పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పొంచివున్న చైనా : ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్
వి కే సింగ్ ఆర్మీ చీఫ్ జనరల్ |
పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనాకు చెందిన సుమారు నాలుగు వేల మంది తిష్ఠ వేశారని, వీరిలో చైనా సైనికులు కూడా ఉన్నారని భారత ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె.సింగ్ బుధవారం వెల్లడించారు. పాకిస్తాన్ ఆక్రమించిన భారత భూభాగంలో చైనా బలగాలు మోహరించడం పట్ల భారత ప్రభుత్వం ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ చైనా వైఖరిలో మాత్రం మార్పు రావడం లేదు. దీంతో భారత, పాకిస్తాన్ సరిహద్దుల్లో అనిశ్చిత, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘అక్కడ మూడు వేల నుంచి నాలుగు వేల మంది వరకు చైనా సిబ్బంది ఉన్నారు. వీరిలో గణనీయ సంఖ్యలో నిర్మాణ పనులు చేసే జట్లు ఉన్నాయి. వారికి రక్షణగా చైనా భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. చైనా సైన్యం (ప్రజా విముక్తి సైన్యం)లో అంతర్భాగమైన ఇంజనీర్ల బృందాలు కూడా ఉన్నాయి’ అని జనరల్ సింగ్ ఇక్కడ విలేఖరులకు చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ బుధవారం ఇక్కడ 16వ ఫీల్డ్ మార్షల్ కె.ఎం.కరియప్ప స్మారకోపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనరల్ సింగ్ విడిగా విలేఖరులతో మాట్లాడారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా బలగాల మోహరింపు గురించి ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వివరాలు వెల్లడించారు. నియంత్రణ రేఖకు సమీపంలో సహా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా హైవేలు, వంతెనలు నిర్మిస్తోందని ఇటీవల భారత ఆర్మీ కమాండర్ ఒకరు వెల్లడించిన విషయం విదితమే. జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితుల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సింగ్ సమాధానమిస్తూ నియంత్రణ రేఖ పొడవునా అటు వైపు ఉగ్రవాదుల వౌలిక సదుపాయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని చెప్పారు. పెద్ద సంఖ్యలో మిలిటెంట్లు జమ్మూకాశ్మీర్‌లోకి చొచ్చుకు రావడానికి ప్రయత్నిస్తున్నారని, అయితే ఎలాంటి పరిస్థితినైనా తిప్పికొట్టేందుకు మన సైన్యం అప్రమత్తంగా ఉందని, మిలిటెంట్ల ప్రయత్నాలు ఫలించబోవని ఆయన పేర్కొన్నారు.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పొంచివున్న చైనా : ఆర్మీ చీఫ్ జనరల్ వికె సింగ్
Reviewed by JAGARANA
on
10:01 AM
Rating:
No comments: