ధర్మ యుద్ధం - 2014 : ఇది రెండవ క్విట్ ఇండియా ఉద్యమం
- ముదిగొండ శివప్రసాద్
‘మాకొద్దీ తెల్లదొరతనమూ-’’ ఇది గరిమెళ్ళ సత్యనారాయణ రచించిన పాట. 1942 ప్రాం తంలో అందరి నాలుకల మీద తాండవమాడింది! ‘‘భరత ఖండంబు చక్కని పాడియావు’’ఈ పద్యం చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులు గారిది. తెల్లవారు అనే గడసరి గొల్లవారు దూడల మూతులు బిగియగట్టి పాలు పిండుకుంటున్నారని కవులువాపోయారు. అప్పుడు దేశవ్యాప్తంగా క్విట్ ఇండియా ఉద్యమం వచ్చింది.
క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ అహింసావిధానం ప్రధాన స్రోతస్విని అయినప్పటికీ గద్దర్ పార్టీ, అల్లూరి సీతారామరాజు, భగత్‌సింగ్, సుఖదేవ్, చంద్రశేఖర్ అజాద్ వంటివారి విప్లవ ధోరణి కూడా చోటుచేసుకుంది. అటు గాంధీ - ఇటు నేతాజీ - రెండు ధోరణులు సంకేతంగా నిలిచాయి. ఈ వివరాలు ఉన్నవ లక్ష్మీనారాయణ రచించిన మాలపల్లి నవలలో రామదాసు - తక్కెళ్ల జగ్గడు పాత్రల ద్వారా ఆవిష్కరింపబడింది. క్విట్ ఇండియా ఉద్య మం జరుగుతున్నప్పుడు భారతదేశమం తా గాంధీ - నేతాజీల వెనుక నడువలేదు. ఎందరో స్వదేశీ సంస్థానాధీశులు దేశానికి స్వాతంత్య్రం అక్కరలేదు అంటూ పోరాడారు. స్వాతంత్య్ర సమరయోధులను పట్టించి పోలీసులకు అప్పగించారు. విచిత్రమేమంటే ఆ పోలీసులు కూడా భారతీయులే పొట్టకూటికోసం తెల్లవాడివద్ద ఉ ద్యోగాలు చేసినవారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత స్వదేశీ సంస్థానాధీశులలో ఎక్కువమంది కాంగ్రెసులో చేరిపోయారు. కొందరు చక్రవర్తుల రాజగోపాలాచారిగారి స్వతంత్ర పార్టీలో చేరారు. ఇదంతా గత నూరేండ్ల భారత రాజకీయ చరిత్ర.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీగారు ‘మనది ఉద్యమపార్టీ. అందుకని కాంగ్రెసు అనే సంస్థను రద్దుచేద్దాం’ అన్నారు. అందుకు నాయకులు అంగీకరించలేదు. చేసిన త్యాగాలకు ఫలితాలు అనుభవించాలనే కోరిక వారికి కలిగింది. ఈ విధంగా పండిత జవహర్‌లాల్‌నెహ్రూ నాయకత్వంలో తొలి కాంగ్రెసు మంత్రివర్గం కేంద్రంలో ఏర్పడింది. నెహ్రూగారిని ఫాబియన్ సోషలిస్టు అనేవారు. ఆవడి (తమిళనాడు)లో జరిగిన కాంగ్రెసు ప్లీనరీలో తనది సోషలిష్టిక్ పాటరన్ ఆఫ్ సొసైటీ అని ప్రకటించారు. దీనిని అలుగూరాయ్‌శాస్ర్తీ వంటి కొందరు కాంగ్రెసు నాయకులు అడ్డుకున్నారు. ఐనా నెహ్రూగారి ఛరిష్మా ముందు ఎవరూ నిలువలేకపోయారు. ఒకప్పుడు కమ్యూనిస్టులు ద్విముఖ వ్యూహం అనుసరించారు. ఒకవర్గం స్వతంత్రంగా పార్టీ నిర్మాణం చేసుకుని త్రిపుర, బెంగాల్, ఆంధ్ర, కేరళ వంటి ప్రాంతాలలో అధికారం చేజిక్కించుకోవడానికి ప్రయత్నించడం రెండవ వర్గం కాంగ్రెసులో చేరి నెహ్రూగారికి అనుకూలంగా ఉంటూ తన సోషలిష్ట్భువాలను అమలుచేయించారు. ఇదంతా 1952 తర్వాత రష్యా ఆదేశాలతో జరిగింది. ఈ పరిణామ క్రమంలోనే వి.కె.కృష్ణమీనన్, కుమార్ మంగళం, అరుణా అసఫ్‌అలీ వంటి ఎందరో అగ్రనాయకులు కాంగ్రెసులో ఉంటూ కమ్యూనిస్టు ఎజెండాను అమలుచేశారు.
1964 తర్వాత నెహ్రూ మరణించిన తర్వాత కాంగ్రెసులో ఒక శూన్యం వ్యాపించింది. నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ అప్పటికి ఇంకా అపరిణత దశలో ఉంది. అందుకని ఆమెను అడ్డంపెట్టుకొని సిండికేట్ అనే వర్గం రాజకీయ యంత్రం నడిపింది. అందులో గుజరాత్ నుండి మొరార్జీదేశాయ్, కర్ణాటక నుండి నిజలింగప్ప, బెంగాల్ నుండి అతుల్యఘోష్, తమిళనాడు నుండి కామరాజ నాడార్ ఇత్యాదులు ఉన్నారు. ఒక దశలో సిండికేట్‌పై ఇందిరాగాంధీ తిరగబడి తన సర్వం సహాధికారాన్ని ప్రకటించుకున్నది. భారతదేశంలో అనాదిగా రాజరికం ఉండేది. అంటే ప్రజలు అనువంశిక పాలనకు మానసికంగా అలవాటుపడ్డారు. అందుకని మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ ఆ తర్వాత ఆమె కొడుకు సంజయ్‌గాంధీ ఇలా ఒక పరంపర వచ్చింది. 1975 ప్రాంతంలో శ్రీమతి ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి సంజయ్‌గాంధీని ప్రధాని చేయాలని ప్రయత్నించింది. అయితే సంజయ్‌గాంధీ విమాన ప్రమాదంలో అకాల మరణం పాలుకావటంతో తిరిగి ఇందిరాగాంధీయే రాజ్యాధికారం స్వీకరించింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్యకు గురిఅయిన దశలో రాజీవ్‌గాంధీ ఇష్టం లేకపోయినా భారతదేశ రాజకీయ అధికారాన్ని స్వీకరించారు. రాజీవ్‌గాంధీ విదేశాలలో ఉన్నప్పుడు ఆయనకు ఇటలీ దేశానికి చెందిన సోనియాతో పరిచయం అయింది. ఆమెను వివాహం చేసుకొని ఇండియాకు కోడలుగా తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత 1992 ప్రాంతంలో రాజీవ్‌గాంధీ కూడా హత్యకు గురికావడంతో రాజ్యాధికారం సోనియా ఇటాలియాకు సంక్రమించింది.
ఇందిరాగాంధీ - రాజీవ్‌గాంధీలు ఈ గడ్డమీద పుట్టినవారు. వారికి ఇక్కడి ప్రజల మనోభావాలు ఈ సంస్కృతిలో బాగా పరిచయం ఉంది. సోనియాగాంధీకి అవేవీ తెలియవు. తెలుసుకునే ప్రయత్నంకూడా చేయలేదు. పవర్ లేకుండా పవార్ బ్రతుకలేడు అనేది ఓ మహారాష్ట్ర నానుడి. పవర్ కరప్ట్స్ అండ్ అప్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్‌లీ’ అని లాక్ట్ ఆర్ట్స్ అనే ప్రముఖుడు ఒక సూక్తి చెప్పాడు. అంటే అధికారం నిరంకుశత్వానికి దారి తీస్తుందని అర్థం. సోనియాగాంధీ క్రమంగా అలాగే ప్రవర్తింపసాగింది. 1947కు ముందు జస్టిస్ పార్టీ వారు మరికొందరు ద్రవిడ నాయకులు బ్రిటీషువారి రాజ్యం భారతదేశంలో సుస్థిరంగా ఉండాలని పోరాడారు. సరిగ్గా అదే చరిత్ర 1990 తర్వాత పునరావృత్తమయింది. ‘‘ఇందిరా ఇండియా’’అని 1975లో బారువా అనే కాంగ్రెసు నాయకుడు ప్రకటిస్తే 2000లో ‘ఇంటికి దీపం ఇల్లాలు ఇండియా దీపం సోనియమ్మ’అని తెలుగువారు పశ్చిమగోదావరి జిల్లాలో స్తుతిగీతం పాడటం విన్నాను.
సోనియాగాంధీ రాజ్యాధికారం స్వీకరించిన తర్వాత కొన్ని మహత్తర పరిణామాలు చాపకింద నీరులాగా చోటుచేసుకున్నాయి. మొదటిది భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా మతం మార్పిడులు జరిగాయి. ఇటు పాకిస్తాన్, అటు చైనా భారత భూభాగాలను ఆక్రమించాయి. అరుణాచల్‌ప్రదేశ్ చైనా ఆక్రమించి ఇది లోయర్ టిబెట్ - మాకే దక్కాలి అని ప్రకటించింది. కనీసం దీనికి నిరసన తెలిపే ధైర్యంకూడా సోనియాగాంధీకి లేకుండాపోయింది. మన్మోహన్‌సింగ్ అనే ఒక ఆర్థిక శాస్తవ్రేత్తకు నోరువాయి లేనివాణ్ణి ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి తానే చక్రం తిప్పింది సోనియాగాంధీ కాలంలో ప్రకాష్‌కారత్ ఆమె మంత్రివర్గానికి మద్దతు ప్రకటించారు. కామ్రేడ్ నారాయణ 2014 మార్చి 31వ తేదీనాడు కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే మంచి రాజకీయ ఫలితాలు సాధించవచ్చునని ప్రకటించారు.
ఈ దశలో దేశంలో రెండు ప్రధాన నిరసనలు వినపడ్డాయి. మొదటిది జాతీయ శక్తులు నరేంద్ర భాయ్ మోడీ నాయకత్వంలో విజృంభించారు. రెండవది అవినీతి వ్యతిరేకోద్యమం ద్వారా అన్నాహజారే జనం దృష్టిని ఆకర్షించారు. ఆమ్‌ఆద్మీ పార్టీ అన్నాహజారే ఉద్యమంనుండి పుట్టినదే.
2014లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది ఒక రకంగా రెండవ క్విట్ ఇండియా ఉద్యమం అంటే మొదటి క్విట్ ఇండియా ఉద్యమంలోవలెనే ఇప్పుడు కూడా జాతిజనులు ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’ అని పాడుకుంటున్నారు. అప్పుడు బ్రిటీషు రాణి విక్టోరియా ఎలిజబెత్‌లు దోచుకుంటే ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం ఇటలీ వాదం భారతదేశాన్ని దోచుకుంటున్నది. ఇటలీ వాదానికి రెండు ముఖాలున్నాయి. మొదటిది అంతర్జాతీయం ఎవాంజలిజం. రెండవది ఆర్థిక దోపిడి. ఈ రెండింటినీ సోనియా అమలుపరిచింది. సరిగ్గా 1947కు ముందు ఆనాటి పంచమ జార్జిచక్రవర్తిని కొందరు స్వదేశీ సంస్థానాధీశులు బలపరచినట్లే ఇప్పుడూ కేరళ ఎవాంజలిష్టు ఎకె ఆంటోనీ, మధ్యప్రదేశ్ ప్యూడల్ శక్తి దిగ్విజయ్‌సింగ్, కాశ్మీరు వేర్పాటు నాయకులు ఒమర్ అబ్దుల్లా, గులాం నబీ ఆజాద్- ద్రవిడ పులి కరుణానిధి మళ్లీ అదే పాత పాత్రను పోషిస్తున్నారు. గత ఎన్నికలలో రాయబరేలీ నుండి కనీసం ములాయంసింగ్ యాదవ్ అభ్యర్థిని కూడా నిలబెట్టకుండా సోనియాగాంధీ విజయానికి తోడ్పడటం (2009) గమనార్హం. 2014 ఏప్రిల్‌లో తెలంగాణలో ఒక్క లోక్‌సభ స్థానం కోసం సిపిఐ తన పార్టీని అవినీతి కాంగ్రెసుకు తాకట్టుపెట్టటం గమనించండి.
ఇప్పుడు రెండవ క్విట్ ఇండియా ఉద్యమం నడుస్తున్నది. మొదటి ఉద్యమంలో దండి సత్యగ్రహం, లాఠీచార్జీ, విదేశీ వస్తద్రహనం, సూత్రయజ్ఞం వంటి టెక్నిక్‌లు గాంధీజీ ఉపయోగించారు. కాని ఇవాళ అలాంటి అవసరం లేదు. నేరుగా పోలింగ్ బూత్‌కుపోవటం చేతి గుర్తుకు కాకుండా మరో గుర్తుకు బటన్ నొక్కటం అంతేచాలు. ఇదే రెండవ క్విట్ ఇండియా ఉద్యమంలోని సౌలభ్యం- ఇంత జరిగినా ఇంకా చిరంజీవి, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, పొన్నాల లక్ష్మయ్యలు కాంగ్రెసు పార్టీ జెండాలు మోస్తూనే ఉండటం ఈ జాతిలోని బానిస మనస్తత్వానికి ప్రతీక. ఐదుసార్లు ఎం.పీ. పదవి అనుభవించిన కావూరి సాంబశివరావు 2014 ఏప్రిల్ నెల 3వ తేదీనాడు అంటే ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత తన మంత్రి పదవికి రాజీనామా చేయటం త్యాగం అనిపిం చుకోదు.
భారతంలోని వౌసల పర్వంలో యాదవులు పరస్పరం కలహించుకున్నట్లు కాంగ్రెసులోని భిన్నవర్గాలు సంఘర్షించుకుంటున్నాయి. ఇది ఒక పార్టీ అవసాన లక్షణం! ‘‘కావూరి సాంబశివరావు 350కోట్ల పన్ను ఎగవేశాడు. వ్యాపార లాభాలకోసం కాంగ్రెసు వీడి బిజెపివైపు చూస్తున్నారు.’’.. కాంగ్రెసు నాయకుడు జైరాంరమేష్ వ్యాఖ్య (4-4-2014) ఔరా! ఐదు ఐదులు పాతికేళ్లు కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తిపార్టీవీడిన మరునాడు దొంగ అయిపోయాడా? ఆమాట జయరాంరమేష్ కావూరి మంత్రిగా ఉన్నప్పుడు అంటే గౌరవంగా ఉండేది. అంటే కాంగ్రెసుపార్టీ పతనావస్థలో ఉంది. చెరువు ఎండాక కప్పలు చేపలు బయటపడుతున్నాయి.మూడోఫ్రంటు నాలుగో ఫ్రంటు అంటూ మళ్లీ పగటివేషాలు మొదలుపెడితే ప్రజలు సహించే దశలో లేదు. సోకాల్డ్ సెక్యులరిస్టులు ములాయంసింగ్, నితీశ్‌కుమార్, ప్రకాశ్‌కారత్, బర్ధన్‌లు ఇకనైనా ఈ విపత్కర పరిస్థితిలో కళ్లుతెరిచి భారతదేశాన్ని కాపాడాలి మరి!!
మూలం : ఆంధ్రభూమి దిన పత్రిక
మూలం : ఆంధ్రభూమి దిన పత్రిక
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
ధర్మ యుద్ధం - 2014 : ఇది రెండవ క్విట్ ఇండియా ఉద్యమం
Reviewed by JAGARANA
on
1:00 PM
Rating:
No comments: