Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

తరతరాల బూజు వదిలిన వేళ- వెంకటరామారావు

ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభభాయ పటేల్‌కు ,1948లో, నిజాం వినమ్రతతో అభివాదం చేసినప్పటి దృశ్యం
దేశ స్వాతంత్రోద్యమ సందర్భంగా హైదరాబాద్ సంస్థానంలో జరిగిన పోరాటం కీలకమైనది. స్వాతంత్య్ర భారతదేశం అవతరించిన 13 నెలల తరువాత మాత్రమే పూర్వ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో అంతర్భాగమైంది.క్రీ 1948 సెప్టెంబర్ 17వతేదన నిజాం బేషరతుగా లొంగిపోవడంతో ఇది సాధ్యమైంది. హైదరాబాద్‌ను స్వాధీనం చేసుకునేందుకు మేజర్ జనరల్ జె.ఎన్.చౌధురీ నాయకత్వంలో భారత సైనిక దళాలు నిజాం రాష్ట్రంలో ప్రవేశించడంతో , గత్యంతరం లేక నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఎలాంటి ప్రతిఘటన చేయకుండా లొంగిపోయాడు. 1947 ఆగస్టులోనే స్వాతంత్య్రం ప్రకటించుకుని ప్రత్యేక దేశంగా హైదాబాద్‌ను కొనసాగించాలని ఆయన ఉవ్విళ్లూరినా చివరకు ప్రజల అభిమతానికి తలవంచక తప్పలేదు. దేశానికి ప్రధాన శత్రువులు బ్రిటిష్ వారే కనుక నిజాం నియంతృత్వం అంతమొందించడం కన్నా దేశానికి బ్రిటిష్ పాలకులనుంచి స్వాతంత్య్రాన్ని సాధించడం ప్రజల ప్రధాన కర్తవ్యమైంది. కనుక నిజాంని లొంగదీసుకోవడానికి ఆలస్యం జరిగింది.
సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు ప్రభృతులు 1930లో జోగిపేటలో సమావేశమై ఆంధ్ర మహాసభను నెలకొల్పారు. ఈ బీజా వాపనతో ఆంధ్రోద్యమం రాజ్యమంతా వ్యాపించింది. ప్రజలకి వెలుగు చూపింది. అంతవరకు రాష్ట్ర ఉద్యమం నగరంలోనే ఉండేది. ఆంధ్రులు గ్రామ సీమకు పోయి ఆంధ్రులలో ఐకమత్యం, చైతన్యం, విద్య, స్ర్తి వికాసం మొదలైన వాటికి కారకులై తాము మేల్కొని ఇతరులను మేల్కొలిపారు. ఆంధ్ర జనసంఘం ఆవిర్భావం తరువాతనే మహారాష్ట్ర,కన్నడ పరిషత్తులేర్పడ్డాయి.నాయకులు తెలుగు భాషను, సంప్రదాయాలను అభివృద్ధిపరచవలసిన అవసరంఉందని దానిపై దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నారు. గ్రంథాలయోద్యమాన్ని నిర్మించవలసిన అవసరాన్ని కూడ గుర్తించారు. చిత్రంగా అప్పట్లో ప్రజలకు వారి మాతృభాషలో చదువుకునే హక్కు కూడా లేకపోయింది. ఉర్దుకు ప్రాముఖ్యత ఎక్కువ. తెలుగు మీడియం పాఠశాలలు తెరవడానికి నిజాం ప్రభుత్వంనుంచి ముందుగా అనుమతి పొందాలి.
ఆంధ్ర మహాసభ కలిగించిన చైతన్యం యువతలో స్వాతంత్య్ర కాంక్ష కలిగించింది. వెట్టి చాకిరీ నిర్మూలన, భూమిలేని వారికి భూములు పంపిణీ వంటి అంశాలపై పోరాడేందుకు ఆంధ్ర మహాసభ ఛత్రంకింద వివిధ బృందాలు రూపొందాయి. క్రమంగా ఆంధ్ర మహాసభ ఆందోళన ప్రాజాస్వామికఉద్యమంగా రూపాంతరం చెందింది. మరాఠీ, కన్నడం మాట్లాడే ప్రాంతాలలో ఇదే విధమైన డిమాండ్లు వినవచ్చాయి. ఫలితంగా నిజాం అందరూ భావిస్తున్నంత సౌమ్య పాలకుడు కాదనే విషయం విదితమైంది. స్వాతంత్య్ర సమరంలో పాల్గొనే వారిని అణచివేసే మొదట ప్రయత్నం కింద నిజాం 1938లో కాంగ్రెస్ కార్యకలాపాలపై నిషేధం విధించాడు. ఆంధ్ర మహాసభకు చెందిన అతివాదులలో కొందరు కమ్యూనిస్టులుగా మారారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా వారు గ్రామీణ ప్రాంతాలలో ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. హైదరాబాద్‌లో విపరీత పరిస్థితులు చక్కబడేవరకు న్యాయస్థానాలలో హాజరు కాలేమని న్యాయవాదులు నిర్ణయించారు. ఒకవిధంగా ఇది అపూర్వ సంఘటన. సహాయ నిరాకరణోద్యమ కాలంలో కూడా విజయవంతంగా జరగని కోరుల్ట బహిష్కరణ కార్యక్రమం ఇక్కడ సంపూర్ణంగా జరిగింది. స్టేటు కాంగ్రెస్ తన ఉద్యమాన్ని ఉద్ధృతం చేసింది. దౌర్జన్యాన్ని దౌర్జన్యంతో ఎదుర్కొంది. ఈ ఉద్యమం దావానలంలా రాష్టమ్రంతా వ్యాపించింది. ఈ ఉద్యమ కాలంలో 14వేల మంది వాలంటీర్లు అరెస్టయ్యారు. 15 వేలమంది విద్యార్థులు పాఠశాలను బాయ్‌కాట్ చేశారు. ఆరువేలమంది గ్రామోద్యోగులు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వానికి ఎక్సయిజ్ ఆదాయం తగ్గించడానికి అనేక చోట్ల తాటి, ఈతచెట్లను నరికివేశారు. నిజాం ప్రభుత్వం ఏటా వసూలు చేసే లెవీ సగానికైనా వసూలు కానివ్వకుండా చేశారు. ఈ పోరాటంలో 615 చోట్ల పోలీస్‌స్టేషన్లను రజాకార్ల శిబిరాలను తుడిచిపెట్టేశారు. పరిటాల జాగీరులో 7 గ్రామాలు, ఇటగి జాగీరులో 13, గుల్బర్గా జిల్లాలో 17, పర్భనీ జిల్లాలో 24, ఔరంగాబాద్ జిల్లాలో 19, ఉస్మాన్‌బాద్ జిల్లాలో 65 గ్రామాలు స్టేటు కాంగ్రెస్ నాయకత్వంలో స్వతంత్ర ప్రభుత్వాలు స్థాపించుకుని నిజాం ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్నాయి. అనేక రైల్వేలైన్లు విచ్ఛిన్నం చేయబడ్డాయి. నిజాం రెండవ కుమారుడు మొహజంజా తండ్రికో లేఖ రాస్తూ లాయక్ అలీ సంస్థానాన్ని సర్వనాశనం చేయనున్నాడనీ ఆవేదన చెంది తనకు ఐదుకోట్ల రూపాయలిస్తే దేశంలోని మరో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోగలనని తెలియబరిచాడు. మజ్లిస్‌కు చెందిన సాయుధ వర్గీయులే రజాకార్లు. వారి దౌర్జన్యాలకు అంతులేకుండా పోయింది. అత్యాచారాలు, లూటీలు, హత్యల సంఖ్య నానాటికీ పెరుగుతు వచ్చినవి 1947లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం హైదరాబాద్ ఆంతరంగిక వ్యవహారాలలో ఒక ఏడాదిపాటు జోక్యం చేసుకోకూడదు. అలాగే నిజాం ఇండియన్ యూనియన్ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎటువంటి పనులు చేయకూడదు. దీన్ని యధాతథ స్థితి ఒడంబడిక అన్నారు. కానీ ఈ విరామ కాలాన్ని రజకార్లు దుర్వినియోగపరిచారు. ‘నిజాం పాదాలను కడిగేందకు బంగాళాఖాతం, అరేబియా సముద్రం జలాలను ఉపయోగించడం జరుగుతుందని దక్కనుకు చెందిన ఆసఫియా పతాకం ఢిల్లీలోని ఎర్రకోటపై రెపరెపలాడే రోజు ఎంతోదూరంలో లేదు అని రజాకార్ల నాయకుడు కాసిం రజ్వీ ప్రకటించిన తీరే వారిలో వివేకం పూర్తిగా నశించిపోయందనడానికి నిదర్శనం. గాంధీజీ మృతికి సంతాప సూచకంగా హైదరాబాద్‌లోని నిజాం కళాశాల మైదానంలో 1948 ఫిబ్రవరి 5న జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాసిం రజ్వీ ఈ విధంగా అనుచిత ప్రసంగం చేశాడు.ఉర్దు పత్రిక ఇంరోజ్ ఎడిటర్ షోయబుల్లా ఖాన్‌ను 1948 ఆగస్టు 22న హత్య చేసిన ఘటన చివరకు చరిత్రను మలుపు తిప్పింది ముస్లింల ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాసిన వారి చేతులు నరుకుతామని రజ్వీ హెచ్చరించిన వారానికే ఈ హత్య జరిగింది. షోయబుల్లాఖాన్‌ను కాల్చి చంపే ముందు హంతకులు ఆయన చేతులను నరికివేశారు. అసమ్మతి ధ్వనులపట్ల ఇలా పూర్తి అసహనాన్ని ప్రదర్శించడం తీవ్ర ప్రకంపనలు సృష్టించింది.
పాకిస్తాన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కాసిం రజ్వి. లాయక్ అలీ బావమరిది మోహిన్నవాజ్ జంగ్ సారధ్యంలో ఒక ప్రతినిధి వర్గం కరాచీకి పోయింది. అనారోగ్య కారణాలవల్ల ఈ ప్రతినిధివర్గానికి జిన్నా ఇంటర్వ్యూ లభించలేదు. గత్యంతరం లేక తానే కరాచీకి పోదామనుకున్నాడు రజ్వీ. కాని జిన్నా 1948 సెప్టెంబర్ 12న మరణించాడు. సెప్టెంబర్ 13న పోలీసు చర్య ప్రారంభమైంది.
అసత్య వార్తలు ప్రచారం చేయడానికి దక్కను రేడియో పెట్టింది పేరు. ధైర్య సాహసాలతో నిజాం సేనలు,రజాకారు వీరులు భారత సైన్యాలను చిన్నాభిన్నం చేసివేస్తున్నాయని, విజయపరంపరలో తమ సైన్యం ముందుకు సాగిపోతున్నదని దక్కను రేడియో గంటకోసారి ప్రసారాలు మొదలుపెట్టింది. నల్దుర్గు కోట మూడు నెలల దాకా అడుగు ముందుకు వేయకుండా ఆపగల స్థితిలోఉందని దక్కను రేడియో ప్రచారం చేసింది.నిజానికి జరిగిందేమిటంటే భారత సైన్యాలు నల్దుర్గుని నాలుగు గంటల్లో ఆక్రమించాయి. తమ సైన్యాల గోవా చేరుకుంటున్నాయని కూడా దక్కను రేడియో చెప్పింది. ఇది ఎంత హాస్యాస్పదం. యుద్ధ సమయంలో ఆయుధాలు కావాలని రజకార్లు మొత్తుకున్నారు. సిడ్ని కాటన్ దొంగచాటుగా తెచ్చిన ఆయుధాలు పనికిరాలేదు. వాటి ప్రయోగం నిజాం సైనికులకు తెలియదు. భారత సైన్యం హైదరాబాదులో ప్రవేశించగానే పాకిస్తాన్‌కు పారిపోదామనుకున్నాడు రజాకార్ నాయకుడు కాసిం రజ్వీ. అంతలోనే విమానం వెళ్లిపోవడంతో అతను పట్టుబడ్డాడు. అతనికి ఏడు సంవత్సరాల శిక్ష పడింది. పోలీసు చర్య పేరుతో సైనిక చర్య చాలా సాఫీగా సాగిపోయింది. 1948 సెప్టెంబర్ 13న ప్రారంభమైన ఈ చర్య 17న పూర్తయింది. హైదరాబాద్‌లో భారత త్రివర్ణ పతాకం- తిరంగా ఝండా- రెపరెపలాడింది. జనరల్ చౌధురీ మిలటరీ గవర్నర్ అయ్యాడు ఆయన రాజధానిలోను, జిల్లాల్లోను మతకలహాలు చెలరేగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. ఒక్క సైనికుడు కూడా విజయగర్వంతో నగరంలో తిరగలేదు. తమ బారుకేసులలోనే ఉండిపోయారు..

Source
తరతరాల బూజు వదిలిన వేళ- వెంకటరామారావు Reviewed by JAGARANA on 7:39 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.