Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఆంగ్లేయులను హడలెత్తించిన ‘ఆగస్టు విప్లవం’


నేడు బ్రిటిష్ వ్యతిరేక భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో ఎంతో విశిష్టమైనరోజు. స్వాతంత్య్ర సమరంలోని ఆఖరి ప్రధాన ఘట్టం క్విట్ ఇండియా ఉద్యమం. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సమూలంగా నిర్మూలించి స్వరాజ్యాన్ని స్థాపించడానికి సాగించిన స్వాతంత్య్ర సమరాలలో తెలుగువారు కూడ ప్రముఖ పాత్ర వహించారు. భారతీయుల ప్రజాశక్తి అమోఘమైనదని బ్రిటిష్ వారికి తెలిసేటట్టు చేసి వారిని లొంగదీయడంలో,దేశాన్ని యావత్తు ముగ్ధులను చేసిన అనేక కార్యక్రమాలు ఆంధ్రులు జరిపారు. బ్రిటిష్ ప్రభుత్వం మన దేశ రాజులను, ప్రజలను నిరాయుధులుగా చేశారు. సంస్థానాధీశులను తమ చేతుల్లో కీలుబొమ్మలుగా మార్చేశారు. ఈ కారణం చేత బ్రిటిష్‌వారిని ఎదుర్కొని స్వాతంత్య్రం సాధించడం శక్తికి మించిన కార్యం అనే భావన దేశంలో వ్యాపించింది. కానీ స్వాతంత్య్ర కాంక్ష సడలిపోలేదు మన భారతీయులలో. బ్రిటిష్ పాలనను తొలగించడానికి సాగించిన అనేక పోరాటాలలో ప్రజలదే ప్రధాన పాత్రగా నిలిచింది. గాంధీ మహాత్ముడు స్వరాజ్యం ప్రజాయుద్ధంతోనే సాధ్యమనీ, సంపూర్ణంగా అహింసతో కూడుకొనిన యుద్ధంతోనే సాధ్యమని సిద్ధాంతీకరించాడు. ఏడు దశాబ్దుల క్రితం 1942లో ఇదేరోజున ప్రారంభమైంది ఈ చారిత్రక విప్లవం. ఆగస్టులో ప్రారంనమైంది కాబట్టి దీనిని ‘ఆగస్ట్’ విప్లవం అన్నారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభమైంది. జర్మనీ నియంత హిట్లర్ చిన్న చిన్న రాజ్యాలను కైవసం చేసుకుని సోవియట్ రష్యాపై కూడ దాడికి పూనుకున్నాడు. భారత ప్రజాభిప్రాయంతో నిమిత్తం లే కుండా భారత సైన్యాన్ని కూడా యుద్ధంలోకి లాగారు బ్రిటిష్‌వాళ్లు.
ఇందుకు నిరశనగా కాంగ్రెస్ మంత్రివర్గాలన్నీ రాజీనామాలు ఇచ్చాయ. ఇంతలో ఇటలీ నియంత ముస్సోలినీ జర్మనీ వైపు చేరి సూయజ్ కాలువను ముట్టడించాడు. జపాన్ పసిఫిక్ దీవులనాక్రమించి బర్మాను కూడా కబళించింది. ఈ పరిస్థితుల్లో ‘్ఫసిజమ్’ జయిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పన్న సంగతిని కాంగ్రెస్ పసిగట్టింది దీనికి వ్యతిరేకంగా యుద్ధం చేయాలంటే భారతదేశానికి జాతీయ ప్రభుత్వాన్ని ఇచ్చేందుకు, సంపూర్ణ అధికారం ఇచ్చేందుకు బ్రిటిష్‌వారు అంగీకరించాలని కోరింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం నిరాకరించింది.దాంతో ప్రజల్లో విప్లవ జ్యోతులు మరోసారి ప్రజ్వరిల్లాయి. బ్రిటిష్ ప్రభుత్వం తెలివిగా 1942 మార్చి 28న ‘సర్ స్ట్ఫార్డ్ క్రిప్స్’ నాయకత్వాన ఒక రాయబారం పంపింది. రాయబారం ముఖ్యోద్దేశం రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి భ్రిటిష్ ప్రభుత్వాన్ని ఇక్కడ శాశ్వత తిష్ఠ వేయించడం.
కానీ బ్రిటిష్ నక్కవినయాలకు కాంగ్రెస్ లొంగలేదు. యుద్ధ సమయంలో పూర్తి బాధ్యతగల జాతీయ ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనను ముందు అంగీకరించిన క్రిప్స్ తరువాత ప్రతిపాదనను నిరాకరించాడు, క్రిప్స్ రాయబారం విఫలమైంది. కనుక బ్రిటిష్‌వారు భారతదేశాన్ని వదిలి వెళ్లాలి. బ్రిటిష్‌వాళ్లు వైదొలగగానే అఖిలపక్ష ప్రతినిధులతో కూడిన జాతీయ ప్రభుత్వం ఏర్పడుతుంది. అది అన్ని వర్గాల ప్రజలకు అంగీకార యోగ్యమైన రాజ్యాంగాన్ని ఏర్పరుస్తుంది. జాతీయ ప్రభుత్వం జపాన్‌తో యుద్ధం సాగిస్తుంది. అందుకై మిత్రరాజ్యాల సేనలను భారతదేశంలో ఉంచేందుకు అంగీకరిస్తుంది. ఈ తీర్మానాన్ని అంగీకరించి బ్రిటిష్‌ప్రభుత్వం భారతీయులకు అధికారాన్ని అప్పగించాలి. ఒకవేళ బ్రిటన్ దేశం వదిలిపోవడానికి నిరాకరిస్తే శాసన ఉల్లంఘనం తప్పదు. స్వాతంత్య్రం కోసం దేశం యావత్తు తనకున్న అహింసాత్మక బలాన్నంతా ఉపయోగించి స్వాతంత్య్రం సాధించి తీరుతుంది. ఈ ఉద్యమ శంఖారావ వేదిక అయిన బొంబాయలో ఆగస్టు 7న జరిగే అఖిల భారత కాంగ్రెస్ సంఘం సమావేశం ఈ తీర్మానాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. గాంధీ ఈ తుది పోరాటానికి ప్రజల హృదయాలను హత్తుకునే నినాదం కోసం అనే్వషణ మొదలుపెట్టారు. ఈ నినాదం బ్రిటిష్‌వారికి భీతి కలిగించేదిగా ఉండాలే కానీ అమర్యాదగా ఉండకూడదు. ఒకరు ‘గెట్ అవుట్’ అని సూచించారు. గాంధీగారు ఇది అమర్యాదగా ఉంది, పైగా మోటుగా ఉందని నిరాకరించారు. రాజగోపాలాచారి ‘రిట్రీట్’, ‘విత్‌డ్రా’ అని సూచించారు. అవి కూడ అంగీకారంగా అనిపించలేదు. ఒక ప్రముఖ కార్యకర్త గాంధీజీకి ఒక ధనస్సును బహూకరించాడు. దానిమీద ‘క్విట్ ఇండియా’ -్భరత్‌ను వదలివెళ్లండి - అని చెక్కి ఉంది. గాంధీ చిరునవ్వుతో ‘అవును’ అని అన్నాడు. ఈ విధంగా ఎన్నుకోబడింది ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నినాదం. ఈ ఉద్యమం సంపూర్ణంగా అహింసాయుతంగా జరగాలని అనుకున్నాడు గాంధీజీ. కానీ బ్రిటిష్ దమన నీతివలన 1857 నాటి తిరుగుబాటును తలపించింది. ముంబయిలో అఖిల భారత కాంగ్రెస్ సంఘం ఈ తీర్మానాన్ని ఆమోదించింది. వ్యతిరేకించిన వారూ ఉన్నారు.1942 ఆగస్టు 8న గాంధీజీ ఉత్తేజభరిత ఉపన్యాసం చేశాడు. సమావేశం పూర్తికాగానే గాంధీ వైస్రాయికి ఉత్తరం రాయడం మొదలుపెట్టారు. కానీ ఆ ఉత్తరం పూర్తికాకముందే గాంధీని అరెస్టు చేశారు. తెల్లవారితే ఆగస్టు 9. అంటే ఉద్యమ ఆరంభంకాకముందే గాంధీతో సహా దేశ అగ్రనాయకులందరినీ అరెస్టు చేశారు. భళ్లున తెల్లవారింది. ప్రజల కోపాగ్ని జ్వాలలు కట్టలు తెంచుకున్నాయి. తెలుగునాట ఈ ఉద్యమం ఎలా నిప్పులు చిందుతూ నింగికి ఎగసిందో పరిశీలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.గాంధీజీ పిలుపుకోసం ఆంధ్రదేశం, యావత్తు ఎదురు చూస్తున్నారు. జూన్, జూలైలోనే ఉద్యమ సన్నాహాలుకోసం బందరులో ఒక పెద్ద సమావేశం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పట్ట్భా సీతారామయ్య, కార్యదర్శిగా కళా వెంకటరావు ఉన్నారు. వీరు చర్చల అనంతరం రహస్య సర్కులర్ ఒకదాన్ని రూపొందించి జిల్లాసంఘాలన్నింటికీ పంపిణీ చేశారు. అదే ఆంధ్రా సర్కులర్‌గా ప్రసిద్ధికెక్కింది. ఈ ఉద్యమాన్ని ఆరు దశలుగా నడపాలని సర్కులర్ సూచించింది. ఆంధ్ర అంతటా టెలిఫోన్ తీగలు తెంపడం, గొలుసులు లాగి రైళ్లు ఆపటం, కార్మికుల సమ్మె జరపడం, వార్తా సౌకర్యాలను విచ్ఛిన్నం చేయడం, వంతెనలను కూల్చడం రైలు పట్టాలను పీకడం వంటి చర్యలున్నాయి. ఇంకా మున్సిపల్ పన్నులు తప్ప మరే పన్నులు చె ల్లించకూడదని మిలటరీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్‌ల ముందు పికెటింగ్ చేయాలని, ప్రభుత్వ ఆఫీసులన్నింటిపైగా జాతీయ పతాకాలు ఎగరవేయాలని ఆంధ్రా సర్కులర్‌లో ఆదేశించారు. వ్యాపారులు బ్యాంకులనుంచి నిధులను, డిపాజిట్లను రద్దు చేసుకుని ఆర్థిక సంక్షోభం తీసుకురావాల్సిందిగా ఆదేశించడమైంది.
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఈ ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని విస్తృత ప్రచారం చేశారు. క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం లేకుండా చల్లారిపోతుందన్న బ్రిటిష్‌వారి అంచనాలు పూర్తిగా తల్లకిందులైనాయి. ఆంధ్రకేసరిని కడప స్టేషన్‌లో అరెస్టు చేసి రాయివేలూరు సెంట్రల్ జైలుకు తీసుకువెళ్లారు. అలాగే దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులు, మాగంటి బాపినీడు, డి.రామసుబ్బారెడ్డి, కల్లూరి సుబ్బారావు, ఎన్.శంకరరెడ్డి, కళావెంకట్రావు, పట్ట్భా, కాశీనాధుని నాగేశ్వరరావు - ఇలా ఎంతోమంది నాయకులను బందీ చేశారు. ఆగస్టు 11న నాయకుల అరెస్టుకు నిరసనగా ప్రతి పట్టణంలోను ఉవ్వెత్తుగా హర్తాళ్‌లు, ప్రదర్శనలు, బహిరంగ సభలు జరిగాయి విద్యార్థులు, కార్మికులు పెద్దఎత్తున ఉద్యమంలోకి దూకారు. ప్రభుత్వం నిర్ఘాంతపోయింది.
హైదరాబాద్ సంస్థానంలో ఉద్యమ స్వరూప స్వభావాలు మరువలేనివి. బొంబాయి సమావేశ సమయంలోనే స్వామి రామానంద తీర్థ మహాత్మాగాంధీని కలుసుకుని నైజాం సంస్థానంలో ఉధ్యమానికి అనుమతి పొందారు. వారు హైదరాబాద్ చేరగానే స్టేషన్‌లోనే అరెస్టు చేసారు. క్విట్ ఇండియా కాలంలో ఇద్దరు హైదరాబాదీయులు ఆబిద్ హసన్ సప్రానీ, సురేష్ చంద్రలు ‘ఆజాద్ హింద్ పౌజ్‌లో చేరారు. హైదరాబాద్‌లోనే కాక ఉస్మానాబాద్, నాందేడ్, ఇంకా అనేక చోట్ల స్టేట్ కాంగ్రెస్ తరఫున మాత్రమే కాక మహారాష్ట్రా పరిషత్. కర్నాటక మహా సంస్థల పక్షానకూడా అనేకమంది సత్యాగ్రహం చేసి జైలుపాలయ్యారు. రెసిడెన్సీ భవనంమీద జాతీయ పతాకాన్ని ఎగురవేసి పద్మజానాయుడు అరెస్టయ్యారు. ఉద్యమ సందర్భంగా హైదరాబాద్ సంస్థానంలో అరెస్టయిన ప్రముఖులలో పండిత నరేంద్రజీ, విమలబాయ్, బూర్గుల రామకృష్ణారావు, వందేమాతరం రామచంద్రరావు, కాళోజీ నారాయణరావు, ప్రేమరాజ్ యాదవ్ ఇంకా ఎందరో ఉన్నారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఉద్యమకాలంలో తెలుగు నాట 21 చోట్ల కాల్పులుజరిపి 39 మందిని చంపారు. 177మందిని తీవ్ర గాయాలపాలు చేశారు.సామూహిక జరిమానాలను 71 ప్రాంతాల్లో విధించారు. దాదాపు 4వేల మందికి శిక్ష వేశారు. గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమంతోపాటు సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ విజృంభణ తోడై మొత్తంమీద అనుకున్న దానికన్నా తక్కువ వ్యవధిలో 1947 ఆగస్టు 15నాటికే అధికారం మన హస్తగతమైంది. భారత ప్రజలు స్వతంత్ర వాయువు లను పీల్చనారంభించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా 1857లో మొదలైన పోరాటం 90 ఏళ్లపాటు సాగి విజయవంతమైంది, దేశం స్వాతంత్య్రం సాధించింది. స్వాతంత్య్ర ఉద్యమంలో కృషి చేసిన అమర వీరులందరికీ అంజలి ఘటించుదాం.
ఆంగ్లేయులను హడలెత్తించిన ‘ఆగస్టు విప్లవం’ Reviewed by JAGARANA on 2:27 PM Rating: 5

1 comment:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.