Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

జగన్ ఆలయ ప్రవేశంపై ధర్మాచార్యులు ఏమంటారు?

  • - ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668
తిరుమల వెంకటేశ్వరస్వామిని శ్రీ వై.ఎస్.జగన్మోహనరెడ్డి దర్శించుకొన్న (2 ఏప్రిల్- 2012) తర్వాత తన ఉప ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. ఈ సంఘటన చాలా వివాదాలకు దారితీసింది. సీనియర్ కాంగ్రెసు నాయకుడు వి.హనుమంతరావు మాట్లాడుతూ ‘హిందూ ధర్మానికి ద్రోహం జరిగింది. స్వామికి అపచారం చేసిన వ్యక్తిని వడ్డికాసులవాడు క్షమించడు’ అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇంతకూ జగన్ చేసిన ద్రోహం ఏమిటి? అంటే వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించటం. ఇంతకుముందు శ్రీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వై.ఎస్.ఆర్. కాని, జగన్ కాని తిరుపతి వస్తే రెడ్ కార్పెట్ వెల్‌కం ఇచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జగన్ కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ఆయనను రాజకీయంగా ఓడించే నిమిత్తం వి.హెచ్.- పైవిధంగా వ్యాఖ్యానించి ఉండవచ్చు.
ఐతే ఈ వ్యాఖ్యలలో నిజాయితీ తక్కువగా ఉన్నట్లు కన్పడుతుంది. శ్రీమతి సోనియాగాంధీ ఎన్నోసార్లు తిరుమలేశుణ్ణి దర్శించుకున్నారు. అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పినట్లు కన్పడదు. అన్యమతస్థులు ఆలయ ప్రవేశకర్త డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలనే నిబంధన ఒకటి ఉంది. దాని ప్రకారం 2009లో జగన్మోహన్‌రెడ్డి సంతకం పెట్టటం మనకు తెలుసు. పోతే అప్పుడాయన ముఖ్యమంత్రి కుమారుని హోదాలో ఉన్నాడు కాబట్టి ఎవరూ ఎట్టి ఆక్షేపణలూ చేయలేదు. ఇవ్వాళ ముఖ్యమంత్రికీ- ఆయనకూ పడదు కాబట్టి ‘డిక్లరేషను మీద సంతకం పెట్టావా?’ అని అడగటం- ‘లోగడ పెట్టాను’ ఈ జవాబు చెప్పటం అది చాలదు- మళ్లీ మళ్లీ దర్శనానికి వచ్చినప్పుడల్లా సంతకం పెట్టాల్సిందే’నని అడగటం ఇవన్నీ మనం పత్రికలలో చూస్తున్నాము.
మక్కాకు వెళ్లి అక్కడ కాబాను దర్శించుకోవాలంటే కేవలం ముస్లిములకు మాత్రమే ప్రవేశం ఉంది. అలాగే పూరీ- శ్రీరంగం, మధుర, కాశి వంటి దేవాలయాల్లోకి హైందవేతరులను అనుమతించరు. విదేశీ భక్తులు వస్తే ఏంచేయాలి? వారు ప్రత్యేక అనుమతి తీసుకోవలసి ఉంటుంది. 1947కు ముందు హరిజనులకు దేవాలయ ప్రవేశం ఉండేది కాదు. తర్వాత అలాంటి నిబంధనలు సడలింపబడ్డాయి. ఇప్పటికీ తిరుమలలో, షిర్డీసాయిబాబా, శబరిమలై అయ్యప్ప వంటి దేవతల నామస్మరణకు అనుమతి లేదు. ఈ విషయాలన్నీ పరిశీలించిన మీదట దీనిపై వివిధ పీఠాధిపతులు ధర్మాధికారులు ఒకచోట సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకొని నూతన ధార్మిక వ్యవస్థను రూపొందించవలసిన అవసరం ఉన్నట్లు కన్పడుతున్నది. ఇది తిరుమల, శ్రీరంగం, మధురైకి మాత్రమే పరిమితం కాదు జరుసలేం మక్కా వంటి పుణ్యక్షేత్రాల గూర్చి కూడా ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులు ఒక ఆలోచన చేయవలసి ఉంది.
నేను తిరుపతి వెళ్లాను. ఎందుకు? వెంకటేశ్వరుణ్ణి దైవంగా అంగీకరించి దర్శించుకునే నిమిత్తం. ఆయన ఆశీస్సులు స్వీకరించే నిమిత్తం. అలాగే జరుసలేం వెళ్లాను. అక్కడ క్రీస్తు శాంతి బోధలపై గౌరవంతోనే వెళ్లాను కాని మానవ బాంబుగా మారి ఆలయ ధ్వంసం చేయాలనే దృష్టితో కాదు కదా? అంటే ఒక వ్యక్తి ఒక ఆలయంలోకి, చర్చిలోకి, మసీదులోకి వచ్చినప్పుడు అక్కడి దైవాన్ని గౌరవించే ప్రయత్నంలోనే వస్తాడు కాని ద్వేషించే దృష్టితో కాదు. ద్వేషించే వాడయితే జన విజ్ఞాన సమితిలోనో లేక కమ్యూనిస్టు పార్టీలోనో చేరి ఉండేవాడు. జగన్‌కు నిజంగా వెంకటేశ్వరస్వామి మీద గౌరవం లేదు. కేవలం అభిమానుల ఓట్లకోసమే ఈ నాటకం ఆడుతున్నాడు, అని కాంగ్రెసువారు ఆక్షేపించారు. ఇదే నేదురుమల్లి జనార్దన్‌రెడ్డిగారు క్రైస్తవుడు. జయసుధ క్రైస్తవురాలు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి క్రైస్తవుడు. కాసు బ్రహ్మానందరెడ్డిగారి భార్య రాఘవమ్మగారు క్రైస్తవ మతం పుచ్చుకున్నదని నర్సరావుపేటవారు చెప్పారు. ఇది నిజమోకాదో ఇంకా నిర్ధారణకు రాలేదు. ఐతే పైన నేను సూచించిన పేర్లన్నీ దాదాపు ముఖ్యమంత్రి స్థాయిగల వ్యక్తులవే. వీరికి ఆలయ ప్రవేశం లభించిందా? లేదా? ఆనాడు వీరెవరూ డిక్లరేషన్ ఇచ్చినట్లు దాఖలాలు లేవు. ఇవ్వాళ ఈ ప్రశ్న ఎందుకు ఉత్పన్నమయింది! కాబట్టి ఇవి రాజకీయ ప్రమేయమైన అలజడులు అనేది సుస్పష్టం.
డిక్లరేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక వ్యక్తి టూరిస్టుగా కాక పిల్‌గ్రింగా వచ్చి స్వామిని దర్శించుకుంటే అతడు ఏ దేశస్థుడైనాసరే స్వామి దర్శనానికి అనుమతించాలని నా భావన. ‘విదేశీ వ్యసనపరులు’అంటే అది స్వదేశీ భక్తులకు కూడా వర్తిస్తుంది కదా. ఉదాహరణకు గాలి జనార్దన్‌రెడ్డి వంటి అవినీతిపరుడు నలభైఐదు కోట్ల రూపాయల విలువైన వజ్ర కిరీటాన్ని వెంకటేశ్వరునికి సమర్పిస్తే స్వీకరించడానికి ఆలయ అధికారులకు ఎట్టి అభ్యంతరం లేకపోయింది. డేవిడ్ ఫ్రాలే అనే పాశ్చాత్యుడు వేదాభ్యాసం చేశాడు. శ్రీ చక్రంలో జామెట్రీపై ప్రత్యేక పరిశోధన చేసి తన పేరును వామదేవశాస్ర్తీగా మార్చుకొని శిఖ యజ్ఞోపవీతాలు ధరించాడు. ఇతనిని వెంకటేశ్వర దేవాలయంలోకి అనుమతిస్తారా? లేక డిక్లరేషన్ కావాలని అడుగుతారా?
కాబట్టి ఈ చర్చలో నేను లేవనెత్తిన వౌలికాంశం ఏమంటే మొత్తం దైవభావం ఆలయ దర్శనాల విషయంలో మఠాధిపతులు ధర్మాధికారులు పునరాలోచించి యూనిఫాంగా ఒక ధర్మగ్రంథాన్ని తయారుచేయవలసిన అవసరం ఉంది. ఇందులో శృంగేరీ పీఠాధిపతులు బిషప్పులు పోప్‌లు, ముల్లాలు అందరూ పాల్గొనాలి. ఏకం సత్ విప్రాః బహుధ వదంతి’ అనే ఋగ్వేద వాక్యానికి ఇదీ అర్థం!!
తమిళనాడు అనేక దేవాలయాల్లో నేటికీ గర్భగుడిలో మినుకు మినుకు మనే ఆముదపు దీపాలు వెల్గుతుంటాయి. దైవ విగ్రహం కన్పడనే కన్పడదు. విద్యుద్దీపాలంకరణ లేదు. ఆగమశాస్త్రాలు రచించిన నాటికి విద్యుత్తు పుట్టలేదు కాని నేటి పరిస్థితి వేరు. ఇలాంటి విషయం గూర్చి పీఠాధిపతులు ధర్మవిరుద్ధం కాని ఆధునిక దృక్పధం కలిగి ఉండటం మంచిది!!
జేసుదాసు అయ్యప్ప మీద పాటలు పాడాడు- అని చర్చి అధికారులకు కేరళలో కోపం వచ్చింది. అలాగే పార్శీ మతస్థుల్ని వివాహం చేసుకున్న కారణంగా ఇందిరాగాంధీని పూరీ జగన్నాథ దేవాలయంలోనికి రానివ్వలేదు. ఇలాంటి సంఘటనలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ధర్మాధికారులు ఒక నూతన శాసనం వెలువరించే సమయం వచ్చింది.

Source: AndhraBhoomi
జగన్ ఆలయ ప్రవేశంపై ధర్మాచార్యులు ఏమంటారు? Reviewed by JAGARANA on 9:04 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.