Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సైనిక నిష్క్రమణకోసం ఎదురుచూస్తున్న బీభత్సం-కుములుతున్న కాశ్మీరం: అనిల్ భట్

ఈశాన్య భారతంలో 1958నుంచి, జమ్మూ, కాశ్మీర్‌లో 1990నుంచి అమలులో ఉన్న సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం (ఎఎఫ్‌ఎస్‌పిఏ)ను ఉపసంహరించుకోవడం, లేదా భద్రతా దళాలకు ఇప్పుడున్న అధికారాలను తగ్గించడం అనే అంశంపై గత ఏడాదిచర్చ జరిగింది, మళ్లీ ఇప్పుడు జరుగుతోంది. సైన్యం మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడినప్పుడు వారికి ఈ చట్టం రక్షణ కలిగిస్తోందని, అలాగే తరచూ హింసకు కారణమవుతోందన్న మేధావుల అభిప్రాయం ఆధారంగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని, లేదా అధికారాలను తగ్గించాలనే డిమాండ్‌పై పలువురు వ్యక్తులు, రాజకీయ పార్టీలు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతోంది. అంతేకాకుండా జమ్మూ, కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులు హత్యల సంఖ్య, చొరబాట్లు తగ్గిన కారణంగా రాష్ట్రంలో మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయన్న వార్తలను కూడా వారు తమ వాదనను సమర్థించుకోవడానికి సాకుగా చూపిస్తున్నారు.
శ్రీనగర్ ప్రాంతంనుంచి ఈ ఏడాది డిసెంబర్‌లో కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని ఎత్తివేయాలని జమ్మూ, కాశ్మీర్ ప్రభుత్వం ఆలోచిస్తోందని ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. సైన్యం అంగీకరించినా, అంగీకరించపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి పెత్తనం ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎత్తివేయవచ్చని కూడా ఆ వార్తలు పేర్కొన్నాయి. ఇంతకు ముందు 2004లో మణిపూర్‌నుంచి కల్లోలిత ప్రాంతాల చట్టాన్ని ఎత్తివేయడం జరిగింది. అందుల్ల బెదిరించి డబ్బులు గుంజడానికి రాష్ట్రంలోని రెండు జాతీయ రహదారులపై పూర్తి పట్టుసాధించిన వివిధ తీవ్రవాద ముఠాలను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఒక వేళ కాశ్మీర్‌లో కూడా ప్రభుత్వం సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లయితే భారత సైన్యం, కేంద్ర పోలీసు విభాగాలు ఖాళీ చేసిన ప్రాంతాలను పాకిస్తాన్ సైన్యం, అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాద తండాలు వెంటనే ఆక్రమించేస్తాయి. జమ్మూ, కాశ్మీర్‌లో పాక్ ప్రభుత్వ యంత్రాంగం సాగిస్తున్న ప్రచ్ఛన్నయుద్ధం పూర్తిగా అంతమయ్యే దాకా వేచి ఉండకుండా కల్లోలిత ప్రాంతాల చట్టాన్నికాని ,సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని కాని ఉపసంహరించుకుంటే అది తొందరపాటు నిర్ణయమే అవుతుంది. ఈ చట్టాలను ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని సైన్యం, రక్షణ శాఖ పట్టుబడడాన్ని సంకుచిత దృష్టితో చూస్తూ, స్థానికులను అణచివేయడానికి, త్వరగా పదోన్నతులు పొందడం కోసం సైన్యం దీన్ని ఉపయోగించుకో జూస్తోందని విమర్శిస్తున్నారు. అయితే దేశ భద్రతా ప్రయోజనాలను, జమ్మూ, కాశ్మీర్‌లోని పరిస్థితులను వాస్తవ దృష్టితో పరిశీలించినట్లయితే సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఇప్పుడున్న రూపంలోనే కొనసాగించాలని సైన్యం కోరడానికి అనేక కారణాలు కనిపిస్తాయి.
గతంతో పోలిస్తే ఈ ఏడాది ఉగ్రవాదుల హింసాత్మక ఘటనలు, చనిపోయిన టెర్రరిస్టుల సంఖ్య, చొరబాట్లు లాంటివి తగ్గి ఉంటే ఉండవచ్చునేమో కానీ పాకిస్తాన్ విధానంలో ఎలాంటి మార్పూ లేదు. అంతేకాకుండా కాశ్మీర్‌లో జరుగుతున్నది స్థానికులు జరుపుతున్న పోరాటం అనే ముసుగులో అక్కడ ఉగ్రవాదులు జరుపుతున్న పోరాటానికి మద్దతును కొనసాగిస్తూనే ఉంది. ఈ పరోక్ష పోరుకు అవసరమైన ఉగ్రవాదుల శిక్షణా శిబిరాలు, ఆయుధాలు, మందుగుండు, భారతీయ భూమిపై కార్యకలాపాలు నిర్వహిస్తున్న టెర్రరిస్టులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం తగిన అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాల సరఫరా, నకిలీ కరెన్సీ సరఫరా, జమ్మూ, కాశ్మీర్‌లోని తీవ్రవాద, వేర్పాటు ముఠాలకు సహాయ సహకారాలు అందించడం లాంటి కార్యకలాపాలన్నీ కూడా యధావిధిగా కొనసాగిస్తూ ఉంది. రాష్ట్ర పోలీసులు, ప్రత్యేక దళాల సమన్వయంతో సైన్యం ముందస్తు ఆపరేషన్లు చేపట్టడం కారణంగానే చొరబాట్లు తగ్గుముఖం పట్టాయే తప్పించి పాకిస్తాన్ మనసులో మార్పు వచ్చో లేక ఉగ్రవాదుల ముఠాలను పూర్తిగా నిర్మూలించడం వల్లనో తగ్గలేదు. ఒక్క వేసవి ప్రశాంతంగా గడిచిపోయినంత మాత్రాన ఈ ‘్భతల స్వర్గం’లో తిరిగి శాంతి నెలకొన్నట్లు కాదు. వాస్తవానికి హిమాలయాల్లో కనుమ దారులు పూర్తిగా మంచుతో మూసుకుపోవడానికి ముందే అధీన రేఖ గుండా కాశ్మీర్‌లోకి చొరబడడానికి ఉగ్రవాదులు ఇటీవల అనేక విఫలయత్నాలు చేస్తున్నారు. కుప్వారా, గురెజ్ సెక్టార్లలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం. రంజాన్ తర్వాత హురియత్‌లోని ముదురువర్గమైన జిలానీ బృందం కాశ్మీర్ లోయలో సంపూర్ణ బంద్‌కు పిలుపునివ్వడం, రాళ్లు రువ్విన ఘటనలు అక్కడ శాంతిభద్రతల స్థితి బాగా లేదనడానికి అద్దం పడుతున్నాయి. సైన్యం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు ఒక్క అధీన రేఖకే పరిమితం కాకుండా సరిహద్దు పొడవునా ఆనుకుని ఉన్న గ్రామాలకు కూడా విస్తరింపజేసారు. ఎందుకంటే సరిహద్దులు దాటి వచ్చిన ఉగ్రవాదులు మొదట ఈ గ్రామాల్లో ఆశ్రయం పొంది ఆ తర్వాత తమ కార్యకలాపాలను ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తూ ఉంటారు. అందువల్ల మిగతా ప్రాంతాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించాక ఇక్కడ దాన్ని వర్తింపజేయడం సాధ్యం కాదు. జమ్మూ, కాశ్మీర్‌లోని పట్టణ ప్రాంతాలు, పెద్ద పట్టణాల్లో ఈ చట్టాన్ని ఉపసంహరిస్తే ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లో ఆశ్రయం పొందే తమ స్థావరాలను బలోపేతం చేసుకోవచ్చు. ఈ స్థావరాలనుంచి ఉగ్రవాదులను ఏరివేయడం అంత సులభం కాదు. అలా చేసేటప్పుడు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు నష్టం వాటిల్లి మళ్లీ హింస చెలరేగవచ్చు.గత కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో హింస తగ్గుముఖం పడుతూ ఉండడానికి మానవ హక్కుల ఉల్లంఘన సంఘటనల విషయంలో సైన్యం కఠినంగా వ్యవహరించడం కూడా ఒక కారణమే. ఇటీవలి సంవత్సరాల్లో సైన్యంపై మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు తగ్గుముఖం పట్టడం దీనికి ఉదాహరణ. నిజానికి ఇటీవలి కాలంలో సైన్యం ప్రధాన పట్టణాలు, నగరాల్లో, జాతీయ రహదారులపై తన ఉనికిని క్రమంగా తగ్గించుకుని ఆ బాధ్యతలను స్థానిక పోలీసులు, సిఆర్‌పిఎఫ్‌కు అప్పగించడానికి ప్రయత్నిస్తోంది. మానవ హక్కుల ఉద్యమ నేతలు కూడా ఈ చట్టాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకు 2010 వేసవిలో కాశ్మీర్ లోయ హింసతో అట్టుడికినప్పుడు 109 మంది పౌరుల మరణానికి ఈ చట్టమే కారణమన్న విమర్శలు వచ్చాయి. అయితే వాస్తవానికి అల్లరి మూకల హింసను చెదరగొట్టే పనిలో సైన్యం నేరుగా పాల్గొన లేదు. అలాగే రాష్ట్రంలో సామాన్య ప్రజల మరణాలు, గాయాలు, ప్రభుత్వ ఆస్తుల నష్టం లాంటి ఏ ఘటన జరిగినా ఈ కరకు చట్టమే కారణమని ఆరోపిస్తున్నారు. వారెంట్ లేకుండానే సోదాలు జరపడానికి, అరెస్టు చేయడానికి, ప్రాణాలు తీసే స్థాయి దాకా బలప్రయోగం జరపడానికి సైన్యానికి ఈ చట్టం అధికారం ఇచ్చినంత మాత్రాన సైన్యం కాశ్మీర్ లోయలో మారణకాండకు పాల్పడుతూ అమాయక పౌరులను హతమారుస్తోందని చెప్పడం సరికాదు. ఈ చట్టంపై సాగుతున్న రాజకీయాలను, సైద్ధాంతిక దుష్ప్రచారాన్ని పక్కన బెట్టి నిష్పాక్షికంగా విచారణ జరిపితే కాశ్మీర్ లోయలో సైన్యం అక్రమ అరెస్టులకు పాల్పడిన, లేదా ఉద్దేశపూర్వకంగా హతమార్చిన ఘటన ఒక్కటి కూడా ఉండదు.
తన పశ్చిమ సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని అణచివేయడానికి పాకిస్తాన్ కొత్త చట్టంచేసిన సమయంలో జమ్మూ, కాశ్మీర్‌లో ఒక్క వేటుతో సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఎత్తివేస్తే ఇనే్నళ్ల శ్రమ, త్యాగాల అనంతరం లోయలో సాధించిన శాంతి అంతా ‘బూడిదలో పోసిన పన్నీరు’ అయిపోతుంది. తమ పెరట్లో పుట్టి పెరిగిన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి సైన్యానికి తిరుగులేని అధికారాలు కట్టబెడ్తూ చట్టం చేసిన ఒక దేశం పొరుగు దేశంలో హింసకు పాల్పడ్డానికి ఉగ్రవాదులకు సకల విధాల సహాయం అందిస్తూ, ప్రోత్సహిస్తూ ఉండడం విడ్డూరం. మారిన పరిస్థితుల్లోల్లో ఇప్పుడు ఆంతరంగిక భద్రతకన్నా కూడా ఎక్కువగా సరిహద్దుల భద్రతపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత మాత్రమే ఈ ప్రత్యేకాధికారాల చట్టాన్ని ఉపసంహరించే విషయాన్ని పరిశీలించాలి
సైనిక నిష్క్రమణకోసం ఎదురుచూస్తున్న బీభత్సం-కుములుతున్న కాశ్మీరం: అనిల్ భట్ Reviewed by JAGARANA on 8:17 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.