Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇక చైనా ఆక్రమిత కాశ్మీర్ కానున్నదా?

ఉసిగొల్పుతున్న చైనా, ఆంధ్రభూమి సంపాదకీయం , ఏప్రిల్ 23, 2015


పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లో చైనా ప్రాబల్యం పెరుగుతున్న దృశ్యం వికృతంగా ఆవిష్కృతవౌతోంది! చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్ ఏప్రిల్ ఇరవయ్యవ తేదీన పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌కు చేరడం ఈ ఆవిష్కరణలో సరికొత్త ఘట్టం! గ్వాడార్-కాష్‌గడ్ ఆర్థిక ప్రాంగణం పేరుతో పాకిస్తాన్‌నూ తమ దేశాన్ని మరింత సన్నిహితం చేయడానికి చైనా ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ ‘ఆర్థిక ప్రాంగణం’ ప్రణాళికకు ఇరవై ఒకటవ తేదీన తుది రూపునిచ్చారన్నది మన ప్రభుత్వం గమనించదగిన విపరిణామం! పాకిస్తాన్ దక్షిణాగ్రంలో నైరుతి దిశలో ఉన్న గ్వాడార్ ఓడరేవును దశాబ్దికి పైగా చైనా అధునాతనంగా తీర్చిదిద్దింది. ఈ యుద్ధ రేవును ఇకపై నలబయి ఏళ్లపాటు చైనా అధీనంలో ఉంచడానికి పాకిస్తాన్ ప్రభుత్వం గత వారం అంగీకరించడం ఝీజింగ్ పాకిస్తాన్ పర్యటనకు నేపథ్యం! ప్రస్తు తం ఈ ‘గ్వాడార్-కాష్‌గడ్’ అభివృద్ధి ప్రాంగణం మూడువేల కిలోమీటర్ల పొడవునా ఏర్పడిపోనున్నది! ఈ ప్రాంగణం కారకోరమ్ పర్వత శ్రేణి ప్రాంతంలో మాత్రమే కాక పాకిస్తాన్ అక్రమ అధీనంలో ఉన్న గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రాంతం గుండా విస్తరిస్తోంది. ‘గిల్గిత్-బాల్తిస్తాన్’ ప్రాంతం ఉత్తర కశ్మీర్‌లో నెలకొని ఉంది! అరుణాచల్ ప్రదేశపై చారిత్రకంగా గాని, భౌగోళికంగా గాని ఎలాం టి అధికారం లేని చైనా ఈ మన ప్రాంతం తనదని పేచీ పెడుతోంది! అరుణాచల్‌లో అభివృద్ధి పథకాలకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ తదితర అంతర్జాతీయ సంస్థలు నిధులను సమకూర్చకుండా అడ్డుకుంటోంది. మన ప్రభుత్వాలు అరుణాచల్‌లో రైలు మార్గాలను నిర్మించడం వంటి కార్యక్రమాలు చేపట్టరాదని కూడ చైనా దురాక్రమణదారులు నిర్దేశిస్తున్నారు! చివరికి మన ప్రధానమంత్రి అరుణాచల్‌లో పర్యటించడం పట్ల చైనా దొరతనం వారు రుసరుసలాడిపోతుండడం జగమెరిగిన వాస్తవం! కానీ చైనా ప్రభుత్వం పెద్దఎత్తున పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌లోకి చొరబడిపోయింది! 

దశాబ్దులుగా చొరబడిన చైనా ఈ చొరబాటును వ్యవస్థీకృతం చేస్తుండడం వర్తమాన వైపరీత్యం! చైనా అధ్యక్షుడు భారీగా నిధుల మూటలను మోసుకుని ప్రస్తుతం పాకిస్తాన్‌కు వచ్చాడు! దాదాపు యాబయికి పైగా ఒప్పందాలను కుదర్చుకుని వెడుతున్నాడు. ఇందుకు కృతజ్ఞతగా చైనా అధ్యక్షుడికి పాకిస్తాన్ ప్రభుత్వం వారు ‘నిషాన్ ఏ పాకిస్తాన్’-పాకిస్తానీ రూపం-అన్న సర్వోన్నత బిరుదును ప్రదానం చేసారు. ఒకేరోజున దాదాపు లక్షా డెబ్బయి వేల కోట్ల రూపాయల నిధులను చైనావారు పాకిస్తాన్‌కు సమకూర్చడానికి వీలు కల్పించే ఒప్పందాలు కుదిరిపోయాయి. ఈ నిధులు పాకిస్తాన్ ఓడరేవులను రహదారులను రైలు మార్గాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగించనున్నారు. పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవు నుండి చైనాలోని ఝింజియాంగ్-సింకియాంగ్ వరకూ రహదారులతో రైళ్ల దారులు నిర్మించడం ‘పట్టుదారి’-సిల్క్ రూట్-పునరుద్ధరణ పేరిట చైనా చేపట్టిన కార్యక్రమం. మధ్య ఆసియా నుండి గ్వాడార్ ఓడరేవు వరకు రహదారి, ఇనుపదారి ఏర్పడడం చైనా దురాక్రమణ వ్యూహంలో భాగం! ఈ దురాక్రమణ లక్ష్యం మన దేశాన్ని దిగ్బంధం చేయడం!

మన ప్రభుత్వం ఈ ‘ఆర్థిక ప్రాంగణం’ ఏర్పాటు చేయడంపట్ల పెద్దఎత్తున నిరసన తెలుపవలసిన సమయమిది. గిల్గిత్, బాల్తిస్తాన్ ప్రాంతాలు మనవి! పాకిస్తాన్ ఆక్రమించిన ఈ ప్రాంతంలో దాదాపు అరవై వేల కోట్ల రూపాయల ఖర్చుతో చైనా వాణిజ్య పారిశ్రామిక వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి ఝీజింగ్‌పింగ్ పర్యటన సందర్భంగా ఒప్పందాలు కుదిరాయి. ఈ అరవై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ‘ఆర్థిక ప్రాంగణం’ నిధులు కాక అదనంగా సమకూడుతున్నాయట! 1963లో పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు అప్పగించిన ఆరువేల చదరపు కిలోమీటర్ల ‘కారాకోరం’ ప్రాంతం ఎప్పటికైనా మన అధీనంలోకి రావాలి! గిల్గిత్ బాల్తిస్తాన్‌లు కూడ మనదేశంలో కలవాలి! అందువల్ల ఈ ప్రాంతాలలో చైనా పాకిస్తాన్‌ల దురాక్రమణ మరింత బలపడకుండా నిరోధక చర్యలు తీసుకోవలసిన బాధ్యత మన ప్రభుత్వానిది! 

చైనాతో మనం తక్షణం యుద్ధం చేయకపోవచ్చు, కానీ వాణిజ్య దౌత్య సంబంధాలను నియంత్రించవచ్చు! అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయ మండలులలో వివాదాన్ని దాఖలు చేయవచ్చు! కృష్ణగంగ నదిపై మన ప్రభుత్వం కశ్మీర్‌లో నిర్మించిన ఆనకట్టను పాకిస్తాన్ ప్రభుత్వం అనేక ఏళ్లపాటు వివాదగ్రస్తం చేసింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయమండలిలో వివాదం దాఖలు చేయడం ద్వారా నిర్మాణాన్ని నిరోధించింది. తీర్పు మనకు అనుకూలంగా వెలువడినప్పటికీ ఈ వివాదాన్ని పాకిస్తాన్ సాగదీస్తోంది! అందువల్ల చైనా వారు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్మాణాలు చేపట్టరాదని కోరుతూ మన ప్రభుత్వం మాత్రం ఎందుకు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయమండలిని ఆశ్రయించరాదు?

రెండు లక్షల ఇరవై ఐదువేల కోట్ల రూపాయల ఖర్చుతో పాకిస్తాన్‌లో విద్యుత్ కేంద్రాలను నిర్మించడానికి చైనా అంగీకరించడం చైనా ప్రమేయం ప్రాబల్యం వ్యవస్థీకృతం అవుతున్న తీరునకు మరో నిదర్శనం. ఈ విద్యుత్ కేంద్రాలలో అత్యధికం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని నదులపై నిర్మాణం అవుతున్నాయి. పదిహేడు వేల మెగావాట్ల విద్యుచ్ఛక్తి ఈ కేంద్రాల ద్వారా ఉత్పత్తి కాగలదట! ఇలా జల విద్యుత్ కేంద్రాలను నిర్మించి నిర్వహించడం ద్వారా చైనా ప్రభు త్వం, పాకిస్తాన్ ఆక్రమిత భారత భూభాగాలలో తన ఉనికిని శాశ్వతం చేసుకుంటోంది! 

చర్చల ప్రక్రియ దశాబ్దుల తరబడి కొనసాగుతోంది, మరికొన్ని దశాబ్దుల వరకు కొనసాగవచ్చు! కానీ చర్చలు విఫలమై చర్యల ద్వారా మనం మన భూభాగాలను తిరిగి స్వాధీ నం చేసుకోవడానికి యత్నించవలసిన అనివార్యం ఏర్పడవచ్చు! అలాంటప్పుడు పాకిస్తాన్ దళాలతోపాటు ఆక్రమిత కశ్మీర్‌లో తిష్ఠ వేసిన చైనాతో కూడ మనం తలపడక తప్పదు. ఇందుకోసంమన ప్రభుత్వం దీర్ఘకాల వ్యూహం రచించుకోక తప్పదు! 

పాకిస్తాన్ పెత్తనం పట్ల ఆక్రమిత కశ్మీర్ ప్రజలలో నిరసన అనేక ఏళ్లుగా వ్యక్తవౌతోంది! పాకిస్తాన్-చైనా ఒప్పందాల పట్ల గిల్గిత్ బల్తిస్తాన్ ప్రజలు తీవ్ర నిరసనలు తెలుపుతున్నారు. ‘మేము పాకిస్తాన్ పౌరులం కాము. ఈ పథకాల వల్ల మాకు లాభం లేదు. వాణిజ్యం, లాభాలు పాకిస్తాన్‌కు చైనాకు మాత్రమే దక్కిపోతున్నాయి...’’ అని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్ బల్తిస్తాన్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట! చైనా ఆర్థిక దురాక్రమణ పట్ల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు వ్యతిరేకత ప్రదర్శిస్తుండడాన్ని మన ప్రభుత్వం మనకు అనుకూలంగా మలచుకోవచ్చు...

కానీ మన ప్రభుత్వం పాకిస్తాన్-చైనాల ఉమ్మడి విస్తరణను నిరోధించడానికి వ్యూహ రచన చేయకపోవడం 1989 నుండి కొనసాగుతున్న విధాన వైపరీత్యం!సరిహద్దుల భద్రతకు భంగకరమైన నీతిని మన ప్రభుత్వ నిర్వాహకులు అప్పటినుంచి అమలు జరుపుతున్నారు. సరిహద్దు వివాదం పరిష్కారం కాకపూర్వమే చైనాతో వాణిజ్య బంధాన్ని విడదీయరాని రీతిలో బిగించుకోవడం దూరదృష్టి రాహిత్యానికి నిదర్శనం. 

విదేశీయ వాణిజ్యంలో మనకు అతిపెద్ద భాగస్వామిగా అవతరించిన చైనా పనికిరాని తన వస్తువులతో మన దుకాణాలను ముంచెత్తుతోంది! ఏటా రెండు లక్షల కోట్ల మన వినిమయ ద్రవ్యం చైనాకు తరలిపోతోంది! ఈ వాస్తవాన్ని గుర్తించలేని మన రాజకీయ వేత్తలు చైనా వారి పెట్టుబడులకోసం దేబిరించడం దేశానికి అవమానకరం. దురాక్రమణదారుల పెట్టుబడులు మనకు అవసరమా?

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇక చైనా ఆక్రమిత కాశ్మీర్ కానున్నదా? Reviewed by rajakishor on 9:50 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.