Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

'అగ్ని' పరీక్ష నెగ్గాం

ధమారా(ఒడిషా), ఏప్రిల్ 19: ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉన్న అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. గురువారం ఉదయం 8 గంటల 7 నిమిషాలకు ఒడిషా తీరానికి దగ్గర్లోని వీలర్ ఐలాండ్‌లోని క్షిపణి ప్రయోగ కేంద్రం మొబైల్ లాంచర్‌నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి నిర్ణీత లక్ష్యాన్ని ఢీకొట్టి ధ్వంసం చేయడంతో మన దేశం ఖండాంతర క్షిపణి సామర్థ్యం కలిగిన అతికొద్ది దేశాల సరసన నిలిచినట్లయింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాలు మాత్రమే ఖండాంతర క్షిపణి సామర్థ్యం కలిగి ఉన్నాయి. 17.5 మీటర్ల పొడవు, రెండు మీటర్ల చుట్టుకొలత, 50 టన్నుల బరువున్న అగ్ని-5 క్షిపణి సుమారు 1.5 టన్నుల డమీ అణ్వస్త్రాలను మోసుకుని లాంచ్ ప్యాడ్‌పైనుంచి తెల్లటి పొగలను చిమ్ముతూ నింగిలోకి దూసుకు పోయింది.
మూడంచెల్లో లక్ష్యాన్ని చేరుకునే విధంగా రూపొందించిన ఈ క్షిపణి తొలుత 800 కిలోమీటర్ల ఎత్తుకు దూసుకెళ్లిన తర్వాత తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి 5 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి హిందూమహాసముద్రంలో ముందుగా నిర్ణయించిన లక్ష్యాన్ని ఢీకొట్టి ధ్వంసం చేసింది. వాస్తవానికి ఈ క్షిపణిని బుధవారం సాయంత్రమే ప్రయోగించాల్సి ఉండింది. అయితే వాతావరణం అనుకూలంగా లేక పోవడంతో ప్రయోగాన్ని ఈ రోజు ఉదయానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అత్యధునాతనమైన ఈ క్షిపణిని దాదాపు పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతోనే రూపొందించడం విశేషం. చైనాలోని అనేక టార్గెట్లను సైతం ఛేదించగల సామర్థ్యం ఉన్న క్షిపణిని భారత్ తయారు చేయడం ఇదే మొదటిసారి. ప్రభుత్వం స్పష్టంగా ఏ టార్గెట్ గురించి ప్రస్తావించనప్పటికీ మన రక్షణ సామర్థ్యం విషయంలో ఇది నిజంగా మరో మైలురాయి అనే చెప్పాలి. క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసామని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) చీఫ్ వికె సారస్వత్ ఈ ప్రయోగం అనంతరం విలేఖరులకు చెప్పారు.
అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు రక్షణ శాస్తజ్ఞ్రులను రాష్టప్రతి ప్రతిభా పాటిల్, ప్రధాని మన్మోహన్ సింగ్, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కారీ ప్రభృతులు అభినందించారు. అగ్ని-5 క్షిపణి లాంచర్‌పైనుంచి నిట్టనిలువుగా కచ్చితమైన మార్గంలో నింగిలోకి దూసుకెళ్లిందని, క్షిపణి ప్రయాణాన్ని దారిపొడవునా గమనిస్తూ వచ్చిన అత్యధునాతన కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌నుంచి డేటాను సేకరించి విశే్లషించిన తర్వాత క్షిపణి ఎలా పని చేసిందో నిర్ధారిస్తారని సారస్వత్ చెప్పారు. క్షిపణి మార్గమధ్యంలోను, టార్గెట్ వద్ద నిలిపి ఉంచిన మూడు నౌకలు క్షిపణి ప్రయాణాన్ని, చివర్లో టార్గెట్‌ను అది ధ్వంసం చేయడాన్ని వీక్షించాయని డిఆర్‌డిఓ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒక ఖండంనుంచి మరో ఖండానికి ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉన్నందున అగ్ని-5 క్షిపణిని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిగా పిలవవచ్చని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ డైరెక్టర్ ఎస్‌పి దాస్ చెప్పారు.
ఈ క్షిపణి తయారీని ప్రారంభించడానికి ముందు డిఆర్‌డిఓ మరో రెండు ప్రయోగాలు నిర్వహిస్తుందని సారస్వత్ చెప్పారు. ‘ఈ రోజు మేము దేశం కోసం ఓ గొప్ప కార్యం నిర్వహించాం. గత మూడేళ్లుగా మా బృందం చేసిన కృషి ఫలప్రదమైన ఫలితాన్ని ఇచ్చింది’ అని అగ్ని-5 ప్రాజెక్ట్ చీఫ్ సైంటిస్ట్ టెస్సీ థామస్ అన్నారు. పేలోడ్, ఇంజనీరింగ్, వేగం తదితర వ్యవస్థలన్నిటినీ ఈ క్షిపణిలో సమన్వయ పరిచామని, అవి అన్నీ కూడా చాలా విజయవంతంగా పని చేసాయని క్షిపణి వ్యవస్థల పరిశోధన, అభివృద్ధి చీఫ్ కంట్రోలర్ అవినాష్ చందర్ చెప్పారు. 2014 నాటికల్లా అగ్ని-5 క్షిపణి భారతీయ సైన్యం అమ్ముల పొదిలో చేరడానికి సిద్ధంగా ఉంటుందని డిఆర్‌డిఓ సైంటిస్టు ఒకరు తెలిపారు.
'అగ్ని' పరీక్ష నెగ్గాం Reviewed by JAGARANA on 8:33 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.