కమలనాధుడు మోడియే ! బాజపా ప్రధాని అభ్యర్థి గా మోడీ - రాజనాథ్ ప్రకటన
మోడీకి మిఠాయి తినిపిస్తున్న రాజ్‌నాథ్ సింగ్ |
‘దేశం సంక్షోభంలో ఉంది. గట్టెక్కాలంటే ప్రతి ఒక్కరూకృషి చేయాలి. బిజెపిపై ప్రజా నమ్మకం వమ్ముకానివ్వను శక్తిమేర కృషి చేస్తా. అందుకు మీ ఆశీస్సులు కావాలి’ - నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీయే పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఎన్నికలకు మరో ఏడు నెలల వ్యవధి ఉండగానే అనుకున్నట్టే మోడీయే తమ కూటమికి సారథ్యం వహిస్తారని ప్రకటించి పాలకపక్షాన్ని ఇరుకున పడేసింది. మోడీతో ఢీ అనటానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నందున ఎన్నికల ప్రచార ఘట్టం రసవత్తరంగా ఉంటుంది. మోడీయే ప్రధాన మంత్రి అభ్యర్ధిగా ఉంటారన్న ఊహాగానాలను ధృవకరిస్తూ శుక్రవారం సాయంత్రం జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం మోడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. మోడీని చివరి వరకూ ప్రతిఘటించిన పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వానీ సమావేశానికి గైర్హాజరయ్యారు. మొదట సమావేశానికి హాజరయ్యేందుకు అద్వానీ ఇంటినుంచి బయలుదేరినట్టు పార్టీ కార్యాలయానికి సందేశం అందింది. అద్వానీ వచ్చి తన అభిప్రాయం తెలియచేస్తారని అంతా భావించారు. అయితే చివరిక్షణంలో ఆయన తన నిర్ణయం మార్చుకుని ఇంటికే పరిమితమయ్యారు. లోక్‌సభ ఎన్నికలకు మరో ఏడు నెలల వ్యవధి ఉండగా, అంతకంటే ముందు నాలుగు రాష్ట్రాల విధానసభ ఎన్నికలు జరగాల్సి ఉన్న తరుణంలో అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో మోడీకి కీలక బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. బిజెపి మాతృ సంస్థ అయిన సంఘ్ ఆదేశాలకు లోబడి పార్టీలోని ఒక వర్గం నుంచి వ్యక్తమైన అసమ్మతిని ఖాతరు చేయకుండా మోడీకే వచ్చే ఎన్నికల్లో పార్టీకి సారథ్యం వహించే బాధ్యతలను కట్టపెబెట్టింది. దీంతో ఇప్పటి వరకూ నిరాఘాటంగా సాగిన అటల్, అద్వానీల శకానికి తెరదించినట్టయ్యింది.లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ముందుగా ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించటం తమ పార్టీకి ఆనవాయితీగా వస్తోందని రాజ్‌నాథ్ సింగ్ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. 1996 నుంచి సాగుతున్న ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజ్‌నాథ్ తెలిపారు. తమ భాగస్వామ్యపక్షాల నేతలతో చర్చించి వారి సమ్మతి తీసుకున్నట్టు ప్రకటించారు. మోడీ నాయకత్వంలో పార్టీ ఘన విజయం సాధించగలదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంటరీ బోర్డు సమావేశానికి అగ్రనేత అద్వానీ గైర్హాజరుపై రాజ్‌నాథ్ పెదవి విప్పలేదు. సాయంత్రం 5.30గంటలకు ప్రారంభమైన బోర్డు సమావేశం అరగంటలో ముగిసింది. పార్లమెంట్ ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీతోపాటు సీనియర్ నాయకుడు మురళీమనోహర్ జోషి, మాజీ అధ్యక్షులు నితిన్ గడ్కరీ, వెంకయ్యనాయుడు తదితరులు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభానికి ముందు గాంధీనగర్ నుంచి ఢిల్లీకి వచ్చిన మోడీ, నేరుగా పార్టీ కార్యాలయానికి రాకుండా గుజరాత్ భవన్‌కు వెళ్లారు. తన అభ్యర్థిత్వాన్ని బోర్డు ఖరారు చేసిందన్న సందేశం అందిన తరువాతే ఆయన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మోడీ కార్యాలయంలో అడుగుపెట్టక ముందే పార్టీ కార్యాలయంలో చోటు చేసుకున్న పండుగ వాతావరణం, ఆయన రాగానే మరింత ఊపు అందుకుంది. కార్యకర్తలు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రధాన మంత్రి అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన వెంటనే మోడీ వినమ్రతతో శిరసు వంచి నమస్కరించారు. సీనియర్ నాయకుడు జోషికి పాదాభివందనం చేసి పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌కు మిఠాయి తినిపించారు.
ప్రజాశీస్సులు కోరుతున్నా: మోడీ
‘దేశంలోని అన్ని రంగాలు క్లిష్టపరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొత్తం దేశమే సంక్షోభంలో ఉంది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి’ అని బిజెపి ప్రధాని అభ్యర్థిగా ఎంపికైన గుజరాత్ సిఎం నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన తనను అత్యంత కీలకమైన ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ఎంపిక చేసిన పార్టీ రుణం తీర్చుకోవటానికి శాయశక్తులా కృషి చేస్తానని మీడియాకు ప్రకటించారు. సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరిన తాను, వివిధ పదవులు చేపట్టి దేశానికి శక్తిమేరకు సేవలు అందించానని అన్నారు. భగవంతుడు ప్రసాదించిన శక్తితో, అటల్‌జీ, అద్వానీల నేతృత్వంలో వటవృక్షంలా వృద్ధిచెందిన పార్టీలో ప్రతిఒక్కరి సాయంతో మరిన్ని విజయాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయ సాధనకు ప్రతి ఒక్కరూ కఠోర కృషి సలపాలని పిలుపునిచ్చారు. నింగిని తాకిన ధరలు, విపరీతంగా పెరిగిపోయిన అవినీతికి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం సాగించి విజయం సాధించాలని అభిప్రాయపడ్డారు. ప్రజల్లో బిజెపిపై పెరుగుతున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసిన పార్టీ నాయకత్వానికి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు
ఆంధ్ర భూమి దిన పత్రిక సౌజన్యం తో
ఆంధ్ర భూమి దిన పత్రిక సౌజన్యం తో
కమలనాధుడు మోడియే ! బాజపా ప్రధాని అభ్యర్థి గా మోడీ - రాజనాథ్ ప్రకటన
Reviewed by JAGARANA
on
9:33 AM
Rating:
indians waiting 2014 elections and waiting their new progressive Prime Minister Modi Ji
ReplyDelete