యోగులు సాగిన మార్గమిది - Vijayavipanchi
యోగులు సాగిన మార్గమిది
లోకములేలిన దుర్గమిది
శాశ్వత శాంతుల స్వర్గమిది
భగవాధ్వజ ఛాయలలో మాయని భరతావని దిగ్విజయమిది
రాయకి రప్పకి చెట్టుకి చేమకి చరాచారమ్ములకన్నిటికి
నతమస్తకమౌ నతులు సలపు పరమోన్నతమౌ ఘన సంస్కృతిది
వినయము విద్యాభూషణములు కల విమల మనస్కుల వీడు ఇది
దురహంకారము దరి చేరని మహనీయ జీవనుల మార్గమిది || యోగులు ||
సరళ జీవనము విరల చింతనము అవిరళ సరళి గణించినది
ఆద్యంతములకు అటు నిటు నిలిచి ఆనందము పరికించినది
గీతా జ్యోతిని ఒసగి చేతముల చేయూతగా నడిపించినది
అజ్ఞానమునకు అందని ద్రష్టలు కాంచిన కాంచన స్వప్నమిది || యోగులు ||
కాలుడు రేపిన చీకటి ధూళి రక్కసి మూకల కర్కశ కేళి
విసరిన వికృత విష వలయమ్మున విస్మృతి పొందిన విభవమిది
పండిన పాపము పండగ కేశవుడవతరించు సంకేతమిది
హాలహలమును ఆరయించుకోను అమృత హృదయుల స్వర్గమిది || యోగులు ||
Powerd by Vijayavipanchi.org
యోగులు సాగిన మార్గమిది - Vijayavipanchi
Reviewed by JAGARANA
on
12:14 PM
Rating:
No comments: