హిందూ సమాజం జాగృతం కావాలి - ప్రథమవర్ష సార్వజనికోత్సవంలో ఏలె శ్యాంకుమార్
ఉదాసీనతను విడనాడి హిందూ సమాజం జాగృతం కావల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) పశ్చిమాంధ్ర ప్రాంత ప్రచారక్ ఏలె శ్యాంకుమార్ అన్నారు. మండల పరిధి అన్నోజిగూడ రాష్ట్రీయ విద్యా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సంఘ శిక్షావర్గ ప్రథమవర్ష సార్వజనికోత్సవంలో ఆయన ప్రసంగించారు. దేశంలో బాంబు పేలుళ్లు, మతమార్పిడిలు, ఇతర దేశాల దురాక్రమణను నిరోధించడానికి హిందువులందరూ ఏకం కావాలన్నారు.
ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందు మన దేశంలోనే విజ్ఞానం వ్యాపించిందనీ, అయితే ఐకమత్యం లోపించడం వల్లే వెయ్యి సంవత్సరాలు బానిసత్వంలో మగ్గాల్సి వచ్చిందని అన్నారు. దేశాన్ని తిరిగి ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలపడానికి హెడ్గేవార్ ఆర్‌ఎస్‌ఎస్‌ను నెలకొల్పారని, ఆయన ఆశయ సాధన కోసం 87 సంవత్సరాలుగా సంస్థ కృషి చేస్తోందని చెప్పారు. దేశంలో లంచగొండితనం, కుంభకోణాలు, అత్యాచారాలు, మత మార్పిడిలను తుద ముట్టించాల్సి ఉందన్నారు. ఇందుకోసం పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించే విద్య అవసరమన్నారు. ప్రజల్లో దేశభక్తి కొరవడుతోందని, చైనా బలగాలు భారతదేశంలోకి 19 కిలోమీటర్లు చొచ్చుకువచ్చినా స్పందన లేకపోవడం ఇందుకు నిదర్శనమన్నారు.
సమాజం నాది, దేశం నాది... ధర్మ పరిరక్షణ బాధ్యత నాది అనే భావనలు ప్రతి ఒక్కరూ పెంపొందించుకుంటే ప్రపంచంలో తిరుగులేని శక్తిగా భారతదేశం ఎదుగుతుందని అన్నారు. వార్షికోత్సవంలో భాగంగా ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దండా (కర్రసాము), సూర్యనమస్కారాల వంటి విన్యాసాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో అగ్రి గోల్డ్ సంస్థ ఉపాధ్యక్షుడు అవ్వా సీతారామరావు, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ప్యాట వెంకటేశ్వరరావు, జలపతి, అజిత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
హిందూ సమాజం జాగృతం కావాలి - ప్రథమవర్ష సార్వజనికోత్సవంలో ఏలె శ్యాంకుమార్
Reviewed by JAGARANA
on
8:55 AM
Rating:
No comments: