Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

భిన్నత్వంలో ఏకత్వమే బలం - వడోదర ‘ఐక్యతా పరుగు’ లో మోడీ

వడోదర, డిసెంబర్ 15: భిన్నత్వంలో ఏకత్వమే బలం, ఇది భారతీయతకు ఒక గుర్తింపే కాకుండా మన సంప్రదాయం అని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. సర్దార్ పటేల్ వర్ధంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ‘ఐక్యతా పరుగు’ యూనిటీ రన్‌ను గుజరాత్‌లోని వడోదరలో మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ‘ప్రజలను, గ్రామాలను, దేశాన్ని సంఘటితం చేయాలన్న కృతనిశ్చయంతో ఈ పరుగును నిర్వహిస్తున్నాం’ అని ఆయన అన్నారు. అంతేకాదు భారతీయులందరి కలలను, ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ఈ రన్‌ను నిర్వహిస్తున్నామని, దీన్ని ఎన్నికల భూతద్దంలోంచి చూడవద్దని ఆయన అన్నారు. అక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో అహ్మదాబాద్‌లో బిజెపి సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ రన్‌ను ప్రారంభిస్తూ సర్దార్ పటేల్ 63వ వర్ధంతి నాడు చేపట్టిన ఈ రన్ ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. రన్‌లో పెద్ద సంఖ్యలో జనం పాల్గొన్నందుకు వారిని అభినందించారు.

కాగా, బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీలు దేశ రాజధానిలోని పార్టీ కార్యాలయం నుంచి మారథాన్‌ను ప్రారంభించారు. 2 నుంచి 5 కిలోమీటర్ల మేర నిర్వహించిన ఈ ర్యాలీలో నగర పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. బిజెపి అధికార ప్రతినిధి, పార్టీ ఎంపి ప్రకాశ్ జావ్‌డేకర్ హైదరాబాద్‌లో జరిగిన మారథాన్ రన్‌లో పాల్గొనగా, పార్టీ ఎంపి, ఒకనాటి బాలీవుడ్ నటి స్మృతి ఇరానీ పశ్చిమ బెంగాల్‌లో జరిగిన రేస్‌లో పాల్గొన్నారు. ‘ఈ రోజు దేశవ్యాప్తంగా ఐక్యతా పరుగులో 50 లక్షల మంది పాల్గొని ఉంటారని తాను భావిస్తున్నానని, ఈ పరుగులో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఎందుకంటే వారంతా కూడా భారత దేశాన్ని ఒక్కటిగా చేయడంలో తమ వంతు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ అన్నారు.
ఈ పరుగులో పాల్గొన్నవాళ్లంతా కూడా పటేల్ చిత్రాన్ని ముద్రించిన టి-షర్టులు ధరించారు. స్వాతంత్య్రం సిద్ధించిన సమయంలో తొలి హోమ్ మంత్రిగా పటేల్ 565 సంస్థానాలను దేశంలో విలీనం చేసినందున బిజెపి యూనిటీ రన్‌కోసం 565 చోట్లను ఎంపిక చేసింది. సుపరిపాలన, జాతీయ సమైక్యత లక్ష్యంగా ఈ రన్‌ను నిర్వహించారు. కాగా, పటేల్ వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి బిజెపి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ, దేశంలో మతతత్వాన్ని రెచ్చగొడుతున్న పార్టీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండడం వింతగా ఉందని దుయ్యబట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలను బిజెపి, మోడీ తిప్పికొడుతూ, పటేల్‌కు దక్కాల్సిన గౌరవం దక్కలేదనేదే తమ పార్టీ అభిప్రాయమని వాదిస్తుండడం విషయం తెలిసిందే. ‘ఒక గొప్ప వ్యక్తికి దక్కాల్సిన గౌరవాన్ని దేశం ఈ రోజు ప్రదర్శిస్తోంది’ అని అద్వానీ అన్నారు. శాంతి, సమైక్యత, సద్భావన స్ఫూర్తి కారణంగా గుజరాత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని మోడీ అన్నారు.

భిన్నత్వంలో ఏకత్వమే బలం - వడోదర ‘ఐక్యతా పరుగు’ లో మోడీ Reviewed by JAGARANA on 8:40 AM Rating: 5

1 comment:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.