చైనా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ సామాజిక నిఘా!
సరిహద్దుల్లోని కీలక ప్రాంతాల్లో సేవాభారతి, విద్యాభారతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ చర్యలు
దేశ భద్రతకు ముప్పుగా మారుతున్న చైనా కార్యకలాపాలను అదుపు చేయటానికి సామాజిక నిఘా పేరుతో బిజెపి మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది.
సరిహద్దుల్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాల్లో సాంస్కృతిక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతారు. అందుకు సంఘ్ ముఖ్య అంగాలైన సేవాభారతి, విద్యాభారతి కీలకపాత్ర వహిస్తాయి. ఇందులో భాగంగా ముందుగా ఉత్తరాఖంఢ్‌లోని అన్ని బ్లాకుల్లో పాఠశాలలు. వైద్యశాలలను ప్రారంభించి ఏడాది పొడవునా తన వారితో నడుపుతుంది.
కనీస సదుపాయాలు కూడా లభించకపోవటంతో సొంత ఊళ్లను ఖాళీచేసి అనేకమంది ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు. గ్రామాలు ఖాళీ అయిపోయినట్లు గ్రహించగానే నిఘా లేనందున చైనానుంచి అధిక సంఖ్యలో ప్రజలు ఈ గ్రామాలను ఆక్రమించుకుని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఉత్తరాఖంఢ్‌లోని అనేక ప్రాంతాలలో అభివృద్ధి పథకాల జాడ కనిపించకపోవటంతో ఉపాధి లభించక నిరాశకు గురవుతున్న యువతను ప్రలోభపెట్టి దేశ వ్యతిరేకులుగా మార్చటానికి చైనా కృషిచేస్తోంది.
చైనా పాల్పడుతున్న ఈ చర్యలను అదుపుచేయటానికి సంఘ్ ఇప్పుడు రంగంలో దిగుతోంది. ఇప్పటికే సరిహద్దులను ఆనుకుని ఉన్న కొన్ని ప్రాంతాలలో సంఘ్ తన కార్యకర్తలతో ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుపుతోంది. విద్యాభారతి నడుపుతున్న ఈ పాఠశాలల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
ఇప్పుడు ఉత్తరాఖంఢ్‌లోని అన్ని బ్లాకుల్లో ఒక్కొక్క పాఠశాలను ప్రారంభించాలని సంఘ్ ఆలోచిస్తోందని ప్రచార్ ప్రముఖ్ శంకర్ తెలిపాశారు.
ఈ పాఠశాలలను నిర్మించటానికి కావలసిన స్థలాల ఎంపిక పూర్తయిందని, ప్రతి పాఠశాలను విద్యారంగంలో ఆరితేరిన తమవారే నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఇక నుంచి ప్రజలు తమ ఊళ్లను ఖాళీచేసి వెళ్లిపోకుండా నివారించే చర్యలు తీసుకుంటామని, ప్రాథమిక సదుపాయాలను మెరుగుపరుస్తూ ఆర్థికంగా వెసులుబాటు కలిగించే పథకాలను చేపడతామని ఆయన చెప్పారు.
సంఘ్ చేపట్టనున్న కార్యక్రమంపై చైనా అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశాలున్నా మన భద్రతను విస్మరిస్తే విపరీతమైన మూల్యం చెల్లించవలసి ఉంటుందని అన్నారు. మన అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలన్న ఆలోచనకు స్వస్తిచెప్పే సమయం ఆసన్నమయిందన్న సంకేతాన్ని చైనాకు పంపాలన్న లక్ష్యంతో చేపడుతున్న ఈ పథకం విజయవంతం కాగలదన్మ నమ్మకాన్ని శంకర్ వ్యక్తం చేశారు.
చైనా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ఆర్‌ఎస్‌ఎస్ సామాజిక నిఘా!
Reviewed by rajakishor
on
8:53 AM
Rating:
No comments: