తున్నారు. చైనా ప్రభుత్వం
‘చర్చల’ను మాటిమాటికీ వాయిదా వేయడానికి, మన దేశంతో సరిహద్దు సమస్యను
పరిష్కరించుకోకుండా వివాదాన్ని ‘తడిపిపెట్టి’ ఉంచడానికి ఈ టిబెట్
స్వాతంత్య్ర పోరాటంతో సంబంధం లేదు. మన ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వం కూడ
టిబెట్ ప్రవాస ప్రభుత్వాన్ని గుర్తించలేదు, టిబెట్టీయ ఉద్యమకారులకు
నైతికంగాకాని ఆర్థికంగాకాని సహాయ సహకారాలు అందించడం లేదు. అయినప్పటికీ
‘దలైలామా’ ఢిల్లీని దలైలామా సందర్శించడం తమ దేశానికి గొప్ప ప్రమాదకరమైన
పరిణామమని చైనా నిరంతరం భయాన్ని అభినయిస్తోంది! దలైలామా ‘్భరత చైనా’చర్చల
స్థలానికి పదిహేను కిలోమీటర్ల ఆవల ఉన్నప్పటికీ, చర్చలు జరిగే రోజులలో కాక
కొన్ని రోజుల ముందు వెనుకగా ఆయన ఢిల్లీకి వచ్చినప్పటికీ తమ ‘ప్రతినిధి’
భద్రతకు భంగం వాటిల్లిపోతుందన్నది 2011లో చైనా చెప్పిన మాట! 2008వ 2009వ
సంవత్సరాలలో చైనా అనేకమంది ఉద్యమకారులను టిబెట్‌లో హత్య చేసింది. వందలాది
మంది నిర్బంధించింది. నిజానికి ఈ హత్యాకాండ, నిర్బంధాలు క్రీస్తుశకం
1959నుండి కొనసాగుతున్నాయి. అయినప్పటికీ త్రివిష్టప ప్రజలు
‘ప్రతిక్రియాత్మక’ హింసాకాండకు సైతం పూనుకోలేదు. అలాంటి టిబెటన్లవల్ల మన
దేశంలో తమ ‘ప్రతినిధుల’్భద్రతకు భంగం కలుగుతుందని చైనా ప్రచారంచేయడం
‘గోరంతను కొండంత’గా చిత్రీకరిస్తున్న వ్యూహంలో భాగం! చైనాకు అనుకూలంగా
ప్రవర్తిస్తున్న దలైలామాను చైనా ప్రభుత్వం తిట్టిపోయడం కూడ ఈ వ్యూహంలో
భాగం!! కుంటిసాకులతో సరిహద్దు చర్చలను నిర్ణీత సమయంనుండి వాయిదావేయడం,
చర్చలలో ఎలాంటి పురోగతి జరుగకుండా నిరోధించడం ఈ వ్యూహానికి లక్ష్యం...
సరిహద్దు వివాదం పరిష్కారం కావడం చైనాకు ఇష్టంలేదు. వివాదం పరిష్కారం
అయినట్టయితే 1962 నాటి ‘వెన్నుపోటు’ సమయంలోను అంతకుముందు ఆ తరువాత దశల
వారీగా ఆక్రమించుకున్న మన భూభాగాలను చైనా మనకు తిరిగి అప్పగించాలి! ఇలా
అప్పగించినట్టయితే టిబెట్‌ను సికియాంగ్‌ను కలుపుతూ మన ఆక్సాయిచిన్,
కారాకోరమ్ గుండా తాను నిర్మించిన రహదారులకు భంగం వాటిల్లుతుందన్నది చైనా
భయం. మన దేశంకుండా ప్రయాణించడానికి మన ప్రభుత్వం అనుమతినిస్తుంది! మానస
సరోవర కైలాస దర్శనానికి మనకు చైనా అనుమతిని ఇస్తోంది. అలాగే మన ప్రభుత్వం
కూడ ఆక్సాయిచిన్ కారాకోరమ్ మనకు లభించిన తరువాత ఈ ప్రాంతంగుండా
పయనించడానికి చైనాకు అనుమతినివ్వవచ్చు! ఆక్సాయిచిన్, కారాకోరమ్ హిమాలయ
శ్రేణిలోనివి, మన జమ్మూకశ్మీర్ లోనివి. కానీ ఇలాంటి సుహృద్భావ సంబంధాలను,
సౌహార్దతను చైనా కోరడం లేదు. ఇరుగుపొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించడం చైనా
స్వభావం! మనకు, చైనాకు మధ్య జమ్మూకశ్మీర్‌లో వివాదం అందువల్ల
‘కొలిక్కిరావడం’లేదు. పాకిస్తాన్ ప్రభుత్వం తాను దురాక్రమించిన కశ్మీర్‌లో
ఆరువేల చదరపు కిలోమీటర్లను చైనాకు అప్పగించింది. దీన్ని మన రాబట్టుకోవడం
గురించి మన ప్రభు త్వం దశాబ్దులుగా ఆలోచించడం లేదు! యాంగ్ జియేఛీతో
అజిత్‌దోహల్ చర్చ జరుపడానికి ముందుగానే మార్చి ఎనిమిదవ తేదీన చైనా
ప్రభుత్వం ‘సరిహద్దు వివాదం’ ఇప్పుడప్పుడే పరిష్కారంకాదని స్పష్టంచేయడం
చైనా విలంబన విధానానికి మరో నిదర్శనం.
భారత చైనా సరిహద్దు వివాదం చారిత్రక వారసత్వమని అందువల్ల అతిత్వరగా
పరిష్కారం కావడం అసాధ్యమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌రుూ మార్చి 8వ తేదీన
బీజింగ్‌లో చెప్పుకొచ్చాడు! యాంగ్ రుూ చెప్పిన ఈ చారిత్ర వారసత్వం గురించి
చైనా నాయకులు దశాబ్దులుగా చెబుతున్నారు. ఈ చరిత్ర 1950లో మాత్రమే
మొదలైంది! ఎందుకంటె భారత్ చైనాలమధ్య సరిహద్దు వివాదం చైనా టిబెట్‌ను
దురాక్రమించిన తరువాత మాత్రమే మొదలైంది. 1947లో బ్రిటిష్‌వారు మన దేశంనుండి
నిష్క్రమించేవరకు టిబెట్ స్వతంత్ర దేశం. ఈ స్వతంత్ర టిబెట్ భారత్
చైనాలమధ్య నెలకొని ఉండడం దాదాపు రెండువేల ఐదువందల ఏళ్ల చరిత్ర...
అంతకుపూర్వ ‘త్రివిష్టపమ్’ మన దేశంలో భాగం! అది వేరే కథ. కానీ ఈ రెండువేల
ఐదువందల ఏళ్లపాటు ‘టిబెట్’ నిరంతరం చైనాతో యుద్ధాలు చేసింది! చైనాలో టిబెట్
కలసిపోలేదు. అందువల్ల జమ్మూకశ్మీర్‌నుంచి అరుణాచల్ వరకూ గల మన ఉత్తర
సరిహద్దునకు ఆవల టిబెట్ ఉంది! భారత్‌కూ టిబెట్‌కూ మధ్య సరిహద్దు తగాదాలు
లేవు! అయినప్పటికీ 1914లో మెక్‌మాహన్ రేఖ ఏర్పడింది! ఇది భూటాన్ నుండి
అరుణాచల్ వరకూ బర్మా సరిహద్దువరకూ ఏర్పడిన భారత్ టిబెట్ సరిహద్దు! ఇది
తూర్పు విభాగం! మధ్య విభాగంలో మనకూ టిబెట్‌కూ మధ్య స్వతంత్ర నేపాల్ ఉంది!
పశ్చిమ విభాగమైన లడక్‌లో కూడ మనకూ టిబెట్‌కు మధ్య సరిహద్దు బ్రిటిష్‌వారి
‘జమానా’లోనే తుదిసారి నిర్ణయమైంది! బ్రిటిష్‌వారు చాలా ‘‘్ధరాళంగా’’
లడక్‌లోని తూర్పుప్రాంతాన్ని టిబెట్‌కు అప్పగించారు కూడ!! ఇదంతా జరిగిన
సమయంలో భారత చైనా సరిహద్దు లేదు! అందువల్ల వివాదం లేదు!! 1947వ 1950వ
సంవత్సరాల మధ్య మన ప్రధాని నెహ్రూ టిబెట్‌ను చైనాకు కట్టబెట్టడంలో చరిత్రలో
తొలిసారిగా ‘కశ్మీర్-అరుణాచల్’ల మధ్య 'భారత చైనా’ సరిహద్దు ఏర్పడింది.
ఏర్పడినప్పటినుంచి చైనా మన భూభాగం లోకి చొరబడుతూనే ఉంది!
చైనా పెద్దఎత్తున దురాక్రమణ జరిపిన తరువాత 1962నుండి మనకూ చైనాకు మధ్య
సరిహద్దు తగాదా ప్రధాన సమస్య! 1988లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చైనాకు
వెళ్లి వచ్చిన తరువాత అంతవరకూ మన ప్రభుత్వం పయనించిన ‘బాట’బద్దలైంది!
రాజీవ్‌గాంధీ ప్రభుత్వం హయాంలో అలా ‘పథభగ్న’ పాత్ బ్రేకింగ్! విధానం
మొదలైంది! సరిహద్దు తగాదా పరిష్కారంతో సంబంధం లేకుండా ఉభయదేశాల మధ్య ఇతర
రంగాలలో మైత్రి పెంపొంచాలన్నదే పథభగ్న విధానం! ఈ నూతన విధానంలోని ప్రధాన
అంశం వాణిజ్యం... చైనా వస్తువులు మన దేశాన్ని ముంచెత్తుతుండడం!! అందువల్లనే
1990 నుండి 2003 వరకూ దాదాపు ముప్పయిసార్లు చర్చలు జరిగినప్పటికీ సరిహద్దు
వివాదం కొలిక్కి రాలేదు, 2003లో నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి
చైనాకు వెళ్లి వచ్చిన తరువాత సరిహద్దు చర్చలకోసం ప్రత్యేక ప్రతినిధులు
ఏర్పడినారు. ఈ ‘ప్రతినిధులు’ 18వ విడత చర్చలను ఇప్పుడు జరిపారు...
‘సరిహద్దు’లేని చైనా చెలిమి..
Reviewed by rajakishor
on
8:50 AM
Rating:
చైనా ఒక కమ్యూనిస్ట్ దేశం, దానికి మతము లేదు, మతములను ప్రోత్సహించదు.అది హేతువాది ,, దాని లక్ష్యం అల్లా దురాక్రమణ,
ReplyDelete
ReplyDeleteచైనాతోగాని,పాకెస్తాన్ తోగాని మనకు సామరస్య పరిష్కారం కుదిరే అవకాశమేలేదు.ప్రత్యామ్నాయం యుద్ధమేకదా.అది వాంచనీయం కాదు.కాబట్టిఏవో 'చర్చలు 'కొనసాగిస్తూ ఉండడమే ప్రస్తుతం చెయ్యదగినది.