ఇదీ.. నిజాంగారి మంచితనం..!
ఇది 26-02-2015 నాటి ఆంద్రభూమి దినపత్రికలో వచ్చిన వరిగొండ కాంతారావు, హనుమకొండ, వ్యాసం.
జనవరి 8 నాటి ఆంధ్రభూమి ఫోకస్‌లో వి.ప్రకాశ్‌గారు ‘వాస్తవాలు చూడాలి’అన్న
శీర్షికన నిజాంలోని మంచితనాన్ని గ్రహించాలని రాసిన వ్యాసం చదివాక ఈ లేఖ
రాయాలనిపించింది. నిజాం మంచితనంగా వారు భావించిన విషయాలకు సంబంధించిన
వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. నిజాం పరువును నడిబజారులో వేలంవేసే పరిస్థితిని పండిత
మదన్‌మోహన్‌మాలవ్యా తెచ్చినందున మాత్రమే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి
నిజాం ప్రభువు విరాళాన్ని ఇచ్చారన్నది బహిరంగ రహస్యం.
2. జైహింద్ ఉద్యమంలో పాల్గొన్నందున హైదరాబాదు రాష్ట్రంలో తమ ప్రవేశాలను
కోల్పోయిన విద్యార్థులకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలను ఇవ్వకూడదన్న
నిబంధనను విధించేందుకుగాను ఆంధ్ర విశ్వవిద్యాలయానికి తాము ఇచ్చిన
విరాళాన్ని నిజాం ప్రభుత్వం వాడుకున్నది. ఈ కారణంగానే సర్ సి.ఆర్.రెడ్డి
కొంతమంది విద్యార్థులకు ఇచ్చిన ప్రవేశాలను రద్దుచేశారు. స్వర్గీయ
పి.వి.నరసింహారావు, భండారు సదాశివరావు వంటి వారు నాగపూరులోనూ తదితర
ఉత్తరభారత విశ్వవిద్యాలయాలలోనూ విద్యనభ్యసింపవలసి వచ్చింది.
3. నిజాం ప్రభుత్వంలో ఉర్దూకు మొదటి స్థానం, మరాఠికి రెండవ స్థానం, తెలుగు
భాషకు మూడవ స్థానం ఇచ్చారు. ‘తెలంగీ బేఢంగి’ అని తెలుగుభాషను అవహేళన
చేసినారు. ఒకానొక సభలో అయితే ఉర్దూలో మాట్లాడండి లేదంటే మరాఠిలో
మాట్లాడండి. తెలుగులో మాట్లాడడానికి వీలులేదు’అని ప్రకటించిన దరిమిలా
భరించలేని అవమానంతో సభనుండి బయటకువచ్చిన తెలుగువారు తమ భాషకు తగుమాత్రపు
గౌరవాన్ని సంపాదించుకొనేందుకుగాను ఏర్పరచుకొన్న సంస్థ శ్రీ కృష్ణదేవరాంధ్ర
భాషా నిలయం.
రావిచెట్టు రంగారావుగారు సుల్తాన్‌బజారులోని తమ ఇంటిని భాషా నిలయము
నిమిత్తము వాడుకొనుటకు ఇచ్చినారు. ఆ స్థలమును ఎంపికచేయుటకు ప్రధాన కారణము
అది ‘రెసిడెన్సీ’కి (నిజాము ప్రభుత్వమునదుపులో నుంచుటకుగాను నియమింపబడిన
బ్రిటీషు ఏజెంటు, నివాస కార్యస్థలమునకు దగ్గరగానుండుట. నాటి ‘రెసిడెన్సీ’యే
నేటి కోఠిలోని మహిళా కళాశాల. ‘రెసిడెన్సీ’ పరిసర ప్రాంతములలో బ్రిటిషువారి
అనుమతి లేకుండా నిజాం చట్టములు చెల్లకుండినవి. ఇది 1901నాటి మాట.
మరింత స్పష్టతకొరకు మరికొన్ని సత్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుట అత్యవసరము.
1. హనుమకొండలో 1904లో స్థాపించిన శ్రీ రాజరాజనరేంద్రాంధ్ర భాషా నిలయానికి
1914లో స్థల సేకరణ జరిగినది. స్థలాన్ని సేకరించిన శ్రీమాదిరాజు
రామకోటీశ్వరరావు ఆ స్థలాన్ని తామిష్టపడడానికి గల కారణాలను వారి ఆత్మకథలో
ఇలా నమోదుచేసికొన్నారు. ‘‘పింజర్ల చివరన, రాజపుత్రులవాడలో, రామాలయాన్ని
ఆనుకొని ఉన్న ఈ స్థలం గ్రంథాలయానికి అనువుగా ఉంటుంది. ఇక్కడైతే ముస్లింల
భయంకూడా ఉండదు.’’
2. హనుమకొండలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో పనిచేసిన ఆంధ్ర
పితామహ మాడపాటి హనుమంతరావుగారు 1910 నుండి 1913వరకు శ్రీ
రాజరాజనరేంద్రాంధ్ర భాషానిలయానికి కార్యదర్శిగానున్నారు. కార్యదర్శి పదవి
సమాజ శాంతికి భంగం కలిగించే పని గనుక ఉద్యోగాన్నైనా వదులుకో లేదంటే
కార్యదర్శిత్వాన్నైనా వదులుకో అని నిజాం ప్రభుత్వం హెచ్చరించింది.
మాడపాటివారు కార్యదర్శి పదవిని మాదిరాజు రామకోటీశ్వరరావుకు అప్పగించారు.
భాషానిలయంలో జరిగే సమావేశాలకు హాజరయ్యేవారిపైన పోలీసు నిఘా ఉండేది.
క్రమంతప్పక భాషానిలయానికి వచ్చే పాఠకులు నెలకొకసారి పోలీసుస్టేషనులో
హాజరువేయించుకొనవలసి వచ్చేది.
3. ఆనాటి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 1881లో హిందువులలో అక్షరాస్యతా శాతం
2.98కాగా 1931నాటికి అది 2.4శాతానికి పడిపోయింది. ముస్లింలలో 1881నాటికి
4.94 శాతంగా ఉన్న అక్షరాస్యత 1931నాటికి 10.35 శాతానికి పెరిగింది. ఇది
ప్రభుత్వ విద్యావిధానం కారణంగానే జరిగిందని వేరే చెప్పనక్కరలేదు.
4. ప్రభుత్వ నిర్వహణలోని తెలుగు మాధ్యమ పాఠశాలల సంఖ్య శూన్యము. ప్రభుత్వ
నిర్వహణలోని ఉర్దూ మాధ్యమ పాఠశాలలకు వచ్చే ఆడ పిల్లల నిమిత్తము ఘోషా
ఏర్పాటుతోనున్న ఎడ్లబండ్లు నడిపేవారు.
5. ఉర్దూ భాషను ప్రోత్సహించే నిమిత్తము ప్రైవేటుగా నడిచే తెలుగు పాఠశాలలపైన
ప్రభుత్వ నిబంధనల కారణంగా 1924నాటికి 4,053గా ఉన్న పాఠశాలల సంఖ్య
1926నాటికి 1,082కి పడిపోయింది.
6. నాటి ప్రముఖ కవులలో ఒకరైన శ్రీ తిరునగరి రామాంజనేయులు తన ఇంటి అరుగుపైన
కూర్చొని తెలుగు దినపత్రికను చదువుకొంటుండగా బహిరంగ స్థలంలో తెలుగు పత్రిక
చదవడం నేరం కనుక జాగ్రత్తగా మసలుకొమ్మని ఆ గ్రామ పోలీసుపటేలు తిరునగరిని
హెచ్చరించినాడట.
ఇవీ ఆరవ నిజాము చివరి రోజులలోనూ, ఏడవ నిజాము తొలినాళ్ళలోనూ తెలుగు ప్రజలు సంతోషంగా గడిపిన దినాలు.
ఇదీ.. నిజాంగారి మంచితనం..!
Reviewed by rajakishor
on
5:59 PM
Rating:
No comments: