Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఆర్.ఎస్.ఎస్ (RSS) అంటరానిదా? - కే.కైలాష్


రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ దసరా ఉత్సవాల సంధర్భంగా నాగపూర్ కేంద్ర కార్యాలయంలో చేసిన ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేయటం పట్ల అభ్యంతతరం వ్యక్తం చేయటం అర్థరహితం. ఆర్.ఎస్. ఎస్ అంటరాని సంస్థ కాదు కదా?
దేశ సాంస్కృతిక, సామాజిక రంగంతోపాటు కొన్ని సందర్భాల్లో రాజకీయ రంగంలో కూడా అత్యంత కీలక పాత్ర నిర్వహిస్తున్న ఒక దేశ వ్యాపిత సంస్థ అధినేత అభిప్రాయాలను దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయటం పట్ల ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదు
ఎంతో కాలం పాటు ఆర్.ఎస్.ఎస్ ప్రచారక్‌గా పని చేసిన నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తరువాత కూడా ఆర్.ఎస్.ఎస్ అధినేత దసరా ప్రసంగాన్ని దూరదర్శన్ ప్రసారం చేయకపోతే ఇంకెప్పుడు చేస్తుంది? మోహన్ భగవత్ దసరా వార్షిక ప్రసంగాన్ని దూరదర్శన్ సహా దేశంలోని అన్ని ప్రైవేట్ టెలివిజన్ సంస్థలు కూడా ప్రసారం చేశాయి. అవి ప్రసారం చేయటం పట్ల లేని అభ్యంతరం దూరదర్శన్ ప్రసారంపైననే ఎందుకు ఉండాలి? ప్రైవేట్ చానళ్లు ప్రసారం చేస్తుంటే దూరదర్శన్‌అంటీముట్టనట్టు ఉండి వెనకబడి పోవాలా? ఇదిలా ఉంటే మోహన్ భగవత్ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయటం పట్ల అభ్యంతరం చెబుతున్న వారు ఆయన ప్రసంగంలోని అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఆర్.ఎస్.ఎస్ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసే సంస్థ. అదేమీ విద్రోహ సంస్థ కాదు, తీవ్రవాద సంస్థ కాదు. దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సంస్థ. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఆర్.ఎస్.ఎస్ తనదైన పద్ధతిలో దేశ సేవ చేస్తోంది. రాజకీయ పార్టీలు, పారిశ్రామిక సంస్థల మాదిరిగా అధికారం, ఆర్థిక లాభమే పరమావధిగా పని చేయటం లేదు. దేశానికి సేవ చేస్తోంది తప్ప దేశాన్ని దోచుకుని విదేశీ బ్యాంకుల్లో అక్రమ ఆర్జనను దాచుకోవటం లేదు. దేశ ప్రయోజానం గురించి దూరదృష్టిలో ఆలోచించి పని చేసే సంస్థ అధినేత ప్రసంగాన్ని ప్రసారం చేయకూడదని ఎలా అంటారు?
మోహన్ భగవత్ ప్రసంగం దేశ మేలు కోరుతోందా? లేక దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నదా? మోహన్ భగవత్ ప్రసంగంలోని అంశాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే వేలెత్తి చూపాలి. ఆయన ప్రసంగంలోని ప్రతి అంశం దేశ ప్రయోజనాలు కాంక్షించేదే.
మోహన్ భగవత్ తన ప్రసంగంలో కొన్ని అత్యంత ముఖ్యమైన జాతీయాంశాల గురించి ప్రస్తావించారు. లవ్ జిహాద్‌పై హింసకు పాల్పడకూడదనే సందేశం ఇవ్వటం ద్వారా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ అంశంపై నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని తొలగించేందుకు మోహన్ భగవత్ ప్రయత్నించటం మంచి పరిణామం కాదా? ఎన్.డి.ఏ ప్రభుత్వం సమర్థంగా పని చేయకపోతే తామే ప్రశ్నిస్తామని మోహన్ భగవత్ పరోక్షంగా స్పష్టం చేయటం కనిపించటం లేదా?
బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వస్తున్న శరణార్థుల మూలంగా జనాభా సమతూకం చెడిపోతోందంటూ మోహన్ భగవత్ చేసిన హెచ్చరిక నూటికి నూరుశాతం నిజం. యు.పి.ఏ హాయంలోనే కేంద్ర హోం శాఖ ఈ వాస్తవాన్ని అంగీకరించి సరిదిద్దే ప్రయత్నాలు చేసి ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.అస్సాం, బెంగాల్ రాష్ట్రాల్లో బాంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన వారి సంఖ్య పెరిగిపోయి స్థానికుల ఉనికికే ప్రమాదం నెలకొన్నది. దేశ రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బాంగ్లాదేశీయుల ప్రబాల్యం పెరిగిపోయింది. కొన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం వీరిని సమర్థించటం ఎంతవరకు మంచిది?
మోహన్ భగవత్ తమ ప్రసంగంలో ప్రస్తావించిన మరో ముఖ్యమైన విషయం దక్షిణాది రాష్ట్రాల్లో చాపకింద నీరుగా పాకిపోతున్న జిహాదీ వర్గాలు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థను కర్నాటకకు చెందిన భక్తల్ సోదరులు నడిపిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థ కర్నాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో విస్తరించి ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఇస్లామిక్ జిహాదీల కార్యకలాపాలను సమర్థంగా అరికట్టటం లేదంటూ మోహన్ భగవత్ చేసిన ఆరోపణ నిజం కాదా? కేరళ, కర్నాటక రాష్ట్రాల్లోని కొన్ని ప్రాం తాల్లో ఇండియన్ ముజాహిదీన్ సంస్థ గ్రామ స్థాయికి వ్యాపించిపోయినా దీనిని అరికట్టేందుకు తగు చర్యలు తీసుకోవటం లేదు. మోహన్ భగవత్ నక్సలిజాన్ని అరికట్టవలసిన అవసరాన్ని సూచిస్తూనే యువత నక్సలిజం వైపు ఆకర్షితులయ్యేందుకు దారి తీస్తున్న పరిస్థితుల గురించి కూడా తమ ప్రసంగంలో ప్రస్తావించారు. యువతను నక్సలిజం వైపు తీసుకుపోతున్న సామాజిక దోపిడిని అరికట్టాలని ఆయన పిలుపు ఇవ్వటం సమర్థనీయం కాదా? హిందుత్వ కోసం పోరాడే ఆర్.ఎస్.ఎస్ హిందు మతంలోని అంటరాని తనం, కొన్ని వర్గాల ఆధిపత్యం మూలంగా సమాజంలో నెలకొంటున్న అసమానతల గురించి భగవత్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నిస్తే బాగుండేది. దేశానికి స్వాతంత్రం వచ్చి అరవై సంవత్సరాలు దాటినా కొన్ని కులాలు, వర్గాల పట్ల ఎందుకింకా వివక్షత కొనసాగుతోంది? ఈ వివక్షతను నిర్మూలించేందుకు ఆర్.ఎస్.ఎస్ ఇంత వరకు ఏం చేసింది, ఇక మీదట ఏం చేయన్నుది? ఈ విషయంలో ఆర్.ఎస్.ఎస్ సాధించిన ఫలితాలు ఏమిటి? అని ప్రతిపక్షం ప్రశ్నిస్తేబాగుండేది. ప్రతి రాజకీయ పార్టీ తమ సిద్ధాంతాలను ఊదరగొట్టేందుకు స్వంత చానళ్లతోపాటు దూరదర్శన్‌ను, ప్రైవేట్ చానళ్లను ఉపయోగించుకోవటం లేదా? ఆర్.ఎస్.ఎస్ అధినేత దసరా వార్షిక ప్రసంగాన్ని ప్రసారం చేసినంత మాత్రాన కొంపలంటుకుపోయాయా? ఈ కుహనా లౌకికవాదులు ఎంత వ్యతిరేకిస్తే ఆర్.ఎస్.ఎస్‌కు అంత లాభం కలుగుతుంది. మోహన్ భగవత్ ప్రసంగ ప్రసారాన్ని వ్యతిరేకించటం ద్వారా వారు ఆర్.ఎస్.ఎస్‌కు వెలకట్టలేనంత ప్రచారం చేసి పెట్టారు.
ఆర్.ఎస్.ఎస్ (RSS) అంటరానిదా? - కే.కైలాష్ Reviewed by JAGARANA on 7:53 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.