Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సాంఘికశాస్త్ర పాఠాలు మారాలి

- పి.రాజేశ్వరరావు, ఆంధ్రభూమి దినపత్రిక, 25/03/2015

పుస్తకం మారిన వెంటనే పునర్విమర్శ జరగాలి. సరిగ్గా జరగలేదు. టెలీకాన్ఫరెన్స్, శిక్షణ కార్యక్రమాలలో విమర్శలను స్వాగతించలేదు. ఫీడ్‌బ్యాక్ అడగలేదు. తమకు అనుకూల నివేదికలతో పొద్దుపుచ్చారు. 90% మందికి రోత కల్గించిన వీటికి చెల్లుచీటీ ఎప్పుడో మరి? రాష్ట్రం విభజన కావటంతో ఈ పాఠ్యపుస్తకాలపై ఎవరి దృష్టీ పడలేదు. వికేంద్రీకృత పద్ధతిలో పోరాడే దేశభక్తి కల్గిన సంస్థలకు, గప్‌చిప్‌గా కేంద్రకృత పద్ధతిలో పార్టీ సిద్ధాంతాన్ని పాఠాల ద్వారా పిల్లలు, ఉపాధ్యాయుల బుర్రకెక్కించే మార్క్సిస్టుల ఎత్తుగడలను చిత్తుచేయలేకపోతున్నారు. ఫలితంగా తెలుగు ప్రజలకు చరిత్ర అంటే యూరప్‌లో జరిగిన ప్రపంచ యుద్ధాలు, రష్యా, చైనా,క్యూబా, వియత్నాం యుద్ధాలే తప్ప మిగతా దేశాలు, దేశభక్తి సంస్కృతి వారికి పట్టవు. జపాన్, ఇజ్రాయెల్, నార్వే, జర్మనీ, భారత్ వంటి దేశాలలో జరిగిన స్ఫూర్తిదాయక ఘట్టాలేవీ తెలియనివ్వరు. తూర్పు ఆసియా దేశాలు ముఖ్యంగా కాంబోడియా, మలేసియా, మారిషస్, ఇండోనేషియా వంటి మిత్ర స్వభావ దేశాల గురించిన ప్రస్తావనే ఉండదు. శతృదేశాల భజనే ఎక్కువ.

రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రపంచ ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి మీద ఆంక్షలు విధించటం, సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక గల రహస్యం, తాష్కెంట్ ఒప్పందం కుదిరిన రాత్రే లాల్‌బహదూర్ శాస్ర్తీ మరణించటం వంటి అంశాలేవీ సమకాలీన చరిత్రలో కావాలని కన్పడనీయరు. ఇటీవల విజయవాడలో జరిగిన సదస్సులో సాంఘిక శాస్త్ర పాఠాలను పూర్తిగా మార్చాలని తీర్మానించారు. టిబెట్ స్వాతంత్య్ర పోరాటం, చైనా భారత్‌పై దాడిచేసి భూభాగాన్ని కాజేయటం, అవినీతి, పేదరికం, ఉగ్రవాదం, మత మార్పిడులు, గోవధ, కామన్ సివిల్‌కోడ్ అమలుకాకపోవడం, కాశ్మీర్లో ఆగని హింస వంటి విషయాలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చెప్పే ప్రయత్నం లేనే లేదు. సాంఘిక శాస్త్ర పాఠాలన్నీ శాస్ర్తియ దృక్పధం లేకుండా లెనిన్,స్టాలిన్, బ్రెజ్నేవ్, మావో, చౌఎన్‌లై వంటివారు కూర్చుని మన పుస్తకాలు వ్రాసినట్లు కన్పిస్తుంది. ఢిల్లీలో సుబ్రహ్మణ్యస్వామి రొమిల్లాథాపర్ రచనలను తగులబెట్టాలని పిలుపిచ్చాడు. నిజంగా ఆ పని వేగంగా జరపాలి. పాత తరం వారు బ్రిటిష్‌వారి కాలంలో తయారైనవి చదివినా కొంత దేశభక్తి ఉండేది. పురుషోత్తముడు, పృథ్వీరాజ్, రాణాప్రతాప్, గురుగోవింద్‌సింగ్, ఛత్రపతి శివాజీ వంటి వీరుల గురించి ఉత్తేజం పొందేవారు. రానురాను వారి చరిత్ర కాదుకదా కనీసం పేర్లు కూడా కానరాకుండా చేసారు. ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలో ఆఫ్రికా ఖండాన్ని పరిచయం చేస్తూ మానవ ఆవిర్భావం జరిగింది ఈ ఖండంలోనే అని సందేహం లేకుండా సెలవిచ్చారు. ఎంతో పరిశోధన,దార్శనికత కల్గిన వారే ఇతమిత్థంగా చెప్పలేని వాటిని చూసొచ్చినట్లు అచ్చుగుద్దారు. అయోధ్య, మధుర, కాశీ ఈ దేశ చారిత్రక, సాంస్కృతిక, ధార్మిక కేంద్రాలు మాత్రం వీరికి కట్టుకథలుగా కన్పిస్తాయి.

ఇప్పటికే అవిభక్త ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో విశ్వవిద్యాలయాలనుండి ప్రాథమిక పాఠశాలల వరకు ఈ వామపక్ష పీడ వలన పాడైపోయాయి. కార్పొరేట్ విద్యాసంస్థలను దూషిస్తారు. తమ పిల్లలను అక్కడే చదివిస్తారు. ప్రపంచీకరణను హేళన చేస్తారు, విదేశాలకు మొట్టమొదట వెళ్ళేందుకు సిద్ధంగా ఉంటారు. విద్య వైద్య రంగాలతోపాటు అన్ని సాంస్కృతిక రంగాలు ముఖ్యంగా మీడియా, సినిమా రంగాల్లో గోముఖ వ్యాఘ్రాలుగా వ్యవహరిస్తున్నారు. ఒక్క శాతం ఓట్లు కూడా లేవు. ఉద్యోగ కార్మిక వర్గాల్లో 22 శాతం పెత్తనం. పెద్దపెద్ద రాజభవనాలు, ప్రింటింగ్ ప్రెస్‌లు ఉన్నా వారి సిబ్బందికి సంఘం ఉండదు, వాళ్ళకు హక్కులు, జీతాలు ఉండనే ఉండవు. విద్యారంగంలో మాత్రం ఎన్నో నీతులు వల్లెవేస్తూ ముందుకెళ్ళనీయరు. వీళ్ళ దయవలన వేలాది ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. నాణ్యమైన విద్య, సంస్కా రం ఉన్న పాఠశాలలే రాణిస్తాయి. వీళ్ళకు ఈ రెండూ ఇష్టం ఉండదు. ఎప్పుడూ సూడో ఉద్యమాలే!

ఆఖరికి ఇటీవలి కాలంలో అంటే 1940లో డా.బి. ఆర్.అంబేద్కర్ రచించిన పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన ‘పరిచయం’ 1940 పుస్తకం నుండి కూడా అసందర్భంగా కత్తిరించిన రీతిలో ఆయన మాటలను ఉటంకించటం దారుణం. అదే పుస్తకంలో డా.అంబేద్కర్ ఎన్నో సూచనలు ఇచ్చారు. పాక్ ఏర్పడితే అక్కడున్న అల్పసంఖ్యాకులైన హిందువులు అందునా పేద హిందువుల గతి ఏమిటి? అని ఆక్రోశించారు. దానికి విరుగుడుగా భారత్‌లోని ముస్లింలను పాకిస్తాన్‌కు,పాకిస్తాన్‌లోని హిందువులను భారతదేశానికి సగౌరవంగా తరలించాలని సూచించిన భాగాన్ని కావాలనే ప్రచురించలేదు. (పదవ తరగతి, 16వ పాఠం, పేజీ నెంబరు 222)

ఈ పుస్తకాలను నమ్ముకొని పోటీ పరీక్షలకు వీటి మీద ఆధారపడితే సున్నమే. అందుకే ఎక్కువ మంది సైన్స్, గణితం వంటి వాటి వైపు వెళ్తున్నారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు అబద్ధాలు బోధించేవారిగా చులకనౌతున్నారు. సిద్ధాంతకర్తలు, వారి సంతానం కార్పొరేట్ కాలేజీలు, సంస్థల్లో చేరి బాగుపడుతున్నారు. ఎందుకంటే సత్యం ఏదో అసత్యవాదికే బాగా తెలుస్తుంది. పిచ్చి పాఠాలతో లక్షల మంది విద్యార్థులు నష్టపోకుండా కొత్త సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను తయారుచేయాలి. వచ్చే విద్యాసంవత్సరం నుండి సత్యమంతమైన చరిత్రను విద్యార్థులకు అందించాలి. పరిశుభ్ర భారత్‌తోపాటు స్వాభిమాన భారత్‌కు పునాదులు వేయాలి.

సాంఘికశాస్త్ర పాఠాలు మారాలి Reviewed by rajakishor on 1:46 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.