Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

తొలి గెరిల్లా పోరాట వీరుడు శివాజి - నేడు హిందూ సామ్రాజ్య దినోత్సవం


ప్రపంచ చరిత్రలో తొలి గెరిల్లా పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ. కత్తి పట్టి యుద్ధ రంగంలో శివాజీ కాలుమోపే నాటికి భారతీయ పోరాట యోధులకు విజయమో వీరస్వర్గమో లక్ష్యంగా ఉండేది. 16వ శతాబ్దంలో రంగప్రవేశం చేసిన శివాజీ విజయమే యుద్ధ లక్ష్యంగా నిర్దేశించాడు. ఈరోజు ఓటమి తప్పదనిపిస్తే యుద్ధరంగం నుండి తప్పుకోవాలి, రేపు అనువైన సమయంలో దాడిచేసి గెలవాలి. ఇదీ ఆయన సిద్ధాంతం. ఇలాంటి పోరాటాలు మిగతా ప్రపంచ దేశాల్లో జరిగినప్పుడు వాటినే వారు గెరిల్లా పోరాటం అన్నారు.
ప్రపంచంలో పలు తావుల్లో గెరిల్లా పోరాటాలు జరిగినా శివాజీ మాత్రమే అసాధారణ విజయం సాధించాడు. కేవలం పదిహేనేళ్ళ వయసులో వేయి మంది అనుచరులతో తోరణ దుర్గాన్ని ఆక్రమించుకొని 1645 మార్చి 30న శివాజీ తొలిసారి విజయ పతాకాన్ని ఎగరవేశాడు. ఆ తరువాత దాదాపు 20 సంవత్సరాలపాటు జరిపిన యుద్ధాల్లో అధిక శాతం విజయాలు శివాజీనే వరించాయి. అలాగని పరాజయాలు, పారిపోవడాలు లేవని కాదు. అంతిమ విజయం మాత్రం శివాజీ పక్షమే అయ్యేది. భేషజాలకు పోని వ్యూహాలు, భేషైన అనుచరులే అందుకు కారణం.
బీజాపూర్ సుల్తాన్ ఆజ్ఞతో కర్నూలు సుబేదార్ సిద్ధిజోహార్ 15వేల సైన్యంతో పన్హాలా దుర్గంపై దండెత్తినపుడు సాధారణ పద్ధతుల్లో ఎదురించడం అనువు కాదని అంచనా వేసుకున్న శివాజి, బాజీప్రభు తదితర కొద్దిమంది అనుచరులతో అర్థరాత్రి కోట వదిలి విశాల గఢం వైపుకు పారిపోయాడు. శత్రు సైన్యం శివాజీని వెంబడించింది. విశాలగఢ్ చేరే లోపే శివాజీకి ముప్పుతప్పని పరిస్థితి. మధ్యలో పావనఖేఢ్ వద్ద రెండు కొండల మధ్య సన్నని ఇరుకు దారి. ఒక్కసారి నలుగురికన్నా ముందుకు పోలేరు. ఇక్కడ బాజీప్రభు చూపిన సాహసం అద్భుతం. శివాజీని ఒప్పించి ముందుకు పంపి, కనుమ వద్ద గుప్పెడు సైనికులతో కాపుకాసి అతను శత్రు సైన్యాన్ని అడ్డుకున్నాడు. శివాజీ క్షేమంగా విశాల్‌గఢ్ కోట చేరుకున్న సంకేతం చెవిసోకే దాకా కనుమలో కాలుమోపకుండా శత్రువును నిలువరించి ఆ పోరాటంలో 1660, జూలై 13న బాజీ ప్రభు అమరుడైనాడు.సింహగడాన్ని తల్లి జిజియా బాయి కోరుతున్నది అని తెలిసిన వెంటనే తన కొడుకు పెళ్లి పనులను కూడా పక్కనపెట్టి, 1670, ఫిబ్రవరి 4న సింహగఢ్ కోటపై దాడిచేసి ప్రాణాలు ధారవోసి కోటను సాధించిన తానాజీ త్యాగం ‘‘గఢ్ దక్కింది, సింహం పోయింది!’’ అన్న శివాజీ నిట్టూర్పులో వ్యక్తవౌతుంది. యోగ్యమైన అనుచరులను తయారుచేసుకోవడంతో శివాజీ ప్రతిభకు ఇవి కొన్ని నిదర్శనాలు మాత్రమే. తన సామ్రాజ్యాన్ని కబళిస్తున్న శివాజీని పట్టి తెమ్మని బీజాపూర్ సుల్తాన్ తన సేనాపతి అఫ్జల్‌ఖాన్‌ను పంపినప్పుడు శివాజీ ఒక్కొక్క కోటనే వదిలి పారిపోయాడు. తన పరిమితి సైన్యంతో 29వేల పదాతిదళం, 10 వేల అశ్విక దళం కల్గిన శత్రువును మైదాన ప్రదేశంలో ఎదిరిస్తే ముప్పు తప్పదని భావించిన శివాజీ గెరిల్లా పోరునే ఎంచుకున్నాడు. కొండ కోనల్లో పారిపోతున్న శివాజీని మైదాన ప్రాంతానికి రప్పించడానికి అఫ్జల్‌ఖాన్ పండరిపూర్, తుల్జాపూర్ వంటి పుణ్యక్షేత్రాలను అపవిత్రం చేయడం, స్ర్తిలను హింసించడం ప్రారంభించాడు. నిన్నటివరకు జైశివాజీ! అని నినదించిన ప్రజలే బీజాపూర్ సేనల అకృత్యాలకు తాళలేక శివాజీని అసమర్థుడు, పిరికిపంద అని నిందించడం ప్రారంభించారు. అందుకు శివాజీ కుంగిపోలేదు, రెచ్చిపోయి మైదాన ప్రాంతాల మీదికి ఉరికి రాలేదు. ప్రతాప్‌గఢ్ కోటలోనే ఉండి మంతనాలు సాగించి, తగిన వ్యూహరచన చేశాడు. కొయనా లోయలో తనకు అనువైన చోటికి ప్రత్యర్థి వచ్చేదాకా పిరికివాడిలా ప్రవర్తించి, తన స్థావరంలోకి అతణ్ణి ఒంటరిగా రప్పించాడు, సిద్ధి ఇబ్రహీం తదితర అను చరులు తోడురాగా శివాజీ స్వయంగా వెళ్లి 1659, నవంబరు 10న అఫ్జల్‌ఖాన్‌ను నేర్పుగా మట్టుపెట్టి, విజయాన్ని మరింత ఘనంగా చేజిక్కించుకున్నాడు. అప్పటికి శివాజీ వయస్సు కేవలం 29 సంవత్సరాలే. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా యుద్ధాలు చేయడం అప్పట్లో ఆనవాయితీ. యుద్ధ సమయ నియమాన్ని కూడా గెలిచే అవకాశానికి అనువుగా మార్చుకున్నాడు శివాజీ. పూనా కోటను ఆక్రమించిన ఔరంగజేబు మేనమామ షయిస్తఖాన్‌పై దాడికి 1663, ఏప్రిల్ 15 రాత్రి మూడో జామును అనువైన ముహూర్తంగా నిర్ణయించాడు. తక్కువ శక్తిని ప్రయోగించి, ఎక్కువ ఫలితాన్ని రాబట్టాలనేది ఆయన వ్యూహం. చీకటి మాటున జరిగిన ఈ దాడికి శివాజీ స్వయంగా నాయకత్వం వహించాడు. దాడిలో కొడుకును, తన చేతి వేళ్ళను కోల్పోయిన షహిస్తఖాన్ సిగ్గు చచ్చి పూనా వదిలి ఆగ్రాకు పారిపోయాడు.
1657, అక్టోబర్ 24న కళ్యాణ్‌దుర్గాన్ని జయించాక దుర్గ్ధాపతి పారిపోగా, బందీగా చిక్కిన దుర్గ్ధాపతి కోడలిని తెచ్చి శివాజీ ముందు నిలిపి, స్వీకరించమని కోరినప్పుడు ‘అమ్మా పరస్ర్తి తల్లితో సమానమన్న ధర్మం మరచి నా అనుచరుడు చేసిన అపరాధాన్ని మన్నించు’ అని వేడుకుని సగౌరవంగా, సురక్షితంగా ఆమెను ఇంటికి పంపాడు. స్ర్తిల పట్లే కాక ఖురాన్ వంటి మత గ్రంథాల పట్ల కూడా శివాజీ పలు మార్లు భక్తిశ్రద్ధలను కనబరిచాడు. ‘నా మతాన్ని నేను ఆచరిస్తాను- ఇతర మతాలను గౌరవిస్తాను’ అనే సమదృష్టిని తన అనుచరుల్లో శివాజీ పాదుకొలిపాడు అనేందుకు ఇవి తార్కాణాలు.
దర్సా సారంగ్ నేతృత్వంలో నిర్మాణమైన నౌకాదళంలో సహాయకులుగా ఇబ్రహీంఖాన్, దౌలత్‌ఖాన్ తదితర ముస్లిములు సైతం శివాజీకి అత్యంత విశ్వాస పాత్రులుగా పనిచేశారు. మాయ మాటలతో ఔరంగజేబు శివాజీని ఆగ్రా కోటకు రప్పించి 1666 మే, 29న గృహ నిర్బంధంలో ఉంచిన సందర్భంలో తన అనుచరునికి తనలా వేషం వేసి, కావలివారిని ఏమార్చి మూణ్ణెల్లు తిరక్కుండానే గృహ నిర్బంధం నుండి ఆగస్టు 17న తప్పించుకుపోయాడు శివాజీ. ప్రాణాంతకమైన ఈ సాహస కృత్యంలో శివాజీలా నటించి, అతని వేషంలో వసతి గృహంలో చిక్కుపడిపోయిన సాహసికుడైన శివాజీ అనుచరుడు ఒక ముస్లిము!
ఇక శివాజీని ఉపేక్షించి లాభం లేదని భావించిన బీజాపూర్ రాజు తన కొలువులో ఉన్న శివాజీ తండ్రి శహాజీని 1648 జూలై 28న బంధించి, సజీవ సమాధి చేయనున్నట్లు శివాజీకి కబురు పంపాడు. ఇప్పటివరకు గెల్చిన కోటలన్నింటిని బీజాపూర్ రాజుకు అప్పజెప్పి శివాజీ అపరాధిగా లొంగిపోవాలి, లేదా తండ్రిని కోల్పోవాలి. తన మేధకు పదునుపెట్టిన శివాజి చక్కటి రాజకీయ ఎత్తుగడను ఖరారు చేశాడు. బీజాపూర్ రాజులతో వైరం కలిగిన ఢిల్లీ సుల్తాను షాజహాన్‌తో శివాజీ సంప్రదింపులు జరిపాడు. ఢిల్లీకి సామంతుగా ఉంటానని ప్రతిపాదించి అందుకు ప్రతిగా తన తండ్రికి మొగల్ పాదుషాల కొలువులో సభ్యత్వం అడిగాడు. దక్షిణాన బీజాపూర్ రాజ్యాన్ని అదుపులో ఉంచడానికి ఉపకరిస్తుందనే ఆలోచనతో షాజహాన్ శివాజీ ప్రతిపాదనను ఆమోదించి, ‘శహాజీ తమ సభలో గౌరవ సభ్యుడని, అతని యోగక్షేమాలకు బాధ్యత వహించాలని’ తెలియచేస్తూ బీజాపూర్‌కు శ్రీముఖం పంపించాడు. దాంతో శహాజీ 1649 మే 16న క్షేమంగా విడుదలై భార్యాబిడ్డలను చేరుకున్నాడు. లక్ష్య సాధనకు అడ్డుపడే వాడే శత్రువు, తోడ్పడేవాడే మిత్రుడు. అంతేగాని రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే సూత్రాన్ని పాటించిన శివాజీ కాలాంతరంలో మొగలులతో కూడా తలపడ్డారు.
శివాజీని ఔరంగజేబు ఆగ్రాకు ఆహ్వానించినపుడు కష్టనష్టాలకు సిద్ధమయ్యే బయలుదేరాడు. ఉత్తర భారతాన్ని, ఔరంగజేబు బలాబలాలను అంచనా వేయడానికి అది అనువైన యోజనగా భావించాడు. చిక్కుల్లోపడి, తప్పించుకు రావలసిన పరిస్థితి వస్తే వివిధ ప్రధాన కేంద్రాలలో తనకు సహకరించే వారి సమాచారాన్ని సిద్ధం చేసుకున్నాడు. తన వేగులను ముందుగానే పూనాకు, సమీప పరిసరాలకు పంపాడు. కాబట్టే మొగలు సైన్యం కండ్లు గప్పి శివాజీ ఆగ్రా కోట నుండి క్షేమంగా తిరిగి రాగలిగాడు. అనుసరణీయమైన రాజకీయ వ్యూహకర్తగా శివాజీ చరిత్రలో నిలిచాడు. వివిధ కారణాలవల్ల శివాజి తన రాజ్యానికి దూరంగా ఎంతోకాలం ఉండవలసి వచ్చేది. ఔరంగజేబు ఆహ్వానంతో 1666 మే 3వ తేదీన ఆగ్రాకు ప్రయాణమైన శివాజి, బందీయై, తిరిగి తప్పించుకొని 1666 డిసెంబరు 11వ తేదీకి రాయగఢ్ చేరాడు. దాదాపు ఏడు నెలల కాలం తన రాజ్యానికి దూరంగానే ఉన్నాడు. అయినా సరే రాజ్యవ్యవస్థ ఏమాత్రం లోటుపాట్లు లేకుండా ముందుకు సాగేది.
నలువైపుల నుండి ఎగసి పడుతున్న ప్రమాదాలను ఎదుర్కొంటూ కూడా తన పాలనా వ్యవస్థను సజావుగా ముందుకు సాగించడం శివాజి పాలనా దక్షతకు ప్రత్యక్ష సాక్ష్యం. అవినీతి పరులను, స్ర్తిలను అవమానించే వారిని అత్యంత కఠినంగా శిక్షించాడు. తన రాజ్యంలో జమీందారీ, వతన్‌దారి వ్యవస్థలను రద్దుచేసి వ్యవసాయానికి అనువైన పథకాలను రూపొందించి శివాజి రైతాంగాన్ని ప్రోత్సహించాడు. ఆధునిక సాధనాలను వినియోగించుకున్న శివాజీ తన ఉద్యమానికి సమకాలీన సాంకేతికతను తోడు చేశాడు. ఐరోపా వాసులనుండి తుపాకులను కొన్నాడు. అచ్చు యంత్రాలను సైతం ఉపయోగించుకోడానికి కృషిచేశాడు. యుద్ధ భూమిలో తిరుగులేని విజయాలను సాధించిన శివాజీ పట్ట్భాషేకానికి వర్ణం సమస్య అయింది. కాశీనుండి గంగాజలంతో సహా గాంగభట్టు అనే పండితుడిని రప్పించి, శివాజీ క్షత్రియుడని ఆయనతో ప్రకటన చేయంచి, సమస్త రాజలాంఛనాలతో హిందూ పద పాదుషాహీ బిరుదుతో 1674 జేష్ఠద్ధ త్రయోదశి నాడు రాయగఢ్‌లో పట్ట్భాషేకం జరిపించుకొని సమాజ ఆమోదాన్ని పొందడం ఆఖరి మెట్టు. శివాజీ పట్ట్భాషేకం జరుపుకొని నేటికి 338 సంవత్సరాలు. మానవాళి మనుగడ గురించి తపన చెందుతున్న క్రియాశీలురు, మేధావులు ధైర్యంగా ముందుకు సాగడానికి శివాజీ జీవితం ఒక ఆదర్శంగా నిలుస్తుంది.

Source : AndhraBhoomi 
తొలి గెరిల్లా పోరాట వీరుడు శివాజి - నేడు హిందూ సామ్రాజ్య దినోత్సవం Reviewed by JAGARANA on 9:23 AM Rating: 5

1 comment:

  1. అనువుగాని ఆదర్శాల వల్ల,ఆచరణకి ఆమడ దూరంలో వుండే యుద్ధ పద్దతుల వల్ల ఎంతో గొప్ప భారతీయ సామ్రాజ్యాలు విదేశీయులకి లోబడి దీనులుగా వుండవలసి వచ్చింది.శివాజి లాంటి వీరుడిని మన దేశం జాతీయ మహాపురుషునిగా గౌరవించి పతాకంపై ఆయన చిత్రాన్ని ముద్రించాలి.

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.